
ఆచంట టీడీపీలో వర్గ విభేదాలు
ఈ నెల 4న జరగనున్న ఆచంట మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థుల ఎంపికలో టీడీపీలో వర్గ విభేదాలు చోటుచేసుకున్నాయి. మండల పరిషత్‌లో 17 ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ 14,
ఆచంట : ఈ నెల 4న జరగనున్న ఆచంట మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థుల ఎంపికలో టీడీపీలో వర్గ విభేదాలు చోటుచేసుకున్నాయి. మండల పరిషత్‌లో 17 ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ 14, వైసీపీ 2, స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలుపొందారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ టీడీపీలో చేరకముందు మేకా పద్మకుమారి ఎంపీపీ అభ్యర్థిగా ప్రచారం జరిగింది. ఈ లోపు సార్వత్రిక ఎన్నికలు రావడం, కాంగ్రెస్ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న పితాని సత్యనారాయణ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో మండల పరిషత్ అధ్యక్ష పదవి మార్పుపై ప్రచారం సాగింది. ఎంపీపీ పదవిపై ఆశావాహుల జాబితా ఒకటి నుంచి ముగ్గురు సభ్యులకు పెరిగింది. ప్రచారంలో ఉన్న పద్మకుమారితో పాటు వల్లూరు ఎంపీటీసీ బోళ్ల శ్రీలక్ష్మి, కరుగోరుమిల్లి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన డి.లలితారాణిల పేర్లు తెరపైకి వచ్చాయి.
దీంతో టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మెజార్టీ ఎంపీటీసీల అభిప్రాయం ప్రకారం ఎట్టకేలకు పద్మకుమారి పేరును ఖరారు చేసినట్టు సమాచారం. ఉపాధ్యక్ష పదవి కోసం లలితారాణి, సన్యాసిరావులతోపాటు ఆచంటకు చెందిన ఎంపీటీసీ కారెం నాగమణి పట్టుపట్టారు. జెడ్పీటీసీ బీసీ వర్గాలకు కేటాయించడంతో ఉపాధ్యక్ష పదవి ఎస్సీలకు కేటాయించాలని గట్టిగా పట్టుబట్టినట్టు సమాచారం. కొంతమంది లలితారాణి అని మరికొందరు గెద్దాడ సన్యాసిరావు వైపు మొగ్గుచూపడంతో సభ్యుల్లో విభేదాలు ఏర్పడ్డాయి. చివరికి సన్యాసిరావును ఖరారు చేసినట్టు తెలిసింది. టీడీ పీలో తలెత్తిన విభేదాలు భవిష్యత్‌లో పార్టీలో ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయోనని పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.