సాక్షి ప్రతినిధి, కర్నూలు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పుట్టి ముంచుతోంది. విభజన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమం తీవ్రరూపం దాలుస్తోంది. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయకుండా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ప్రకటనకు ముందే వైఎస్‌ఆర్‌సీపీ తన విధానాన్ని స్పష్టం చేసింది. తెలంగాణ ఇస్తున్నట్లు చెప్పిన వెంటనే ఆందోళన బాట పట్టింది.
సమైక్యాంధ్ర జేఏసీలతో కలిసి ఈ నెల ఒకటో తేదీ నుంచి జిల్లాలోని అన్ని మండలాల్లో ఆ పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేపడుతోంది. ఇదే సమయంలో తమ పార్టీ అధినేతల నిర్ణయాన్ని సమర్థించాలో, వ్యతిరేకించాలో తెలియక కాంగ్రెస్, టీడీపీ నాయకులు జనం ముందుకు రాలేకపోతున్నారు. తెలుగుదేశం ఇచ్చిన లేఖతోనే తెలంగాణ ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్టు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ప్రకటించడం టీడీపీ శ్రేణులను ఇరుకున పెట్టింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వెనక్కు తగ్గేది లేదని పార్టీ అధిష్టానం స్పష్టం చేయడంతో కాంగ్రెస్ నేతలు ఉద్యమంలో కలిసి నడవలేక తర్జనభర్జన పడుతున్నారు. చొరవ తీసుకొని వెళ్లినా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో జిల్లా కేంద్రంలోని ఆయా పార్టీల కార్యాలయాల వద్ద టెంట్‌లు ఏర్పాటు చేసుకొని రిలే నిరాహారదీక్షల పేరుతో కాలం వెల్లదీస్తున్నారు. అయితే బుధవారం టీడీపీ టెంట్ నాయకులు లేక వెలవెలబోయింది.
కాంగ్రెస్ నేతల తీరు అయోమయం
తెలంగాణ ప్రకటన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పత్రికా సమావేశాలకు, అధికారిక కార్యక్రమాలకు హాజరై ‘సమైక్యాంధ్రను విడగొట్టడానికి ఇతర పార్టీలే కారణం’ అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటనలు గుప్పించడానికే పరిమితమవుతున్నారు. ఇక తెలంగాణ ప్రకటన వెలువడిన నాటి నుంచి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఢిల్లీకే పరిమితం కాగా.. ఆయన వర్గం ఎమ్మెల్యేలు రాజీనామా లేఖలను స్వీకర్‌కు అందజేసి వచ్చి అయోమయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.
నంద్యాల ఎంపీ ఎస్‌పీవై రెడ్డి రాజీనామా ప్రకటన చేసి, ఆళ్లగడ్డలో బలవంతంగా ఒకరోజు దీక్షలో పాల్గొన్నారు. ఇక మంత్రి పదవులకు రాజీనామా చేసి కర్నూలుకు వచ్చి ఆర్భాటంగా ఒకరోజు దీక్షలో కూర్చున్న మంత్రి టీజీ వెంకటేశ్ కూడా ఆ తర్వాత ఇంటికే పరిమితమయ్యారు. మరో మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి రంజాన్ రోజు మొక్కుబడిగా ర్యాలీ నిర్వహించడంతో సరిపెట్టారు. ఆలూరు ఎమ్మెల్యే నీరజారెడ్డి రాజీనామా లేఖ స్పీకర్‌కు పంపించి ముఖం చాటేశారు. కోడుమూరు ఎమ్మెల్యే మురళీకృష్ణ పరిస్థితి అదే.
నంద్యాల, నందికొట్కూరు ఎమ్మెల్యేలు శిల్పా మోహన్ రెడ్డి, లబ్బి వెంకటస్వామి కూడా ఒక్కరోజు ఆందోళనల్లో కనిపించి వెళ్లిపోయారు. కోట్ల సతీమణి, డోన్ మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ ఒకరోజు డోన్‌లో జేఏసీ దీక్షా శిబిరానికి వచ్చి తన భర్తతో రాజీనామా చేయిస్తానని హామీ ఇచ్చి వెళ్లిపోయారు. తర్వాత ఎక్కడా కనిపించలేదు. ఎమ్మెల్యేలు లేని ఇతర నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు మొక్కుబడిగా ఉద్యమకారులకు మద్దతు పలికి ఫొటోలు దిగి వెళ్లిపోతున్నారు. ఆ పార్టీ మండల, గ్రామ స్థాయి నాయకులు కూడా దూరంగానే ఉంటుండడం గమనార్హం. కాటసాని సోదరులు సైతం ఉద్యమం పట్ల అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు.
కింకర్తవ్యం
Published Fri, Aug 16 2013 5:42 AM | Last Updated on Fri, Aug 10 2018 5:38 PM
Advertisement
Advertisement