ప్రభుత్వానికి మెగాస్టార్ లేఖ
సాక్షి, అమరావతిః తిరుపతి లోని పేదల తరపున కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, టాలీవుడ్ మెగాస్టార్ కె.చిరంజీవి ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. 18 వార్డు స్కావెంజర్స్ కాలనీలో 70 ఏళ్లుగా కాపురం ఉంటున్న 160 కుటుంబాలను బలవంతంగా ఖాళీ చేయించి 2.34 ఎకరాల విలువైన భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కుట్ర జరుగుతోందని ప్రభుత్వానికి వెల్లడించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కాలనీలో పలు అభివృద్ధి పనులు చేయించానన్నారు.
మానవీయ కోణంలో చూసి బాధితులకు న్యాయం చేయాలని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఎన్నో దశాబ్దాలుగా, తరతరాలుగా నివాసం ఉంటున్న పారిశుద్ధ్య కార్మిక కుటుంబాలను, యానాది కులస్తులను అక్కడి నుంచి తరిమి వేయడానికి ప్రభుత్వం వారికి వేరే చోట పునరావాసం కల్పిస్తామంటూ మభ్య పెడుతోందన్నారు. తిరుపతి నగరం నడిబొడ్డున స్కావెంజర్స్ కాలనీ ఉండటం ఈ ప్రభుత్వం సహించలేకపోతోందన్నారు.
ప్రజలందరిని సమానంగా చూడాలని మన రాజ్యాంగం చెబుతున్నా అందుకు విరుద్దంగా.. ప్రభుత్వం తన బల ప్రయోగంతో.. బలహీనులైన పారిశుద్ద్య కార్మిక కుటుంబాలను, యానాది కుటుంబాలను తరలించాలని చూడటం సహించరాని చర్య అన్నారు. స్కావెంజర్స్ కాలనీని రోల్ మోడల్ కాలనీగా అభివృద్ధి పర్చాలని, వారి కుటుంబాల్లో నెలకొన్న అభద్రతాభావాన్ని తొలగించి తగిన భరోసా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.