గణపవరం ఎస్సీ కాలనీలో ఇంతకు ముందు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన పాఠశాల
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం గణపవరం గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఆ వర్గానికి చెందిన ఓటర్లు 1,120 మంది ఉన్నారు. ఆ కాలనీ పక్కనే ఉండే ప్రాంతంలో ముస్లిం ఓటర్లు 150 మంది ఉన్నారు. మొత్తం 1,270 మంది ఓటర్లు కాగా గతంలో వీరంతా స్వేచ్ఛగా ఓటు వేసేందుకు వీలుగా ఎస్సీ కాలనీలోని పాఠశాలలోనే రెండు పోలింగ్ కేంద్రాలు (151, 152) ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటిని తొలగించి గణపవరంలోని జడ్పీ పాఠశాలలో ఆ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో ఎస్సీ కాలనీ వాసులు ఓటు వేయాలంటే గణపవరం గ్రామం మధ్యలోని రహదారి గుండా కిలోమీటర్ దూరం ప్రయాణించి పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలి. వీరికి ఈ దారి నుంచి వెళ్లడం మినహా మరో మార్గం లేదు. ఎన్నికల సమయంలో వీరిని భయభ్రాంతులకు గురిచేసి ఓటు వేయకుండా అడ్డుకునేలా ఓ సామాజిక వర్గానికి చెందిన అధికార పార్టీ నేతలు ప్రణాళికలు రచించారు. ఎస్సీ కాలనీ ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు వీల్లేకుండా చేసేందుకే పోలింగ్ కేంద్రాన్ని మార్చేలా ఒత్తిడి తెచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సాక్షి, అమరావతి బ్యూరో: వచ్చే ఎన్నికల్లో గట్టెక్కేందుకు అధికార పార్టీ నేతలు అన్ని అడ్డదారులూ అన్వేషిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ బూత్‌ల మార్పుతోపాటు గంపగుత్తగా విపక్షం ఓట్ల తొలగింపు, వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉండే కాలనీల్లో ఓట్లను వివిధ పోలింగ్ కేంద్రాలకు మార్చి చిందరవందర చేయడం లాంటి చర్యలకు దిగుతున్నారు. బూత్ స్థాయి అధికారులను తమ కనుసన్నల్లో ఉంచుకుంటూ ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పుల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అధికారులకు ఇలాంటి అభ్యంతరాలు జిల్లావ్యాప్తంగా 35 వేలకు పైగా అందాయి. ప్రధానంగా సత్తెనపల్లి, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాల్లోనే 22 వేలకు పైగా అభ్యంతరాలు వ్యక్తం కావడం గమనార్హం. సత్తెనపల్లి సమీపంలోని భృగుబండలో ఎస్సీ, ఓసీ కాలనీలోని ఓటర్లను ఆ గ్రామంలో రెండు పోలింగ్ కేంద్రాలకు ఇష్టం వచ్చినట్లు మార్చారు. నరసరావుపేటలో వైఎస్సార్ సీపీకి పట్టున్న ప్రాంతాల్లో ఓటర్లను ఇష్టారాజ్యంగా పోలింగ్ కేంద్రాలకు మార్చారు. ఓటర్ల జాబితాలో వచ్చిన అభ్యంతరాలపై దృష్టి సారించిన గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ మంగళవారం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు, బీఎల్‌వోలు, బూత్ లెవల్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించాలని ఈఆర్‌ఓలను ఆదేశించారు.
పోలింగ్ కేంద్రాన్ని మార్చిన జిల్లాపరిషత్ పాఠశాల
Comments
Please login to add a commentAdd a comment