పోలవరంపై కాంట్రాక్టర్ కొత్త కిరికిరి!
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ప్రాజెక్టులో భాగంగా కాల్వపై చేపడుతున్న రోడ్లు, బ్రిడ్జిలకు సంబంధించి అదనపు నిధుల కోసం కాంట్రాక్టర్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ముందు అంచనా వేసిన సంఖ్య కంటే ఎక్కువ బ్రిడ్జిలను నిర్మించాల్సి వస్తుందని, అందుకయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు నిర్మాణ పనుల్ని చేయబోమని కాంట్రాక్టర్ ప్రభుత్వానికి స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్టులో భాగంగా ఎడమ, కుడి ప్రధాన కాల్వలను నిర్మిస్తున్నారు. సుమారు 355 కిలో మీటర్ల పొడవు ఉండే ఈ కాల్వల నిర్మాణాల కోసం రూ. 3,356 కోట్ల అంచనా వ్యయంతో కాంట్రాక్టు సంస్థతో ఒప్పందాలు జరిగాయి. ఈ నిర్మాణంలో భాగంగా కాల్వల తవ్వకంతో పాటు, వాటికి ఇరువైపులా లైనింగ్‌ను, అవసరాన్ని బట్టి బ్రిడ్జిలు, రోడ్లను కూడా చేపట్టాల్సి ఉంటుంది.
ముందు అనుకున్న ప్రకారం ఈ కాల్వలపై సుమారు 140 రోడ్లు, బ్రిడ్జిలను నిర్మించాల్సి ఉంటుందని అంచనా వేశారు. అయితే స్థానిక ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ల దృష్ట్యా వీటి సంఖ్య రెట్టింపు అయ్యే పరిస్థితి నెలకొంది. ఆ మేరకు నిర్మాణ వ్యయం కూడా పెరగనుంది.
ఈపీసీ పద్ధతిన నిర్మాణ ఒప్పందాలు జరిగినందున.. బ్రిడ్జిలను ఎక్కువ సంఖ్యలో చేపట్టాల్సి వచ్చినా.. వాటికయ్యే వ్యయాన్ని కూడా సదరు కాంట్రాక్టర్లే భరించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ అదనపు వ్యయం నుంచి తప్పించుకోవడానికి వీలుగా ఈ బ్రిడ్జిలు, రోడ్లను కాంట్రాక్టర్లు నిర్మించడం లేదు.
ఈ నిర్మాణాలను చేపట్టాలంటే.. అదనపు నిధులను చెల్లించాలని కాంట్రాక్టర్లు పట్టు పడుతున్నారు. కొంత కాలం నుంచి ఇదే విషయాన్ని అడుగుతున్న కాంట్రాక్టర్లు తాజాగా తమ డిమాండ్‌ను నెరవేర్చుకోవడానికి ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచారు.