‘వివాద’ కళాపరిషత్‌ | Conflicts In AU Appointment IASE Principle Visakhapatnam | Sakshi
Sakshi News home page

‘వివాద’ కళాపరిషత్‌

Published Thu, Aug 9 2018 12:40 PM | Last Updated on Sat, Aug 11 2018 1:58 PM

Conflicts In AU Appointment IASE Principle Visakhapatnam - Sakshi

చెప్పిందే వేదం.. చేసిందే చట్టం అన్న రీతిలో ఆంధ్ర విశ్వవిద్యాలయ వ్యవహారాలు సాగుతున్నాయి..విశ్వవిఖ్యాతి గాంచిన ఆంధ్ర విశ్వకళాపరిషత్‌.. వరుస వివాదాలతో ప్రతిష్ట కోల్పోతోంది.. ఉన్నత విద్యామండలి నిబంధనలను కాదని.. ఈ విశ్వవిద్యాలయంలో నియామకాలు, పదోన్న తులు కొందరి ఇష్టారాజ్యంగా సాగిపోతున్నాయి. తమకు నచ్చిందే చేస్తామన్న ధోరణిలో ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు.మొన్నటికి మొన్న వర్సిటీ ఆగ్రో ఎకనమిక్స్‌ కేంద్రం డైరెక్టర్‌ నియామకం వివాదాస్పదమైంది. అన్ని విధాలా అర్హుడైన అర్థశాస్త్రవిభాగాధిపతి ఆచార్య పుల్లారావుకు ఆ పదవి ఇవ్వకుండా నెలల తరబడి కాలయాపన చేస్తున్నారు.ఇప్పుడేమో.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్సడ్‌ స్టడీస్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ (ఐఏఎస్‌ఈ) ప్రిన్సిపల్‌ నియామకంపైనా వివాదాలు ముసురుకున్నాయి. నిబంధనలను పక్కన పెట్టి జూనియర్‌ను అందలం ఎక్కించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నియమాలు వ్యక్తులను బట్టి మారిపోతున్నాయి. రాజు తలచుకుంటే.. అన్న రీతిలో ఉన్నతాధిరులు తలచుకుంటే చాలు నిబంధలనలు గాలికి కొట్టుకుపోతున్నాయి. తమకు నచ్చిందే న్యాయమనే రీతిలో ఇక్కడి అధికారుల వ్యవహార శైలికి పలు పరిణామాలు అద్దం పడుతున్నాయి. ఇటీవల వర్సిటీ ఆగ్రో ఎకనమిక్స్‌ సెంటర్‌ డైరెక్టర్‌ నియామకం వివాదాస్పదమైంది. అర్థశాస్త్ర విభా గాధిపతి ఆచార్య పుల్లారావుకు ఆ పదవిని ఇవ్వకుండా నెలల తరబడి కాలయాపన చేస్తున్నారు. పాత విధానాన్ని కాదని కొత్త సంప్రదాయానికి తెర తీసి అధికారులు విమర్శలపాలయ్యారు. తాజాగా ఇదే వర్సిటీ పరిధిలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌(ఐఏఎస్‌ఈ)ప్రిన్సిపల్‌ నియామకం సైతం వివాదాస్పదమైంది. నిబంధలను పక్కన పెట్టి ఆచార్య శివప్రసాద్‌ను ఆ పదవిలో నియమించారు.

సీనియర్లను కాదని..
ఐఏఎస్‌ఈ ప్రిన్సిపల్‌గా పనిచేసిన ఆచార్య రంగనాథన్‌ పదవీ కాలం గత నెల 30న ముగిసింది. ఆయన తర్వాత వర్సిటీ విద్యా విభాగం, ఐఏఎస్‌ఈలలో సీనియర్‌ ఆచార్యునికి ఆ పదవి ఇవ్వాల్సి ఉంది. దీనికి భిన్నంగా వర్సిటీ అధికారులు కొత్త విధానానికి తెర తీశారు. ముగ్గురి పేర్లతో ప్యానల్‌ సిద్ధం చేశారు. సీనియారిటీ ఆధారంగా ఆచార్య నిమ్మ వెంటకరావు, ప్రస్తుత విద్యా విభాగాధిపతి ఆచార్య గారలచ్చన్న,  ఆచార్య శివప్రసాద్‌ల పేర్లను వరుస క్రమంలో చేర్చారు. సీనియారిటీ ప్రకారం మొదటి స్థానంలో ఉన్న ఆచార్య నిమ్మ వెంకటరావును ప్రిన్సిపల్‌గా నియమించాలి. కానీ మూడో స్థానంలో ఉన్న ఆచార్య శివప్రసాద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ కావడం.. వెంటనే ఆయన పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగిపోయాయి.

ఒక్కసారికే అవకాశం.. దాన్ని కాదని..
ఆచార్య శివప్రసాద్‌ గతంలో ఐఏఎస్‌ఈ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా కొంత కాలం పనిచేశారు. ఇటీవల వర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఒక నియమం పెట్టుకున్నారు. ఒక పర్యాయం విభాగాధిపతి, ప్రిన్సిపల్‌ పదవి చేపట్టిన వారికి మరోసారి అవకాశం ఇవ్వరాదని నిర్ణయించారు. వారు పెట్టుకున్న నియమమే ఇప్పుడు అమలుకు నోచుకోలేదు. అందరికీ పరిపాలనా బాధ్యతలు అందాలనే ఉద్దేశంతో ఈ నిబంధన పెట్టారు. దీని ప్రకారం చూసినా ఆచార్య శివప్రసాద్‌ ఇప్పటికే ఒక పర్యాయం ప్రిన్సిపల్‌గా పని చేసినందున ఆయనకు మళ్లీ అవకాశం ఇవ్వనవసరం లేదు.

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
ఇటీవల ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ పనిచేస్తున్న ఆచార్య కె.గాయత్రీ దేవి రెక్టార్‌గా పదోన్నతి పొందారు. వెంటనే సీనియారిటీ ప్రకారం ఆచార్య కె.రామమోహనరావు ప్రిన్సిపల్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆచార్యులు పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచిన సమయంలో ఆచార్య సీహెచ్‌.వి రామచంద్రమూర్తి, ఆచార్య సుందరరావు, ఆచార్య ఎ.సుబ్రహ్మణ్యంలు ప్రిన్సిపల్స్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టి కొనసాగారు. అప్పుడు కూడా సీనియారిటీ ప్రకారం వీరికి రెండో పర్యాయం ప్రిన్సిపల్‌గా బాధ్యతలు అప్పగించారు. నేడు ఈ విధానాన్ని కాదని ప్యానల్‌ విధానంలో ప్రిన్సిపల్‌ను ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందని ఆచార్యులు ప్రశ్నిస్తున్నారు.

అమలుకు నోచుకోని తీర్మానం
గతేడాది జరిగిన అకడమిక్‌ సెనేట్‌ సమావేశంలో ఏయూలో ఉన్న విద్య విభాగం, ఐఏఎస్‌ఈలను విలీనం చేస్తూ స్కూల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌గా ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఏడాది కావస్తున్నా ఆ తీర్మానాన్ని అమలు చేయలేదు. రసాయన శాస్త్ర విభాగాలను కలుపుతూ స్కూల్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ, భాష శాస్త్ర విభాగాలను కలుపుతూ ఒకే విభాగంగా తీర్చిదిద్దాలని ప్రతిపాదలు వచ్చాయి. ఇవి కూడా కాగితాలకే పరితం అవుతున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement