ఆందోళన చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు (ఫైల్)
వివిధ ప్రభుత్వ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీపి కబురు చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే ఏటా 12 నెలలకూ వేతన విధానం అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జగన్ ప్రకటనతో జిల్లాలోని పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల కుటుంబాల్లో ఆనందోత్సాహాలువెల్లివిరిశాయి.
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీపి కబురు అందించారు. కాంట్రాక్టు అధ్యాపకులు ఏడాది కాలానికి పూర్తి వేతనం అందుకోవడమనే కలను సీఎం వైఎస్ జగన్ తీసుకున్న ఒక్క నిర్ణయంతో ఆచరణలోకి వచ్చింది. ఫలితంగా 2000 సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తూ ఉద్యోగ భద్రత మాట అటుంచితే మిగతా ఉద్యోగుల మాదిరిగా కనీసం ఏడాదిలో 12 నెలల వేతనాన్ని సైతం పొందలేని దుర్భర పరిస్థితులకు ఇక తెరపడింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారి కలను సాకారం చేశారు. కాంట్రాక్టుఅధ్యాపకులకు 12 నెలలకు పూర్తి వేతనాన్ని ఇవ్వాలని ఆయన ఇచ్చిన ఆదేశం అప్పటికప్పుడే జీవో రూపం దాల్చింది. దీంతో ఈ ఉత్తర్వులకోసం 19 ఏళ్ల నుంచి ఆందోళనలు, ధర్నాలు, విజ్ఞప్తులు చేస్తూ వచ్చిన కాంట్రాక్టు అధ్యాపకుల కుటుంబాల్లో సీఎం వైఎస్ జగన్ వెలుగులు నింపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 3,800 మంది కాంట్రాక్టు అధ్యాపకులకు గత ఏప్రిల్ 1వ తేదీ నుంచి వర్తించే విధంగా ఏడాదికి 12 నెలలకు వేతనం చెల్లించే విధంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్ ఉత్తర్వులు విడుదల చేశారు.
జిల్లాలో 319 మంది కాంట్రాక్టు అధ్యాపకులు
విశాఖపట్నం జిల్లాలో 34 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ఒక ఒకేషనల్ జూనియర్ కాలేజీ ఉన్నాయి. వీటిలో 319 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరికి నెలకు రూ.27 వేల వేతనం అందుతోంది. ఇకపై రెండు నెలల జీతం కూడా చెల్లించనుండడంతో ఈ కాంట్రాక్టు లెక్చరర్లు ఒక్కొక్కరు ఏటా రూ.54 వేలు అదనంగా పొందనున్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయంపై జూనియర్ కాలేజీ కాంట్రాక్టు లెక్చరర్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఐదేళ్లుగా కాలయాపన...
ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు సుదీర్ఘమైన పాదయాత్ర చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో మంది ఉద్యోగులు,ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యలను సావధానంగా ఆలకించారు. అందులో భాగంగానే కాంట్రాక్టు అధ్యాçప³కులకు ఏడాదిలో కేవలం 10 నెలలకే వేతనం చెల్లిస్తూ, వేసవి సెలవుల్లో ఏప్రిల్, మే నెలలకు వేతనం ఇవ్వకపోవడంతో వారి కుటుంబాలు అనుభవిస్తున్న పడుతున్న బాధలు, ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన సమస్యలను ప్రత్యక్షంగా చూసిన వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఒక్క సంతకంతో వారి తలరాతలు మార్చివేశారు. గత ఐదేళ్ల టీడీపీ పరిపాలనలో తమకు 12 నెలల కాలానికి వేతనాలు చెల్లించాలని కాంట్రాక్టు అధ్యాపకులు ఎన్నోమార్లు సీఎం చంద్రబాబుతో సహా టీడీపీ మంత్రులకు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు పలుమార్లు విజ్ఞప్తులు చేసి, వినతి పత్రాలు సమర్పించారు. 10 నెలలు చెల్లిస్తున్న వేతనాన్ని 12 నెలలకు పెంచేందుకు నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు దీనిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి, చేతులు దులుపుకొంది. రాష్ట్ర వ్యాప్తం గా 3,800 మంది కాంట్రాక్టు అధ్యాపకుల కుటుంబా లకు సంబంధించిన విషయమై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా దాదాపు మూడేళ్లు తాత్సారం చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఎటూ తేల్చలేకపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత కాంట్రాక్టు అధ్యాపకులకు ఉద్యోగ భద్రత, శ్రమ కు తగిన వేతనాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే దాని ని ఆచరణలోకి తెచ్చి విశ్వసనీయత చాటుకున్నారు.
వైఎస్ హయాంలో పెరిగిన జీతాలు
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2000లో చేరిన కాంట్రాక్ట్ అధ్యాపకులకు గ్రామీణ ప్రాంతాల్లో పని చేసేవారికి రూ.4,500, పట్టణ ప్రాంతాల్లో పని చేసే వారికి రూ.5,500 జీతం ఇచ్చేవారు. 2005లో వైఎస్ సీఎం అయిన తర్వాత అందరికీ రూ. 8,500 జీతం అమలు చేశారు. తర్వాత 2009లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో రూ.18,000 వేలు చేశారు. గత ప్రభుత్వం దానిని రూ. 27 వేలుకు పెంచింది.
ఇచ్చిన హామీని నెరవేర్చని ‘బాబు’
‘తమ పార్టీ అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరిస్తాం (రెగ్యులరైజ్)’ అంటూ 2014 ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతేకాక ఈ హామీని ఎన్నికల మేని ఫెస్టోలో కూడా పెట్టారు. అనుకున్నట్లే అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పాలించినా హామీని మాత్రం అమలు చేయలేదు. సాధ్యాసాధ్యాలను పరిశీలించే ందుకని 2016లో జీఓఎం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) కమిటీని ఏ ర్పాటు చేశారు. 2017లో మరోసారి ఎమ్మెల్సీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు ఇచ్చిన నివేదికలను చంద్రబాబు ప్రభుత్వం బుట్ట దాఖలు చేసింది.
సంతోషాన్ని పెంచారు..
కాంట్రాక్టు లెక్చరర్ల వ్యవస్థ ఆరంభమైనప్పట్నుంచి ఏడాదిలో పది నెలలే జీతాలు ఇస్తున్నారు. 12 నెలలూ వేతనాలివ్వాలని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలను అడుగుతూనే ఉన్నాం. అయినా ఎవరూ స్పందించలేదు. ఇటీవల ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి మా ఇబ్బందులు చెప్పుకున్నాం. అధికారంలోకి రాగానే మీ సమస్య పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. మాటతప్పకుండా వెంటనే 12 నెలల జీతాలూ ఇచ్చేలా నిర్ణయం తీసుకుని మా అందరిలో ఆయన సంతోషాన్ని పెంచారు. మా ఇతర సమస్యలను కూడా అలాగే పరిష్కరిస్తారన్న ఆశాభావంతో ఉన్నాం. సీఎంకు కృతజ్ఞతలు.
–శర్మ, రాష్ట్ర కార్యదర్శి,ఏపీ కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్
Comments
Please login to add a commentAdd a comment