విభజనకు సహకరించండి
Published Wed, Sep 4 2013 3:31 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్ :తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు ముల్కీ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో మంగళవారం భోజన విరామ సమయంలో తెలంగాణ ఉద్యోగులు సీమాంధ్ర ఉద్యోగులకు పుష్పగుచ్ఛాలు అందించి నిరసన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో వివిధ శాఖల ఉద్యోగులు టీఎన్‌జీఓస్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రదర్శనగా నినాదాలు చేస్తూ వివిధ కార్యాలయాలకు వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ సీమాంధ్ర ఉద్యోగులకు పుష్పగుచ్ఛాలు అందజేశారు.
కలెక్టరేట్‌లోని సీపీవో కార్యాలయంలో చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఇ.రత్నబాబు, జిల్లా పరిషత్ సీఈఓ జయప్రకాష్ నారాయణ, జిల్లా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ సుబ్బయ్య, ఆర్‌ఎంఓ డాక్టర్ శోభాదేవిలకులకు పుష్పగుచ్ఛాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సీమాంధ్ర అధికారులతో జై తెలంగాణ నినాదాలు చేయించారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు కూరపాటి రంగరాజు, నడింపల్లి వెంకటపతిరాజులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సీమాంధ్ర ఉద్యోగులు సహకరించాలని కోరారు.
తెలంగాణ సాధన కోసం ఉద్యోగులు ఉద్యమిస్తుంటే సీమాంధ్ర అధికారులు ఉద్యోగులను వేధిస్తున్నారని అన్నారు. ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తే సంహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీజీవోస్ నుంచి వై.వెంకటేశ్వర్లు, లింగయ్య, డ్రైవర్ల సంఘం నాయకులు కోటేశ్వరరావు, టీఎన్‌జీవోస్ నుంచి పి.లక్ష్మీనారాయణ, నందగిరి శ్రీను, వల్లోజు శ్రీనివాస్, సాగర్, రమణయాదవ్, వేలాద్రి, జడ్పీ రవి, రాజేష్, బడ్జెట్ శ్రీను, సీపీఓ నుంచి రమేష్, రామయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement