
కాంగ్రెస్‌కు మోడీ విమర్శించే హక్కు లేదు: కిషన్‌రెడ్డి
మాట తప్పడం, మడప తిప్పడమే అలవాటైన కాంగ్రెస్‌కు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని విమర్శించే నైతిక హక్కు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మోడీ నవభారత యువభేరీ సదస్సుకు వచ్చిన స్పందనకు ఓర్వలేకే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. పార్టీ నేతలతో కలిసి కిషన్‌రెడ్డి మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు.
‘హైదరాబాద్‌లో మోడీ సదస్సు జయప్రదం కావడంతో కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కిరణ్.. సోనియా మెప్పు కోసమే మోడీని విమర్శిస్తున్నారు. ఆయన తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి’ అని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం లక్ష అబద్ధాలు, కోటి అపశ్రుతులతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. కిరణ్ చెప్పినట్లు అభివృద్ధిలో గుజరాత్ కంటే ఏపీనే ముందుంటే సోనియా గాంధీ.. నరేంద్ర మోడీకి రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ అవార్డు ఎందుకిచ్చారని ప్రశ్నించారు.