లోక్‌సభలో కాంగ్రెస్, టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా
రెండు పార్టీల వల్లే సీమాంధ్ర అగ్నిగుండం: మేకపాటి
సాక్షి, నెల్లూరు: లోక్‌సభలో 11 మంది కాంగ్రెస్, టీడీపీ సభ్యుల సస్పెన్షన్ ఆ రెండు పార్టీలు ఆడుతున్న మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామాలో భాగమేనని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన గురువారం నెల్లూరులో మాట్లాడుతూ విభజనకు లేఖ ఇచ్చి చంద్రబాబు, రాష్టాన్ని విభజించి కాంగ్రెస్ ఇప్పటికే సీమాంధ్రను అగ్నిగుండం చేశాయని దుయ్యబట్టారు.
సీమాంధ్రులను మభ్యపెట్టేందుకు ఆ రెండుపార్టీల ఎంపీలు పార్లమెంట్ కార్యకలాపాలను భంగపరిచి ఆహారభద్రత బిల్లుకు అంతరాయం కల్పించారన్న సాకుతో సస్పెండయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ సభ్యులు గతంలో ఒకటి రెండు మార్లు పార్లమెంట్ వెల్‌లోకి వెళ్లినా కాంగ్రెస్ పెద్దలు కన్నెర్ర చేయగానే తిరిగి వెళ్లి పోయేవారని, గురువారం ధైర్యంచేసి వెల్‌లోకి వెళ్లారంటే కాంగ్రెస్ హైకమాండ్ ఆడిస్తున్న నాటకంలో భాగమేనని అర్థమవుతోందని చెప్పారు.