లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమై కర్నూలులో ఓ కుటుంబం టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్న దృశ్యం
రాష్ట్రమంతటా లాక్ డౌన్ పటిష్టంగా.. ప్రశాంతంగా అమలవుతోంది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. నిబంధనల్ని అతిక్రమించిన వారిపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. హోమ్ క్వారంటైన్ నుంచి ఎవరైనా బయటకు వస్తే జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్‌ను అప్రమత్తం చేసేవిధంగా కరోనా ట్రాకింగ్ యాప్‌ను రూపొందించారు. ఎక్కడికక్కడ జిల్లా సరిహద్దులను మూసివేసి పొరుగు జిల్లాల వారెవరినీ అనుమతించటం లేదు. తాజాగా మరికొన్ని పట్టణాల్లోనూ నిత్యావసర సరుకుల డోర్ డెలివరీ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. – సాక్షి నెట్‌వర్క్
- కర్నూలు జిల్లా నంద్యాల, కర్నూలు పట్టణాల్లో నిత్యావసర సరకులను మాల్స్ ద్వారా డోర్ డెలివరీ చేసే విధానాన్ని శనివారం అమల్లోకి తెచ్చారు. లాక్‌డౌన్ నిబంధనల్ని అతిక్రమించిన 47 మందిపై కేసులు నమోదు చేశారు. 164 మందిని అదుపులోకి తీసుకుని ఎంవీ యాక్ట్ కింద రూ.7 లక్షల జరిమానా విధించారు.
- గుంటూరులో రెండు కరోనా కేసులు నమోదవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళదాస్ నగర్‌కు మూడు కిలోమీటర్ల పరిధిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. నిత్యావసరాలు, కూరగాయల డోర్ డెలివరీ విధానం అమల్లోకి వచ్చింది. గుంటూరు అర్బన్ జిల్లాలోకి విజయవాడ సహా ఇతర జిల్లాల నుంచి రాకపోకలు నిలిపివేశారు.
- విశాఖ జిల్లాలో మధ్యాహ్నం ఒంటిగంట వరకూ సడలింపు ఉన్నప్పటికీ ప్రజలు 11 గంటలకే ఇళ్లకు పరిమితమవుతున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే ఏ ఒక్క వాహనాన్ని అనుమతించకుండా సరిహద్దులన్నీ మూసివేశారు.
- తూర్పుగోదావరి జిల్లా అంతటా పారిశుద్ధ్య కార్మికులు వీధులు, డ్రైన్లను శుభ్రం చేసి, బ్లీచింగ్ చల్లారు. దేవదాయ శాఖ ఉత్తర్వుల మేరకు కరోనా వైరస్, సమస్త విషరోగ నివారణార్థం మందపల్లి ఉమామందేశ్వర (శనైశ్ఛర) స్వామి క్షేత్రంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు.
- విజయనగరం సమీపంలోని మిమ్స్ ఆస్పత్రిని కరోనా ఆస్పత్రిగా మార్పు చేశారు. విదేశాల నుంచి వచ్చిన 200 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉంచారు.
- వేరే ప్రాంతాల నుంచి వచ్చి శ్రీకాకుళంలో చిక్కుకుపోయిన వారి కోసం వైఎస్సార్ కల్యాణ మండపంలో బస ఏర్పాటు చేశారు.
- చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో 25 పడకలతో ఐసోలేషన్ కేంద్రం, ఆలయ వసతి సముదాయం గంగాసదన్‌లో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేశారు. చిత్తూరు నగరానికి ఇటలీ నుంచి ఓ వ్యక్తి రావడంతో అతడిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.
- పశ్చిమగోదావరి జిల్లాలో నిత్యావసర సరకుల అమ్మకాలను మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు.
‘‘కరోనా నుంచి ప్రజల్ని కాపాడటానికి మా నాన్న పోలీసుగా రోడ్లపై విధులు నిర్వహిస్తున్నారు. మాతో గడిపేందుకు కూడా సమయం ఉండటం లేదు. దయచేసి మీరు ఇళ్లలో ఉండి మా నాన్నకు విశ్రాంతి దొరికేలా చూడండి’’ అంటూ ప్లకార్డు ప్రదర్శిస్తున్న పశ్చిమగోదావరి జిల్లా బాలిక.
Comments
Please login to add a commentAdd a comment