
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌తో సహా వివిధ రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాలకు ఈ నెల 26వ తేదీన జరగాల్సిన ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. దేశం మొత్తం మీద కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా నెలకొన్న ఆందోళనకరమైన పరిస్థితులను సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటికే అభ్యర్థులు వేసిన నామినేషన్లు యథాతథంగా కొనసాగుతాయని, ఎన్నికల పోలింగ్, లెక్కింపును మాత్రమే వాయిదా వేస్తున్నట్లు కమిషన్ పేర్కొంది.
- 17 రాష్ట్రాల నుంచి 55 రాజ్యసభ స్థానాల భర్తీకి మార్చి 6న ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు అయిన మార్చి 18వ తేదీ అనంతరం పది రాష్ట్రాల నుంచి 37 మంది పోటీ లేకుండా ఎన్నికయ్యారు.
- ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, రాజస్థాన్ రాష్ట్రాల్లో 18 స్థానాలకు పోలింగ్ 26న జరగాల్సి ఉంది.
- ఆంధ్రప్రదేశ్‌లో 4 స్థానాలకు 5 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గెలిచే అవకాశం లేకపోయినా.. ఓడిపోయే సీటును వర్ల రామయ్యకు ఇచ్చి టీడీపీ పోటీ చేయిస్తున్న విషయం విదితమే.
- పోలింగ్ రోజున ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు, సహాయక అధికారులు, శాసనసభ్యులు గుమిగూడే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిని నివారించడానికి ప్రజాప్రాతినిథ్య చట్టం–1951లోని 153 సెక్షన్‌ను అనుసరించి ఎన్నికల పోలింగ్‌ను వాయిదా వేసినట్లు కమిషన్ ప్రకటనలో తెలియజేసింది. పరిస్థితిని సమీక్షించిన తరువాత నిర్ణీత సమయంలో తర్వాత తేదీలను ప్రకటిస్తామని కమిషన్ పేర్కొంది.