
ప్రసంగిస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు
చీరాల రూరల్ : దళిత, బహుజనులు రాజ్యాధికార దిశగా పయనించాలని, అందుకు ఐకమత్యమనే మార్గాన్ని ఎంచుకోవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక మున్సిపల్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవన్‌లో దళిత, బహుజన సంఘాల మేధోమధన సదస్సు జరిగింది. సదస్సు కన్వీనర్ గోసాల ఆశీర్వాదం అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథులుగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, హైదరాబాదుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఎ.ఎం. ఖాన్ యస్థాని, సామాజిన న్యాయవేదిక కన్వీనర్ వై. కోటేశ్వరరావు ప్రసంగించారు.
రాష్ట్రంలోని దళిత, బహుజనులంతా రాష్ట్రంలో అత్యల్పంగా ఉన్న పెత్తందార్ల కబంధ హస్తాల్లో చిక్కుకుని సమిధలవుతున్నారని పేర్కొన్నారు. బతకటానికి పోరాటాలు చేయాల్సిన విపత్కర పరిస్థితులు ప్రస్తుత సమాజంలో నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత, బహుజనులందరూ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, మహాత్మ జ్యోతిరావ్ పూలేలను ఆదర్శంగా తీసుకుని సమాజాన్ని ఏవిధంగా సంస్కరించాలో తెలుసుకొని పయనించాలని సూచించారు.
ప్రమాదకరంగా బీజేపీ..ఆర్‌ఎస్‌ఎస్
దేశంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ దాడులు అధికమయ్యాయని వక్తలు పేర్కొన్నారు. దళిత, బహుజనులంతా ఐకమత్యమై బలమైన రాజకీయ శక్తిగా అవతరించి, సాంస్రృతిక ఐక్యత సాధించాలని పేర్కొన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు కులాల కుంపట్లు, రిజర్వేషన్ల రగడతో దళిత, బహుజనులను చీల్చివేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని అలాంటి వాటిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఇక్కడ చర్చించిన అంశాలన్నింటిని క్రోడీకరించి సైద్ధాంతిక రూపంలోనికి తీసుకువచ్చి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోనే కాక దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అందులో భాగంగా ఐదుగురితో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసి వారిద్వారా ఇక్కడ చేసిన తీర్మానాలను కరపత్రాల రూపంలో ముద్రించి కార్యరూపం దాల్చే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు.
చీరాలలో పబ్బం గడుపుకుంటున్న పెద్దలు
చేనేత జన సమాఖ్య రాష్ట్ర నాయకుడు మాచర్ల మోహనరావు మాట్లాడుతూ ప్రస్తుతం చీరాలలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయని, ఇక్కడున్న రాజకీయ పార్టీల నాయకులు ఒక వర్గం ప్రజలను అదే వర్గం ప్రజలపైకి ఉసిగొల్పుతూ వారి పబ్బం గడుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ వరికూటి అమృతపాణి, బాంసప్ రాష్ట్ర కన్వీనర్ పరంజ్యోతి మాట్లాడుతూ దేశంలోని పెట్టుబడిదారులు దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ వంటి పార్టీలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎదుర్కొవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
మాజీ మంత్రి పాలేటి రామారావు మాట్లాడుతూ సమాజంలో ఇటువంటి ఆహ్లాదకరమైన రాష్ట్ర సదస్సులు జరగడం మంచి పరిణామమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అంబూరి సుబ్రహ్మణ్యం, పలుకూరి ప్రసాదరావు, నల్లబోతుల మోహన్‌కుమార్ ధర్మ, నీలం నాగేంద్రరావు, గోసాల సుధాకర్, పొదిలి ఐస్వామి, అబ్దుల్ రహీం, పిన్నిక శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
వివిధ జిల్లాలకు చెందిన దళిత, బహుజన సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు
Comments
Please login to add a commentAdd a comment