విజయనగరం : చోరీ సొత్తు రికవరీలో పోలీసులు చేతివాటం ప్రదర్శించారా? రికవరీ సొత్తును బాధితుడికి అందజేసినప్పుడు చిలక్కొట్టుడికి పాల్పడ్డారా? జిల్లా ఎస్పీని కింది స్థాయి అధికారులు తప్పుదోవ పట్టించా రా? చోరీ సొత్తు రికవరీలో నిత్యం ఇదే తంతు నడుస్తుందా? అంటే కుసుమగజపతినగర్‌లో జరిగిన చోరీ సొత్తు రికవరీ, బాధితునికి అందజేసే విషయంలో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే అవుననే అనుమానాలు కల్గిస్తున్నాయి. ఇప్పుడా పోలీసులపై డీజీపీ, ఐజీ, డీఐజీ, ఎస్పీకి లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. సొత్తు రికవరీ, ఆభరణాల తూకంలో జరిగిన అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరిగి న్యాయం చేయాల్సిందిగా ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నారు.
ఇప్పుడిది పోలీసు శాఖలో చర్చనీయాంశమయింది. వివరాల్లోకి వెళ్లితే... విజయనగరం కంటోన్మెంట్‌లో గల కుసుమ గజపతినగర్‌లో నివాసముం టున్న పి.ఎస్.ఎన్.రాజు(సాంబరాజు) ఇం ట్లో గత ఏడాది నవంబర్ ఒకటో తేదీన అర్ధరాత్రి సమయంలో దొంగలు చొరబడి పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలతో పాటు వెండి ఆభరణాలు దొంగిలించారు. వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కేసును విచారించారు. మొత్తానికి ఈ కేసులోని నిందితుల్ని పోలీసులు పట్టుటున్నారు. నిందితులు నేరాన్ని అంగీకరించారు. దీనిపై ఎస్పీ నవదీప్ సింగ్‌గ్రేవాల్ డిసెంబర్ 22వ తేదీన ప్రెస్‌మీట్ పెట్టి నిందితుల వివరాలను తెలియజేశారు.
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బమ్మిడి సంతోష్, రౌతు దివాకర్‌తో పాటు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం కొర్లకోటకు చెందిన పంచాది కాళీ ప్రసాద్ దొంగతనానికి పాల్పడ్డారని, వీరిపైన తొమ్మిది పాత కేసులు పెండింగ్ కేసులున్నాయని తెలిపారు. వారి వద్ద నుంచి ఆయా కేసులకు సంబంధించి రికవరీ వివరాల్ని తెలియజేశారు. ముఖ్యంగా కుసుమ గజపతినగర్‌లోని సాంబరాజుకు సంబంధించి 530.27గ్రాములు( 45.87తులాల) బంగారు ఆభరణాలు, 12కిలోల వెండి ఆభరణాలను రికవరీ చేసినట్టు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు.
రికవరీ చేసిన వాటిలో 12.45తులాల రోల్డ్ గోల్డ్ ఆభరణం కూడా ఉందని వివరించారు. అయితే, ఆ రికవరీ సొత్తును ఎస్పీ ప్రెస్‌మీట్ పెట్టి 45 రోజులు గడిచినా అప్పగించకపోవడంతో బాధితుడికి అనుమానం వచ్చి, పోలీసు అధికారులను గట్టిగా అడిగారు. దీంతో మొదటిగా బంగారు మొలతాడు, పలు వెండి ఆభరణాలు ఇంటికి తీసుకువచ్చి ఇచ్చినట్టు బాధితుడు చెబుతున్నాడు. అనంతరం కోర్టు ఆర్డర్ తీసుకుని వన్ టౌన్ పోలీసులకు చూపగా మిగతా బంగారం. వెండి అభరణాలను ఈనెల 2వ తేదీన అందజేశారు. ఇక్కడే గమ్మత్తు చోటు చేసుకుంది. ఎస్పీ ప్రెస్‌మీట్‌లో 530.27(45.87తులాలు)గ్రాముల బంగారు ఆభరణాలు రికవరీ చేసినట్టు చెప్పగా స్టేషన్ అధికారులు 439.6గ్రాముల బంగారు ఆభరణాల్ని, 12 కిలోల వెండి ఆభరణాలను మాత్రమే అందించారు.
వీటిని తీసుకెళ్లి తనిఖీ చేసేసరికి పోలీసులిచ్చిన చిన్న నల్లపూసలదండ(9.5గ్రాములు), బంగారం లాం టి పట్టీలు(12.4గ్రాములు), 8 పేటల చైను(16.9గ్రాములు) రోల్డ్‌గోల్డ్ ఉంది. వీటిని తీసిస్తే నికర బంగారం 400.8(34.67తులాలు)గ్రాములున్నట్టు అయింది. అంటే దాదాపు రికవరీ చేసిన సొత్తులో దాదాపు 130గ్రాములు బాధితుడికి చే రలేదు. ఈ సొత్తు ఎక్కడికెళ్లింది? రికవరీ సొత్తులో ఎవరైనా చేతివాటం ప్రదర్శిం చారా? లేదంటే బాధితుడికి అందజేసిన సమయంలో కొంత పక్కన పెట్టారా? అన్న అనుమానం కల్గిస్తోంది. ఇదిలాఉండగా, బాధితుడు తన ఇంట్లో పోయిన సొత్తు సుమారు 60 తులాల వరకు ఉంటుందని, తొలిసారి ఫిర్యాదులో అన్నీ చెప్పలేకపోయానని మరో వాదన విన్పిస్తున్నాడు.
అయితే, తర్వాత చెప్పిన విషయాల్ని ఫిర్యాదులో పేర్కొనలేదని, తొలి ఫిర్యాదులో లేని ఆభరణాలను కూడా నిందితుల్ని నుంచి రికవరీ చేసి తమకివ్వలేదని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఒకవేళ తొలి ఫిర్యాదు చేసినవాటికి మించి లేవని పోలీసు అధికారులు భావిస్తే అందులో పేర్కొనని బంగారు మొలతాడును ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నాడు. ఈ విషయమై సంబంధిత పోలీసు అధికారుల్ని ఎన్ని మార్లు అడిగినా స్పందన లేకపోవడంతో సదరు బాధితుడు సాంబరాజు ఇప్పుడేకంగా డీజీపీ, ఐజీ,డీఐజీ, ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఈ మొత్తం వ్యవహారంలో క్షేత్రస్థాయి అధికారులు, పోలీసు కానిస్టేబుళ్లపైన అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి, పోయిన సొత్తు అంతా తనకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఏదేమైనప్పటికీ వస్తున్న ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో వాస్తవమేంటో తేల్చాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపైన ఉంది. ఈ కేసులోనే జరిగిందా, ఇదే తరహాలో మిగతా రికవరీ కేసుల్లోనూ జరుగుతున్నాయా అనే అనుమానాల్ని నివృత్తి చేయవల్సిన అవసరం ఉంది.
రికవరీ సొత్తులో హస్తలాఘవం ?
Published Sat, Feb 21 2015 2:13 AM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM
Advertisement
Advertisement