
ఏ మున్నది గర్వకారణం?
నిరాశే మిగిల్చిన 2013.. ఏది కొనబోయినా కొరివే... ధరల దరువే
కాడి పారేసిన పాలకులు.. కుదేలైన సామాన్యుడు
ఇంట్లో ఏ స్విచ్ ముట్టుకున్నా ఎడాపెడా తగిలే కరెంటు చార్జీల షాకు. వంటింట్లో పొయ్యి ముట్టిద్దామంటే కళ్లముందు మెదలాడే గ్యాస్ బండ భారం. కాయగూరలు మొదలుకుని పచారీ సామాన్ల దాకా అన్నింటి ధరలూ చుక్కల్లోనే. ఇంటిల్లిపాదితో సరదాగా బయటికెళ్దామన్న ఆలోచన కూడా చేయలేని పరిస్థితి. పక్కనుంచి పదేపదే పెట్రో ధరల మోత. చివరికి ఎర్ర బస్సెక్కాలన్నా జేబు బరువును ఒకటికి రెండుసార్లు తడిమి చూసుకోవాల్సిన పరిస్థితి. బుడిబుడి నడకల బుజ్జారుుల్ని బళ్లో వేయూలన్నా అప్పులు చేయక తప్పని దుస్థితి. సగటు జీవికి 2013 ఎంత భారంగా గడిచిందో చెప్పేందుకు మాటల కోసం వెదుక్కోవాల్సిందే. బియ్యం వంటి నిత్యావసరాలతో పాటు చివరికి ఉల్లిగడ్డ కూడా కంటతడి పెట్టించింది. పండ్ల ధరలూ కొండెక్కాయి. ఆసుపత్రుల్లో కన్సల్టెన్సీ రుసుము 25 శాతం, స్కూలు ఫీజులు 20 శాతం, ఇంటి అద్దెలు 15 శాతం చొప్పున పెరిగాయి. ఇలా ఏడాది పొడవునా సామాన్యుని నడ్డి విరుగుతున్నా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుండిపోయాయి. రైతులైతే వరుస తుపాన్లతో పూర్తిగా కుదేలయ్యారు. సామాన్యుడికి నానా రకాలుగా చుక్కలు చూపి, కాలగర్భంలోకి కనుమరుగవుతున్న 2013పై సింహావలోకనం...
స్మార్ట్ చాయిస్
మిగతా విషయూలన్నీ ఎలా ఉన్నా స్మార్ట్ ఫోన్లు మాత్రం మెల్లిగా మధ్యతరగతి జీవులకు చేరువవుతున్నాయి. కనీసం రూ.12 వేలు పెడితే తప్ప అందని స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు రూ.6 వేలకే అందుబాటులోకి వచ్చాయి. విస్తృతమైన మోడళ్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. మొబైల్‌లో ఇంటర్నెట్ వాడకం కూడా బాగా పెరిగింది. ఒకరకంగా స్మార్ట్ ఫోన్ రోజువారీ జీవితంలో భాగమైపోయింది. బ్యాంకింగ్ మొదలుకుని రైలు, సినిమా టికెట్ల బుకింగ్ దాకా చాలా పనులు మొబైల్లో చేతుల మీదే పూర్తయిపోతున్నాయి. ఈ ఏడాదిలో ఇది గణనీయమైన మార్పు.
షేర్ మార్కెట్ పర్లేదు
2009లో నేలచూపులు చూసిన సెన్సెక్స్ 2013లో పడుతూ లేస్తూ, లేస్తూ పడుతూ సాగింది. ఒక దశలో ఆల్‌టైమ్ రికార్డుతో 21 వేల మార్కును దాటింది. గత డిసెంబర్‌తో పోలిస్తే ఈ డిసెంబర్‌కు దాదాపు 2 వేల పాయింట్లు పెరిగింది. ‘క్రమానుగత పెట్టుబడి (సిప్) నాలుగేళ్లుగా నెలకు రూ.3 వేల చొప్పున పన్ను పథకాల్లో ఇప్పటిదాకా రూ.1.5 లక్షలు పెట్టుబడి పెడితే ఈ ఏడాదే కాస్త లాభం కన్పించింది. పెట్టుబడి 1.81 లక్షలైంది’ అని విక్రమ్ అనే మీడియా ఉద్యోగి తెలిపారు. దీర్ఘకాలం వేచి ఉన్న వారికి మార్కెట్ కాస్త కలిసొచ్చిందనే చెప్పొచ్చు.
దిగొచ్చిన పుత్తడి
గతేడాది దాకా ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ధరలు ఈ ఏడాది బాగానే తగ్గారుు. కేంద్రం దిగుమతి సుంకాన్ని విధించడంతో మన దేశంలో రేట్లు అంతగా దిగిరాలేదు. పెట్టుబడిగా బంగారం కొన్నవారికి మాత్రం ఈ ఏడాది కలిసి రాలేదు. ‘2012 నవంబర్ నెలాఖరులో గ్రాము రూ.3,125 చొప్పున రూ.75 వేలతో 24 గ్రాములు కొన్నా. ఇప్పుడది రూ.68,220కి తగ్గింది’ అంటూ ఖైరతాబాద్‌కు చెందిన నవీన్ యాదవ్ వాపోయారు. హైదరాబాద్‌లో 24 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర 2012 డిసెంబర్ 28న రూ.30,570 ఉండగా ఈ డిసెంబర్ 28న రూ.29,340 ఉంది.
10 పెట్రో వాతలు.. 12 డీజిల్‌మోతలు
చమురు కంపెనీలు పెట్రోలు ధరలను 2013లో పదిసార్లు పెంచేశాయి! డీజిల్‌పై అరుుతే ఏకంగా 14 సార్లు పెంచారుు. ఇది రికార్డేనని చెప్పాలి. పెట్రో ధరల నియంత్రణ ప్రభుత్వం చేతుల్లో నుంచి కంపెనీల చేతుల్లోకి వెళ్లడంతో అవి ఆడింది ఆటగా సాగుతోంది. అంతర్జాతీయ చమురు ధరలను బూచిగా చూపుతూ అప్పుడప్పుడు మూరెడు తగ్గించినట్టే తగ్గిస్తూ, పదేపదే బారెడేసి చొప్పున ధరలు పెంచుతూ సగటు జీవిని ఎడాపెడా బాదేస్తున్నారుు. 2013 జనవరిలో హైదరాబాద్‌లో రూ.73.73 ఉన్న లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.78.1కి చేరింది. డీజిల్ కూడా రూ.51.35 నుంచి రూ.58.6కు పెరిగింది.
ఫీజుల మోత
చదువు‘కొనడం’ ఈ ఏడాది మరీ ఖరీదైన వ్యవహారంగా మారిపోరుుంది. హైదరాబాద్ సహా రాష్ట్రమంతటా గతేడాదితో పోలిస్తే అన్ని ఫీజులూ కనీసం 20 శాతం పెరిగాయి. ‘అబిడ్స్‌లోని ఓ మామూలు ప్రైవేటు స్కూల్‌లో మా అమ్మాయి 6వ తరగతి చదువుతోంది. గతేడాది నెలకు రూ.2,500 ఉన్న ఫీజు ఇప్పుడు రూ.3,000 అరుుంది. ఫీజులను ఏటా 20 శాతం పెంచుతున్నారు. నా జీతం మాత్రం 10 శాతం కూడా పెరగడం లేదు’ అంటూ రఘురాం అనే మధ్యతరగతి ఉద్యోగి వాపోయారు. సగటు జీవులందరిదీ అటూ ఇటుగా ఇదే పరిస్థితి.
‘బండ’ పడింది
మన ప్రభుత్వాలు 2013లో సామాన్యుడికి చివరికి వంటింట్లోనూ సంక్షోభం రేపారుు. సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ల సంఖ్యకు కేంద్రం పరిమితి విధించడమే గాక రూ.25 సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేయడంతో గ్యాస్ బండ తలకు మించిన భారమైంది. 2013 మొదట్లో రూ.412 ఉన్న వంటగ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.1,112కు పెరిగింది. ఇందులో ఏడాదికి తొమ్మిది సిలిండర్లకు మాత్రం నగదు బదిలీ రూపంలో ప్రభుత్వం సబ్సిడీ చెల్లిస్తుండగా మిగతా వాటిని మార్కెట్ ధరకు కొనాల్సిన పరిస్థితి ఎదురైంది. సబ్సిడీ సిలిండర్ల ధర కూడా రూ.600కు చేరుకోవటంతో ఒక్కో సిలిండర్‌పై రూ.188 చొప్పున భారం పడినట్టయింది.
కొండెక్కిన సన్న బియ్యం
సన్న బియ్యం ఈ ఏడాది చుక్కలు చూపింది. ఒకరకంగా విలాస వస్తువుగా కూడా మారిందన్నా అతిశయోక్తి లేదేమో!. 2012లో కిలో రూ.35 ఉన్నది కాస్తా 2013లో రూ.50 మార్కును దాటేసింది. నలుగురు సభ్యుల కుటుంబం నెలకు రూ.3 వేలకు పైగా బియ్యానికే ఖర్చు చేయాల్సి వచ్చింది. గతేడాది కంటే ఇది దాదాపు వెరుు్య రూపాయలు ఎక్కువ. దాంతో చాలామంది రూ.40-45కు ఓ మోస్తరు బియ్యంతో సరిపెట్టుకున్నారు. దిగుబడి పుష్కలంగా ఉండి కూడా బియ్యం ధరలు ఇలా ఆకాశాన్నంటడం ప్రభుత్వం వైఫల్యాన్ని పట్టించింది. నల్లబజారును నియంత్రించడంలో పాలకులు దారుణంగా విఫలమయ్యూరు. ఇక పప్పుల ధరలు కూడా ఈసారి 25 శాతం మేర పెరిగాయి. కిలో కందిపప్పు రూ.65 నుంచి రూ.85 దాటింది. నూనెలు కూడా కిలోపై రూ.25 దాకా పెరిగాయి.
ఎర్రబస్సు కన్నెర్ర...
వైఎస్ రాజశేఖరరెడ్డి హయూంలో ఏనాడూ బస్సు చార్జీలను పెంచకుండా, ప్రజలపై భారం మోపకుండా జాగ్రత్త పడగా, అనంతరంవచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రం జనానికి ఏటా చిల్లు పెడుతూ వచ్చారుు. 2013లో బస్సు భారం మరింత పెరిగింది. అప్పటిదాకా ఏటా రూ.600 కోట్ల మేరకు బస్సు చార్జీలు పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఈసారి ఏకంగా 9.5 శాతం మేర చార్జీలు పెంచి ప్రయూణికులతో పెడబొబ్బలు పెట్టించింది. ఇది గతేడాది భారం కంటే రెట్టింపు. కనీసం పేదలకు ఆధారమైన పల్లె వెలుగు బస్సులను కూడా ఈ ఏడాది వదిలిపెట్టలేదు. దాంతో బస్సెక్కాలంటేనే జనం భయపడే పరిస్థితి దాపురించింది.
నిరుద్యోగులకు నిరాశే
2012 డిసెంబర్ నుంచి ఈ ఏడాది కాలంలో భర్తీ అరుున ప్రభుత్వోద్యోగాలు అతి స్వల్పం. 64 అసిస్టెంట్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు, 12 ఫిజికల్ డెరైక్టర్, 21 లైబ్రేరియన్, 362 అసిస్టెంట్ ఇంజనీర్లు, 107 చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్, 6 అసిస్టెంట్ రీసెర్చి ఆఫీసర్, 18 రీసెర్చి అసిస్టెంట్, 11 అబ్జర్వర్, 12 మెడికల్ ఆఫీసర్ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. వీటిలోనూ కొన్నింటి భర్తీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ప్రైవేట్ రంగంలోనూ భారీ సంఖ్యలో కొలువులు కట్టబెట్టిన రంగం ఏదీ లేదు. ఐటీ రంగంలో రాష్ట్రానికి కొత్తగా ఒక్క సంస్థా రాలేదు. రాష్ట్ర విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్ల ద్వారా దక్కిన ఐటీ కొలువులూ తక్కువే.
ఆశా నిరాశల రియల్ ఎస్టేట్
కొందరికి చేదు రుచి చూపిన రియల్ ఎస్టేట్ రంగం మరికొందరికి కొత్త ఆశలు రేకెత్తింపజేసింది. స్థిరాస్తులు కొనుక్కున్న వారు వాటి విలువ తగ్గుతోందంటూ వాపోతుండగా, ఇన్నాళ్లూ అందనంత ఎత్తులో ఉన్న స్థలాల విలువ ఎంతో కొంత దిగి వస్తోందని మరికొందరు సంబరపడుతున్నారు. ‘గత డిసెంబర్‌లో హైదరాబాద్ శివారులోని మల్లంపేట్‌లో గజం రూ.6,500 చొప్పున ప్లాట్ కొన్నాను. ఇప్పుడది రూ.4 వేలకు పడిపోయింది’ అని పోపూరి శ్రీనివాస్ అనే ఉద్యోగి వాపోయూరు. 2008 దాకా ఓ వెలుగు వె లిగిన రియల్టీ రంగాన్ని 2009 కల్లా స్తబ్దత ఆవరించింది. 2009 డిసెంబర్‌లో తెలంగాణ ప్రకటనతో రియల్టీ కుదుపునకు లోనైంది. గత ఆగస్టు నుంచి ప్రధాన ప్రాంతాల్లో మినహా ధరలు దాదాపు 10 శాతం తగ్గాయి. కృష్ణా, గుంటూరు, ఒంగోలు, విశాఖ వంటి సీమాంధ్ర ప్రాంతాల్లో మాత్రం స్థలాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొన్ని చోట్ల రేట్లు 100 శాతం దాకా పెరిగాయి. రాజధాని ఏర్పాటుకు, కొత్తగా మౌలిక వసతుల స్థాపనకు అవకాశముందని భావిస్తున్న ప్రతి ప్రాంతంలోనూ రేట్లు పెరిగిపోయాయి.
కరెంటు షాక్..
సగటు జీవులే గాక చివరికి రైతులకు కూడా వెన్ను విరిగే స్థారుులో కరెంటు బిల్లులను పెంచి రాష్ట్ర ప్రభుత్వం తన ప్రతాపం చాటింది. రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో ఏకంగా రూ.5 వేల కోట్లకు పైగా భారం మోపుతూ 2013 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త కరెంటు చార్జీలు జనం నడ్డి విరిచాయి. చార్జీలు ఏకంగా 60 శాతం పెరిగాయి. ఇది చాలదన్నట్టు సర్దుబాటు చార్జీల పేరిట 2010-11, 2012-13 తాలూకు భారాన్ని కూడా జనం మీదే మోపుతూ వాళ్ల జేబులకు చిల్లి పెట్టింది సర్కారు. వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్‌పై కూడా ఆంక్షలు విధించి రైతన్ననూ దెబ్బ కొట్టింది. రెండున్నర ఎకరాలకు మించిన మాగాణి ఉన్న రైతుల నుంచి చార్జీలు వసూలు చేయాల్సిందేనంటూ పథకానికే తూట్లు పొడిచింది. అలా రెండున్నర లక్షల కనెక్షన్లకు ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తేసింది. ఇక నిరంతర కరెంటు కోతలు సరేసరి. కనీసం రెండు మూడు గంటలు కూడా కరెంటివ్వకపోవడంతో పొలాలెండి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారంలో ఏకంగా మూడు రోజుల పాటు పవర్ హాలిడే ప్రకటించడంతో పరిశ్రమలు ఎన్నడూ లేనంతగా దెబ్బతిన్నాయి. వందలాది పరిశ్రమలు మూతపడ్డాయని స్వయానా రిజర్వు బ్యాంకే తన నివేదికలో స్పష్టం చేసింది. 40 శాతం పరిశ్రమల్లో ఉత్పత్తి ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఎలా చూసినా ఈ సంవత్సరం కరెంటు రూపంలో ప్రజలకు చేదు జ్ఞాపకాలే మిగిలాయి.
వరుస తుపాన్లు
ఈ సంవత్సరం వానలు బాగా ఉంటాయని పంచాంగం విని మురిసిన రైతన్న, ఆ వానలే కొంప ముంచుతాయని ఊహించలేకపోయాడు. ఎన్నడూ లేనట్టుగా ఏకంగా మూడు తుపాన్లు వారిని కోలుకోలేని దెబ్బ తీశాయి. ఖరీఫ్ పంట కళకళలాడుతున్న తరుణంలో తొలుత ఫైలీన్ తుపాను వచ్చి పడింది. దాని దెబ్బకు శ్రీకాకుళం జిల్లాలో పంటలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి.ఆ వెంటనే హెలెన్ పంజా విసిరింది. ఏకంగా 16 జిల్లాల్లోను అతలాకుతలం చేసింది. కోస్తాతో పాటు తెలంగాణ జిల్లాల్లో కూడా పంటలు సర్వనాశనమయ్యాయి. ఆ దెబ్బ నుంచి తేరుకోకముందే లెహర్ విరుచుకుపడింది. కేవలం రెండు నెలల వ్యవధిలో ఇలా మూడు తుపాన్లు, అతి భారీ వర్షాలు దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన పంటలను దెబ్బ తీశాయి. అసలే కరువు కాలంలో కరెంటు కోత బారిన పడి తీవ్రంగా నష్టపోయిన రైతులు ఈ ఖరీఫ్ అతివృష్టితో సర్వం కోల్పోయి మరింతగా అప్పుల ఊబిలో కూరుకుపోయూరు.
కంటనీరు పెట్టించిన ఉల్లి
{పభుత్వాలను కూడా కూల్చిన చరిత్ర ఉన్న ఉల్లి చాలాకాలం తర్వాత 2013లో మళ్లీ ఆ స్థారుులో చెలరేగింది. ఒక దశలో కిలో రూ.60 కూడా దాటేయడంతో జనం హాహాకారాలు చేశారు. ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోకపోవడంతో దాదాపు నెల పాటు ఉల్లి పేరు చెబితేనే కంట నీరొచ్చే పరిస్థితి కొనసాగింది. కూరగాయలు కూడా తామూ తక్కువ తినలేదన్నట్టుగా భగ్గుమన్నాయి. గతేడాదితో పోలిస్తే ధరలు ఏకంగా 40 శాతం మేరకు పెరిగాయి. బీన్స్ అయితే ఒక దశలో కిలో ఏకంగా రూ.100 మార్కు దాటేసింది. చిక్కుడు, క్యారెట్‌తో పాటు టమోటా కూడా కిలో రూ.50కి చేరుకోవడంతో సాధారణ జనం చాలాకాలం వాటి జోలికి వెళ్లడమే మానుకున్నారు. గతేడాది రూ.600-800 ఉన్న నలుగురు సభ్యుల సాధారణ కుటుంబ నెలసరి కూరగాయల బడ్జెట్ ధరాఘాతానికి ఈసారి రూ.1,100 నుంచి 1,500 దాకా పెరిగింది.