కార్పొరేట్ స్థాయిలో హాస్టళ్ల అభివృద్ధి | corporate level, the development of hostels | Sakshi
Sakshi News home page

కార్పొరేట్ స్థాయిలో హాస్టళ్ల అభివృద్ధి

Published Mon, Dec 1 2014 12:46 AM | Last Updated on Wed, Aug 29 2018 7:45 PM

కార్పొరేట్ స్థాయిలో హాస్టళ్ల అభివృద్ధి - Sakshi

కార్పొరేట్ స్థాయిలో హాస్టళ్ల అభివృద్ధి

జగ్గంపేట : పేద, బలహీనవర్గాల విద్యార్థులు చదువుకునే వసతిగృహాలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు తెలిపారు. జగ్గంపేటలోని వెలుగు గురుకుల పాఠశాలను ఆదివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలువురు వసతిగృహ ప్రిన్సిపాల్‌పై ఫిర్యాదు చేశారు. ఆమె నిర్లక్ష్యం వల్లే ఇటీవల కలుషితాహారం తిని విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారని, వారికి భద్రత కరువైందని రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు, ఆర్పీఐ జిల్లా అధ్యక్షుడు పులి ప్రసాద్, పీడీఎస్‌యూ విజృంభణ నాయకులు రమేష్, సతీష్ మంత్రికి వివరించారు. ఆమెను సస్పెండ్ చేయాలని వినతిపత్రాన్ని అందించారు. ఆ ఫిర్యాదులను ఆలకించిన మంత్రి వసతి గృహంలో విద్యార్థినుల సంఖ్యపై ఆరా తీశారు.
 
 సాంఘిక సంక్షేమ శాఖ కన్వీనర్‌తో ఫోన్‌లో మాట్లాడి ఎంత మంది విద్యార్థినులు ఉండాలో తెలుసుకున్న రావెల ప్రిన్సిపాల్ ఇందిరా దేవిని విద్యార్థినుల సంఖ్య గురించి అడిగారు. 470 మంది విద్యార్థినులు ఉండాల్సి ఉండగా 407 మంది చదువుతున్నారని, ప్రస్తుతం 293 మందే ఉన్నారని ఆమె తెలిపారు. దీంతో వసతులు, బోధనా తీరు, సిబ్బంది గురించి ఆమెను మంత్రి ప్రశ్నించారు. ఆమె నుంచి సరైన సమాధానం రాలేదు. అనంతరం  మంత్రి మాట్లాడుతూ వసతి గృహంలో విద్యార్థినులు కలుషితాహారం తిని 50 మందికిపైగా అస్వస్థతకు గురైనట్టు తెలిసిందని, ఇందుకు బియ్యం కానీ, నీటి తేడా కానీ కారణం అయి ఉండవచ్చని ఎమ్మెల్యే నెహ్రూ చెప్పారని,  ప్రిన్సిపాల్‌పై ఫిర్యాదులు వచ్చినందున జోనల్ కన్వీనర్‌తో విచారణ చేయించి లోపం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
 
 అనంతరం విద్యార్థినులతో మంత్రి మాట్లాడారు.  నేను తెలుసా అని వారిని ప్రశ్నించగా.. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అని విద్యార్థినులు బదులిచ్చారు. డయల్ యువర్ మినిస్టర్ పేరుతో టోల్ ఫ్రీ నంబరును అందుబాటులోకి తీసుకొచ్చామని, సమస్యలేమైనా ఉంటే దానికి ఫోన్ చేయాలని సూచించారు. నోటీసు బోర్డులో టోల్‌ఫ్రీనంబరు1800-4251-352 ఉంటుందని వివరించారు.  అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ జనవరి నుంచి వసతిగృహాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చేందుకు క్లస్టర్ అప్రోచ్ పేరుతో మూడు స్కూళ్లను కలిపి సుమారు 2,000 మంది విద్యార్థులతో ఒకచోట ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు.
 
 ఇంగ్లిషు మీడియంతోపాటు విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించే చర్యలు చేపడతామన్నారు. జగ్గంపేట గురుకుల పాఠశాల మేడపై నుంచి ఇటీవల పడి గాయపడిన విద్యార్థినిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తానూ వసతి గృహంలోనే చదువుకున్నానని, 1987లో ఐఏఎస్ పాసయ్యానని  మంత్రి కిశోర్‌బాబు వివరించగా, స్థానిక ఎమ్మెల్యే నెహ్రూ కలగజేసుకుని జగ్గంపేట ఎస్సీ బాలుర వసతి గృహాలకు చెందిన వార్డెన్ స్వామి విద్యార్థులను తండ్రిలా చూసుకుంటారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.  కార్యక్రమంలో ఎంపీపీ గుడేల రాణి, వైస్ ఎంపీపీ మారిశెట్టి భద్రం, వైఎస్సార్ సీపీ నాయకులు, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్ మధుసూదనరావు, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement