
బందరులో విదేశాల నుంచి వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్న వైద్య సిబ్బంది (ఫైల్)
సాక్షి, మచిలీపట్నం: స్వీయ నిర్బంధం ముగిసింది. వారంతా బంధవిముక్తులయ్యారు. విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఎట్టకేలకు గృహ నిర్బంధం నుంచి విముక్తి లభించింది. ఇంటిల్లిపాదికి ఒకటి, రెండుసార్లు నిర్వహించిన టెస్టుల్లో నెగిటివ్ రిపోర్టులు రావడంతో కరోనా మహమ్మారి నుంచి బయట పడ్డామంటూ వారంతా సంబరపడిపోతున్నారు.
జిల్లా అంతటా జల్లెడ
విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే కరోనా వ్యాప్తి చెందుతుందన్న ప్రచారంతో తొలుత జిల్లా అంతటా జల్లెడ పట్టారు. వలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేసి విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా 2,443 మందిని గుర్తించి హోం ఐసోలేషన్‌లో పెట్టారు. వారి భార్య, బిడ్డలు, తల్లిదండ్రులను కూడా కలవకుండా 28రోజుల గృహనిర్బంధంలో ఉంచారు. 24గంటలు వీరి కదలికలపై నిఘా ఉంచారు. ఇళ్ల ముందు పోలీస్ పహారా పెట్టారు. పావుగంట పాటు బయట కొచ్చారనే కారణంతో మచిలీపట్నం, నూజివీడు, మైలవరం, పెదపారుపూడి, ఇనుగుదురు ప్రాంతాలకు చెందిన ఆరుగురిపై క్రిమినల్ కేసులు కూడా పెట్టారు. ఆంక్షలు సడలించిన వేళల్లో కూడా ఈ కుటుంబాల నుంచి ఏ ఒక్కర్ని బయట తిరగ నివ్వలేదు.
28 రోజుల గృహ నిర్బంధం..
విదేశాల నుంచి వచ్చిన వారిలో ముగ్గురికి పాజిటివ్ రావడంతో వారిని ఆస్పత్రికి, వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. అయితే పాజిటివ్ వచ్చిన వారు అదృష్టవశాత్తు పూర్తిగా కోలుకున్నారు. వారి కుటుంబ సభ్యులందరికీ నెగిటివ్ రిపోర్టులు రావడంతో జిల్లా యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. ఇక హోం ఐసోలేషన్‌లో ఉన్న 2,443 మందికి నిర్ధేశించిన గడువు ముగిసిందని జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ ప్రకటించడంతో ఇక తాము కరోనాను జయించామన్న ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు 28 రోజుల గృహ నిర్బంధం నుంచి బయటపడడంతో వారంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.
చాలా ఆనందంగా ఉంది..
నేను ఇటలీ రాజధాని రోమ్‌లో మాస్టర్ సైన్స్ చదవుతున్నా. కుటుంబ సభ్యులను చూసేందుకు గత నెలలో ఇంటికొచ్చాను. కరోనా కట్టడి కోసం విదేశాల నుంచి వచ్చిన వారిని వలంటీర్ల ద్వారా గుర్తించి హోం క్వారంటైన్‌లో పెట్టి ఎప్పటికప్పుడు పరీక్షలు చేయడం వలన వ్యాధి వ్యాప్తి కాకుండా కొంతవరకు అడ్డుకట్ట వేయగలిగారు. హోం క్వారంటైన్‌లో ఉన్న నన్ను ప్రతి రోజు వైద్యులు పరీక్షించేవారు. నాతో పాటు నా కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునే వారు. నాకు రెండుసార్లు కరోనా టెస్ట్ చేశారు. నెగిటివ్ వచ్చింది. మా కుటుంబ సభ్యులకు మంగళవారం ర్యాపిడ్ టెస్టులు చేశారు. ఎలాంటి ఇబ్బంది లేదు. 28 రోజుల గృహనిర్భందం ముగియడంతో ఆనందంగా ఉంది. –పైరాడ రాజు, తుర్రకుంటపాలెం, జగ్గయ్యపేట మండలం
గృహ నిర్బంధం ముగిసింది
విదేశాల నుంచి 2,443 మంది జిల్లాకు వచ్చినట్టుగా గుర్తించి వారిని 28 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచాం. వారి గృహనిర్బంధం ముగిసింది. ముగ్గురికి పాజిటివ్ రాగా, వారు కోలుకున్నారు. –కె.మోహనకుమార్, జేసీ–2