
పాదరసంలా నిబంధనలు
సాక్షి, విజయవాడ : శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో అధికారులు విధిస్తున్న నిబంధనలు దేవస్థాన ఆదాయానికి గండి కొట్టేవిగా ఉన్నాయి. పదేపదే తప్పులు చోటుచేసుకుంటున్నా కొందరు అధికారులు కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొండపై దీర్ఘకాలంగా తిష్టవేసిన నలుగురైదుగురు కాంట్రాక్టర్లు దేవస్థానంలోని లీజెస్ విభాగంలో సిబ్బందికి లంచాలు ఇచ్చి నిబంధనలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నట్లు సమాచారం.
ఆరునెలల్లో మూడుసార్లు నిబంధన మార్పు
ఏడాది పాటు భక్తులు అమ్మవారికి సమర్పించే చీరలు, రవికలు పోగు చేసుకునేందుకు గత జూన్ 30న టెండర్ పిలిచారు. ఇందులో 2012-13 సంవత్సరానికి రెండు కోట్లు టర్నోవర్ చేసిన వారు టెండర్ దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు. ఈ టెండర్‌ను రద్దుచేసి అక్టోబర్ 28న మళ్లీ పిలిచారు.
ఈ టెండర్‌లో గత రెండేళ్లకు రూ.2 కోట్లు టర్నోవర్ చేయాలంటూ నిబంధన మార్పు చేశారు. దీన్ని దేవాదాయశాఖ కమిషనర్ ఇటీవల రద్దు చేశారు. సోమవారం తిరిగి టెండర్ పిలిచారు. 2011-12, 2012-13 సంవత్సరాల్లో ఒకొక్క ఏడాది రూ.2 కోట్లు టర్నోవర్ చేసిన అనుభవం ఉండాలంటూ నిబంధన సడలించారు. ఇవి ఇటీవల వరకు పనిచేసిన కాంట్రాక్టర్‌కు అనుకూలంగా ఉన్నాయనే విమర్శలున్నాయి. కాంట్రాక్టర్ న్యాయస్థానాలకు వెళ్లి దేవస్థానం పరువు తీస్తున్నా అతనికే ఎందుకు తిరిగి టెండర్ దక్కేలా అధికారులు ప్రయత్నిస్తుండడంలో మరమ్మమేటో.
అనుభవం ఎందుకు...
భక్తులు సమర్పించిన చీరలు, రవికలు సేకరించే కాంట్రాక్టర్‌కు ఏడాదికి రెండు కోట్ల రూపాయల చొప్పున రెండేళ్లు వ్యాపారం చేసిన అనుభవం కావాలంటూ దేవస్థానం అధికారులు నిబంధన విధించడం విచిత్రంగా ఉంది. కాంట్రాక్టర్ తాను కోట్ చేసిన సొమ్ము ఎగ్గొట్టి పారిపోతాడని అధికారులు భావిస్తే.. మొత్తం సొమ్ముంతా ఒకేసారి కట్టాలనే నిబంధన విధించవచ్చు. లేదా వాయిదాలు ఇస్తే, ఆ గడువు రాకముందే కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇచ్చి సొమ్ము రాబట్టడం, లేకుంటే టెండర్‌ను రద్దుచేయడం చేయవచ్చు.
దేవస్థానంలోని సూపరింటెండెంట్‌తో పాటు కింద స్థాయి సిబ్బంది కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై వాయిదా గడువు మీరినా ఆ సొమ్ము వసూలు చేయడం లేదు. దీంతో కాంట్రాక్టర్ టెండర్ గడువు ముగిసే నాటికి దేవస్థానానికి సొమ్ము ఎగవేసి జారుకుంటున్నారు. సొమ్ము వసూలు చేయని ఉద్యోగులపై అధికారులు చర్యలు తీసుకోకుండా కేవలం టెండర్ నిబంధనలు మార్చడంపై విమర్శలు వస్తున్నాయి.
కొత్త వారికి అవకాశం లేదు....
టెండర్ నిబంధనలు కఠినతరం చేయడం వల్ల కొత్త కాంట్రాక్టర్లకు అవకాశం లభించడం లేదు. దేవస్థానం విధించిన నిబంధనలు చూసి బెంబేలెత్తుతున్నారు. కొత్త వారికి అవకాశం ఇస్తే ఎక్కువ ధరకు టెండర్ వేసే అవకాశముంది. దీనివల్ల దేవస్థానం ఆదాయం పెరుగుతుంది. కొత్తవారు వస్తే తమ ఉనికి దెబ్బతింటుందని భయపడిన కాంట్రాక్టర్లు అధికారుల అండతో ని‘బంధనాలు’ బిగిస్తున్నారు. దీనిపై నూతన ఈవో పూర్తిస్థాయిలో దృష్టి సారించాల్సి ఉంది.