సంకల్ప లక్ష్మి | Constable Budada rajya lakshmi Success story | Sakshi
Sakshi News home page

సంకల్ప లక్ష్మి

Published Sun, Feb 25 2018 11:14 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

Constable Budada rajya lakshmi Success story - Sakshi

సంకల్పం బలంగా ఉంటే విజయం నీ సొంతమవుతుంది అన్న మాటలకు నిలువెత్తు నిదర్శనం ఆమె. లక్ష్య ఛేదనలో అవరోధాలు అడ్డుకాదని నిరూపించిన క్రీడాకారిణి. పేదరికం వెనక్కి లాగుతున్నా దీక్షా, పట్టుదలతో అనుకున్న గమ్యాన్ని చేరుకుని ఆదర్శ‘లక్ష్మి’గా నిలుస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా హ్యాండ్‌బాల్‌లో జాతీయస్థాయిలో సత్తాచాటి కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించారు. ఓ పక్క ఆటలో రాణిస్తూ మరోపక్క ప్రజలకు సేవలందిస్తున్నారు నిడదవోలు పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బుద్దా రాజ్యలక్ష్మి. విజయగాథ ఆమె మాటల్లోనే..  

మా సొంతూరు ఏలూరు. నాన్న జూట్‌ మిల్లులో కార్మికునిగా పనిచేస్తున్నారు. అమ్మ దుర్గా, చెల్లెలు రాజకుమారి ఉన్నారు. నాన్నకు నెలకు వచ్చే రూ.4 వేల జీతంతోనే కుటుంబాన్ని పోషించేవారు. కుటుంబం గడవటం కష్టంగా ఉన్నా నన్ను అన్ని విధాలా ప్రోత్సహించారు. ఏలూరు సెయింట్‌ థెరిస్సా కళాశాలలో పది, ఇంటర్‌ పూర్తి చేశాను. ఎన్‌సీసీ టీం లీడర్‌గా పనిచేశా. సామాజిక  సేవ చేయాలంటే నాకు ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుంచి పరుగు పందాల్లో పాల్గొంటూ విజేతగా నిలిచేదాన్ని. పదో తరగతి చదువుతున్న సమయంలో స్కూల్‌గేమ్స్‌ అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, కబడ్డీ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచి స్కూల్‌ చాంపియన్‌ సాధించాను.

కళాశాలలో మంచి కోచ్‌లు ఉండటంతో ముందు వెయిట్‌ లిఫ్టింగ్‌లో శిక్షణ తీసుకుందామని అనుకున్నా. అయితే పరుగంటే ఇష్టంతో హ్యాండ్‌బాల్‌ ఎంచుకున్నా. అప్పుడే నిశ్చయించుకున్నా ఎలాగైనా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని. హ్యాండ్‌బాల్‌ క్రీడలో 40 నిమిషాలు ఏకధాటిగా పరుగు పెట్టాల్సిందే. ఏలూరు సీఆర్‌ రెడ్డి కళాశాల క్రీడా మైదానంలో రోజు పరుగు ప్రాక్టీస్‌ చేసేదాన్ని. కుటుంబ పోషణ కష్టంగా ఉన్న నాన్నకు నేను తీసుకోవాల్సిన డైట్‌ గురించి చెప్పేదానిని కాదు. అయినా నాన్న గమనించి డైట్‌ సమకూర్చేవా డు. ‘తల్లీ నువ్వు మా గురించి ఆలోచించకూ మేము తినో తినకో నీకు ఏ లో టు రానివ్వం’ అని ప్రోత్సహించేవారు.

బూట్లు కూడా లేని పరిస్థితి
పరుగు ప్రాక్టీస్‌కు బూట్లు కూడా కొనుక్కోలేని ఆర్థిక ఇబ్బందులు పడ్డాను. రెండు నెలలు చెప్పులతోనే ప్రాక్టీస్‌ చేశాను. పరుగు ప్రాక్టీస్‌ నుంచి ఇంటికి వచ్చి ఉన్న ఒక్క టీషర్ట్‌ను రాత్రికి ఉతుక్కుని మళ్లీ ఉదయం వేసుకునేదాన్ని. అలా ఏడాది పాటు ఒక్క టీషర్టుతోనే గడిపాను. నాన్న పడుతున్న కష్టాన్ని చూసి ఏమీ చెప్పకుండా బాధను గుండెల్లో దాచుకున్నాను. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని నిర్ణయించుకున్నాను. 2009లో సీఆర్‌ రెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సమయంలో పోలీస్‌ సెలెక్షన్స్‌లో పాల్గొని క్రీడా కోటాలో కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించడం చా లా ఆనందం కలిగించింది.

పదో తరగతి నుంచి ఆటల్లో రాణిస్తూ..
పదో తరగతి నుంచి జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో రాణిస్తూ జాతీయస్థాయి క్రీడాకారిణిగా గుర్తింపు పొం దాను. 2016లో విశాఖలో జరిగిన జాతీయస్థాయి హ్యాండ్‌బాల్‌ పోలీస్‌ టోర్నమెంట్‌లో ఏపీ జట్టులో పాల్గొని సత్తాచాటాను. ఫైనల్లో హర్యానాపై గెలు పొంది మా జట్టు విజేతగా నిలిచింది. ప్రభుత్వం ప్రైజ్‌ మనీ కింద రూ.3 లక్షల రివార్డును ప్రకటించింది. ఇలా ఆటల్లో రాణిస్తూ.. పోలీస్‌గా విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నా. ఎన్ని కష్టాలు ఉన్నా ఏ లోటు రాకుండా ప్రోత్సహించిన నాన్న భరోసాతోనే ఈ స్థాయికి చేరుకున్నా. ముఖ్యంగా యువత చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్‌ ఉంటుంది. అమ్మాయిలు ఏ రంగంలోనూ తీసుపోరు. సమాజంలో పురుషులతో సమానంగా పోటీపడినప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకుం టామనే భావంతో ముందుకు సాగిపోవాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement