రాయవరం (మండపేట): జనహృదయ విజేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్ కొలువు దీరింది. ఇక అసలుసిసలు ప్రజాప్రభుత్వం వచ్చేసిందన్న విశ్వాసం అన్ని వర్గాల్లో కనిపిస్తోంది. ఇది నిజమే అన్నట్లు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పండుటాకుల సంక్షేమానికి జగన్ పెద్ద పీట వేసి, వారి పింఛనును పెంచారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల గౌరవ వేతనాన్ని పెంచారు. పాదయాత్ర సమయంలో ఇచ్చిన ఒక్కొక్క హామీనీ అమలు చేస్తూ వస్తున్న జగన్ కాంట్రాక్టు లెక్చరర్లకు కూడా తీపి కబురు అందించారు. ఇప్పటివరకూ ఏడాది మొత్తం పని చేసినా.. 10 నెలలకు మాత్రమే వారికి వేతనం చెల్లించేవారు. ఇప్పుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్ 12 నెలల వేతన విధానాన్ని అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై కాంట్రాక్టు లెక్చరర్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
హామీకే పరిమితమైన చంద్రబాబు సర్కార్
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సర్కార్ కాంట్రాక్టు లెక్చరర్లకు 12 నెలల వేతనాన్ని అమలు చేస్తోంది. మన రాష్ట్రంలో మాత్రం టీడీపీ ప్రభుత్వం ఇన్నాళ్లుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు టీడీపీ ప్రభుత్వం 10 నెలల వేతనాలతో సరిపెడుతూ వచ్చింది. ప్రభుత్వ కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్ నేతలు పలుమార్లు గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. 12 నెలల వేతన విధానంతో కూడిన టైమ్ స్కేల్ వర్తింపజేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, బేసిక్‌పై డీఏ ఇవ్వాలన్న వారి వేదన అరణ్య రోదనగానే మిగిలింది. అయితే ఎన్నికల ముందు చంద్రబాబు సర్కార్ ఎమ్మెల్సీ – ఉన్నతాధికారులతో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫారసులను మంత్రివర్గ ఉపసంఘం ముందుంచారు. మంత్రి ఉపసంఘం నిర్ణయం తెలపకపోవడంతో కాంట్రాక్టు అధ్యాపకులకు చివరికి నిరాశే మిగిలింది.
హామీ నిలబెట్టుకున్న జననేత
నడిసంద్రంలో కొట్టుకుపోతున్న వారికి తెప్ప దొరికినట్లు.. ఎడారిలో ఒయాసిస్సు కనిపించినట్టుగా.. కాంట్రాక్టు లెక్చరర్లకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కనిపించారు. ప్రజాసంకల్ప పాదయాత్ర సందర్భంగా కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ నేతలు తమ సమస్యలను జగన్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఆయన జిల్లాకు వచ్చిన సందర్భంలో కాంట్రాక్టు లెక్చరర్లు రాజమహేంద్రవరం, బూరుగుపూడి, కోరుకొండల్లో కలిసి, తమ గోడు విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజుల వ్యవధిలోనే కాంట్రాక్టు లెక్చరర్లకు 12 నెలల వేతన విధానాన్ని అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ మెమో నంబరు 1290413 జారీ చేశారు.
ఈ మెమో ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,800 మంది కాంట్రాక్టు అధ్యాపకులకు ప్రయోజనం కలగనుండగా, జిల్లాలోని ప్రభుత్వ, డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్న 498 మందికి మేలు చేకూరనుంది. ముఖ్యమంత్రి అయిన వెంటనే వారి సమస్యలను మర్చిపోకుండా ప్రత్యేక మెమో ద్వారా 12 నెలల వేతనాన్ని మంజూరు చేస్తూ (ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేది వరకూ.. మార్చి నెల చివరిలో 10 రోజుల బ్రేక్‌తో) వైఎస్ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ప్రభుత్వంలో తమకు మంచి జరుగుతుందని భావించామని, అయితే ఇంత త్వరగా జరుగుతుందని ఊహించలేదని కాంట్రాక్టు లెక్చరర్లు ఆనందంగా చెబుతున్నారు.
మాట తప్పని నైజం
తనది మాట తప్పని, మడమ తిప్పని నైజమని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరూపించుకున్నారు. తండ్రి వైఎస్ లక్షణాలను పుణికి పుచ్చుకున్నారు. మాకు మంచి రోజులు వచ్చాయి. భవిష్యత్తులో మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారని ఆశిస్తున్నాం. – డాక్టర్ వలుపు కనకరాజు, జిల్లా అధ్యక్షుడు, కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్
సంతోషంగా ఉంది
ఇచ్చిన హామీని మర్చిపోకుండా వెంటనే అమలు చేయడం సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి అంటే ప్రజా సమస్యలను పరిష్కరించే వ్యక్తిగా ఉండాలన్న విషయాన్ని నిజం చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కాంట్రాక్టు లెక్చరర్ల కుటుంబాలన్నీ రుణపడి ఉంటాయి. – టి.అమర్ కళ్యాణ్, జిల్లా ఆర్థిక కార్యదర్శి, కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్, ఏలేశ్వరం
Comments
Please login to add a commentAdd a comment