సాక్షి, కర్నూలు: ‘కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. పది రోజుల్లోనే టమాటా ధర కిలోపై రూ. 30 పెరిగింది. కిలో కొనేవాళ్లం అర కిలోతో సర్దుకు పోవాల్సిన పరిస్థితి. ఏ రకం కూరగాయలు కొందామన్నా కిలో రూ. 30 పైనే ధర పలుకుతోంది. పోయిన వారం టమాటా రూ. 30 ఉంటే ఈవారానికి రూ. 60కు చేరింది. పచ్చిమిర్చి ధర రూ. 20 నుంచి రూ. 40కి పెరిగింది. టమాటా, పచ్చిమిర్చికే రూ. 100 అయిపోతే మిగిలిన వాటిని ఎలా కొనాలి. రూ. 200 తీసుకువస్తే సంచి నిండా కూరగాయలు వచ్చేవి.
ఇప్పుడేమో రైతుబజార్‌కు రావాలంటే రూ. 500 కావాలి. ప్రభుత్వం ధరలను నియంత్రించాలి’.. అంటూ సీ-క్యాంపులోని రైతు బజార్‌ను పరిశీలించిన పౌరసరఫరాల శాఖ మంత్రి సునీతను ప్రజలు నిలదీశారు. బుధవారం మంత్రి జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో సీ-క్యాంపులో ఉన్న రైతు బజార్‌ను పరిశీలించి అక్కడి రైతులతో కూరగాయల ధరలు అడిగి తెలుసుకున్నారు. మహ్మద్ ఫరూక్ అనే వ్యక్తి దోసకాయలు కొనుగోలు చేస్తుండగా మంత్రి సునీత అతనిని పలకరించి.. వాటి ధర ఎంతుంది? అని అడగ్గా.. ‘రైతుబజార్‌లో ఇప్పుడు అతి తక్కువ ధరకు లభిస్తున్నది దోసకాయలేనని, ఏది కొనాలన్నా కిలో రూ. 30 పైనే ఉన్నాయని, కిలోల స్థానంలో అరకిలోతో సర్దుకుపోవాల్సి వస్తోంద’ని అతను వాపోయాడు.
ప్రభుత్వం ఉందా? లేదో? తెలియడం లేదని.. ధరలు ఇలాగే పెరుగుతూ పోతే సామాన్యలు బతికేదెట్లా? ధరలు నియంత్రించండని మంత్రిని కోరారు. వినియోగదారులకు సరిపడా సరుకులు రైతుబజార్‌కు రావడం లేదని, దీంతో సాయంత్రంలోగా కూరగాయలు ఉండట్లేదని కూరగాయలు కొనేందుకు వచ్చిన ఓ జంట మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామంటూ మంత్రి వారికి సమాధానం చెబుతూ అక్కడి నుంచి ముందుకు కదిలారు. చివరగా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కౌంటర్‌ను పరిశీలించి.. ఉల్లి, బియ్యం ధరలను ఎంతకు విక్రయిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు రాష్ట్ర విశ్రాంతి భవనంలో విలేకరులతో మాట్లాడుతూ.. కర్నూలుతో తమ కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉందని అన్నారు. పరిటాల రవిని అభిమానించే వారు ఇక్కడ ఎంతో మంది ఉన్నారని తెలిపారు.
రైతులకు గిట్టుబాటు ధర..వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు అందించడంతోపాటు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా పౌరసరఫరాల శాఖ ప్రణాళికలు రూపొందిస్తోందని ఆ శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. ఏటేటా కూరగాయ పంటల విస్తీర్ణం పెరుగుతోందని, కూరగాయల ధరలలో నిలకడ లేకపోవడంతో రైతులు ఏటా నష్టపోతున్నారన్నారు. దీనికి తోడు మార్కెట్‌లో దళారీ వ్యవస్థ వేళ్లూనుకుపోవడంతో పంట పండించిన రైతుల కంటే దళారులు అధికంగా ఆర్జిస్తున్నారన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.
ప్రభుత్వం ఉందా?
Published Thu, Jul 17 2014 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 10:23 AM
Advertisement