సాక్షి, తిరుపతి: రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాం ధ్రలో ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పటికీ జిల్లాకు చెందిన అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఉద్యమాల వైపు కన్నెత్తి చూడటం లేదు. రెండు రోజుల క్రితం మొక్కుబడిగా ఉద్యమాల్లో పాల్గొని చేతులు దులుపుకున్నారు. కాంగ్రెస్ అధిష్టాన వైఖరిని ఖండిస్తూ మారుమూల పల్లెలు సైతం రోడ్డెక్కి నినదిస్తుంటే ఆ పార్టీల నేతలు ఆ ఊసే ఎత్తడం లేదు. జిల్లాలోని ఒంటెద్దు బండ్ల యూనియన్, ట్యాక్సీ డ్రైవర్ల సంఘం, ఆటో డ్రైవర్లు, బ్యాంకులు, జేసీబీ ఓనర్లు, బస్సు ఓనర్లు, వాకర్స్ అసోసియేషన్లు ఇలా అన్ని సంఘాలు నిరసన తెలిపాయి. అయితే తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు ఉద్యమాల వైపు కన్నెత్తి చూడటం లేదు. ఒకటి రెండు చోట్ల మొక్కుబడిగా ఉద్యమాలు చేపట్టి తాము కూడా చేశామని చెప్పుకుంటున్నారు.
కాంగ్రెస్ నాయకులు ఉద్యమంలో పాల్గొనేందుకు సీఎం నుంచి అనుమతి రాలేదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం తరఫున జిల్లాలో చక్రం తిప్పుతున్న ఆయన సోదరుడు కిశోర్‌కుమార్‌రెడ్డి విభజన వ్యతిరేక ఉద్యమాలు, నిరసనలు చేయకూడదని, దీనికి సీఎం అనుమతి లేదని సూచించినట్లు సమాచారం. అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు దొరక్కుండా తప్పించుకుని తిరిగే పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు ఇప్పటివరకు ఒక్క నిరసన కార్యక్రమంలోనూ పాల్గొన్న దాఖలా లు కనిపించలేదు. మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ మాత్రం ఒకరోజు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి రిలే నిరాహారదీక్షకు మద్దతు తెలిపి వెళ్లిపోయారు. ఎంపీ చింతామోహన్ ఇంతవరకు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనలేదు. ఇటీవల ఆయనను అడ్డుకున్న సమైక్యాంధ్ర ఉద్యమ నేతలతో తాను రాజీనామా చేయనని ఖరాఖండిగా తెలిపారు. పూతలపట్టు ఎమ్మెల్యే రవి అసలు కనిపించడం లేదు. డీసీసీ అధ్యక్షుడు అమాస రాజశేఖర్‌రెడ్డి జై సమైక్యాంధ్ర అంటున్నా ఉద్యమాల వైపు వెళ్లలేదు. వీరందరికీ చెక్‌పాయింట్ లాగా కిశోర్‌కుమార్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు.
చిత్తూరు ఎమ్మెల్యే సీకే బా బు సీఎం ఆదేశాల కోసం ఎదురు చూడకుండా ఆయన నిరాహారదీక్షకు ఉపక్రమించారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా తొలి రెండు రోజులు నిరసనలు చేపట్టలేదు. ఎంపీ శివప్రసాద్ ఇంటిని ముట్టడించిన నిరసనకారులకు ఇంట్లో ఉండి కూడా లేదని పంపించారు. ఈ నెల 4వ తేదీన మాత్రం టీడీ పీ నాయకులు గాలి ముద్దుకృష్ణమనాయుడు, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూ ర్తి కలిసి తెలుగుతల్లి విగ్రహం వద్ద ధర్నా చేశా రు. పైగా ఆందోళన చేస్తున్న యువతను తాగుబోతులుగా చదలవాడ వక్రీకరించడం గమనార్హం. ఇప్పటికీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు జం గాలపల్లి శ్రీనివాసులు నోరు మెదపలేదు. ప్రస్తుతం జిల్లాలో సమైక్య ఉద్యమం ఉధృతం కావడంతో విధిలేక బుధవారం నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.
ముందు వరుసలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్
రాష్ట్ర విభజనపై ప్రకటన చేసిన క్షణం నుంచి క్రమం తప్పకుండా నిరసనలు వ్యక్తం చేస్తున్న పార్టీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఒక్కటే. ఢిల్లీలో కాంగ్రెసు పార్టీ తన వైఖరిని వెల్లడించిన అరగంటలోనే ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తిరుపతి గాంధీ రోడ్డు జంక్షన్ వద్ద ఆందోళనకు దిగారు. నగరి నియోజకవర్గంలో వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యురాలు రోజా, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి 24 గంటలపాటు నిరసన తెలియజేశారు. గంగాధర నెల్లూరు, పుత్తూరులో జిల్లా కన్వీనర్ నారాయణస్వామి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తొలి రోజు నుంచి నేటి వరకు ఆ పార్టీ నాయకులు ఉద్యమంలో ముందుంటున్నారు. మరే పార్టీ కూడా పెద్ద ఎత్తున చేపట్టడం లేదు. వేలాది మంది ప్రజలు రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేయడంతో ఆ పార్టీలు అయోమయంలో పడిపోయాయి.
మొక్కుబడిగా కాంగ్రెస్, టీడీపీ ఉద్యమాలు
Published Wed, Aug 7 2013 4:36 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement