
కాలనీవాసులకు సూచనలు ఇస్తున్న డీసీపీ వెంకటప్పలనాయుడు
విజయవాడ పశ్చిమ: కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో బుధవారం తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు చేపట్టారు. త్వరలో జరగనున్న ఎన్నికలు, శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. కాలనీలోని 1వ బ్లాక్ నుంచి 56వ బ్లాక్‌లోని 1792 ప్లాట్‌ల తనిఖీలను పోలీసులు చేపట్టారు. తెల్లవారుజామున 3 గంటలకు కాలనీకి చేరుకున్న పోలీసులు 4 గంటల నుంచి తనిఖీలు ప్రారంభించారు. ఉదయం 8 గంటల వరకు తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతి ఇంటికి వెళ్లి ఫ్లాట్‌లో నివాసం ఉంటున్న వారి వివరాలను ఆరా తీయడంతో పాటు ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు కార్డులను పరిశీలించారు.
డీసీపీ వెంకట అప్పలనాయుడు నేతృత్వంలో 12 మంది ఎస్‌ఐలు, వెస్ట్ జోన్ పరిధిలోని 35 మంది ఎస్‌ఐలు, 56 మంది ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, 180 మంది కానిస్టేబుల్స్, మరో 50 మంది ఉమెన్ కానిస్టేబుల్స్ ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఏడీసీపీ నవాబ్‌జాన్, ఏసీపీలు సత్యనారాయణ, సుధాకర్ తనిఖీలను పర్యవేక్షించారు. కొత్తపేట సీఐ ఎండీ. ఉమర్, కొత్తపేట ఎస్‌ఐలు కాలనీలో పలు చోట్ల అనుమానాస్పదంగా కనిపించిన వాహనాల గురించి ఆరా తీశారు. తొలుత కాలనీలోని ప్రధాన రహదారిపై సిబ్బందికి అధికారులు పలు సూచనలు చేశారు. ప్రతి ఇంటిని తనిఖీ చేయడంతో పాటు వారి వివరాలను నమోదు చేసుకోవడంతో పాటు చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారి వివరాలను, వారు ఎంత కాలం నుంచి నివాసం ఉంటున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో అనుమానాస్పదంగా ఉన్న వారికి ఐరిష్ తీయడంతో పాటు ఇతర వివరాలను నమోదు చేసుకున్నారు. తనిఖీలలో పాత కేసులలో ముద్దాయిలుగా ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment