మరుగుదొడ్లు కట్టకున్నా బిల్లులు మంజూరైనట్లు ఇచ్చిన కాగితం చూపుతున్న లబ్ధిదారులు
ఆలూరు: మరుగుదొడ్ల నిర్మాణంలో హాలహర్వి మండలంలో జరిగిన అవినీతి బయటపడి కొద్ది రోజలు డవక ముందే హొళగుంద మండలం కూడా అదేబాట పట్టింది. థర్డ్‌పార్టీ ముసుగులో కొందరు అధికార పార్టీ నాయకులు స్వచ్ఛంద సంస్థల పేరుతో అవకతవకలకు పాల్పడినట్లు తెలుస్తోంది. మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు మింగేసి నిజమైన లబ్ధిదారుల నోట్లో మట్టి కొట్టినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
లబ్ధిదారులకు తెలియకుండానే..
హొళగుంద మండలంలో స్వచ్ఛ భారత్ కింద మండలానికి 4,500 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరైతే అందులో హొళగుంద గ్రామానికి 2 వేలు మంజూరయ్యాయి. అయితే కొందరు అధికార పార్టీ నేతలు థర్డ్‌పార్టీ ముసుగులో మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు మింగేసినట్లు సమాచారం. బిల్లులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయకుండా థర్డ్‌పార్టీలుగా ఉన్న స్వచ్ఛంద సంస్థల ఖాతాల్లో జమ అయ్యేలా చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు కూడా ఎలాంటి విచారణ చేపట్టకుండానే బిల్లులకు ఓకే చెసినట్లు తెలుస్తోంది. దీంతో నిజమైన లబ్ధిదారులు బిల్లులు అందక బలైపోతున్నారు. ఇదిలా ఉండగా తమ పేరు మీద మరుగుదొడ్డి కట్టినట్లు, బిల్లులు కూడా మంజూరైనట్లు లబ్ధిదారులకు తెలియకపోవడం గమనార్హం. ఇలా ఒక్క హొళగుందలోనే వందలాది మరుగుదొడ్లకు సంబంధించి బిల్లులు స్వాహా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎలా వాడుకున్నారంటే..
ఇంతకు ముందు మరుగుదొడ్డి కట్టుకున్న వారు, అసలు కట్టని వారి పేర్లను తెలుసుకొని ఇళ్ల వద్దకు వెళ్లి ఏవేవో చెప్పి ఆధార్‌కార్డు, రేషన్‌కార్డులను సేకరించారు. వారికి తెలియకుండా లబ్ధిదారులుగా చేర్చి మరుగుదొడ్లు మంజూరు చేయించి పక్కా ప్రణాళికతో నిధులు కాజేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి మరుగుదొడ్డికి జియో ట్యాగింగ్ చేయాల్సి ఉంది. అయితే అక్రమార్కులు టెక్నాలజీని ఉపయోగించి దొంగ రికార్డులు సృష్టించి భారీగా అవకతవకలకు పాల్పడినట్లు తెలుస్తోంది. అక్రమాలు బయట పడుతుండడంతో అక్రమార్కులు ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్న జాబితా ఆధారంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి బిల్లుల డబ్బులు ఇచ్చేస్తున్నట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం తమకేమీ తెలియనట్లు సమాధానం ఇస్తున్నారని, గట్టిగా అడిగిన వారిని దబాయిస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
చేతిలో బిల్లు పెట్టారు
ఇంటికి మరుగుదొడ్డి నిర్మించాలనుకున్నాం. అయితే కొందరు వచ్చి మేము మరుగుదొడ్డి నిర్మించుకున్నట్లు చేతిలో బిల్లు కాగితం పెట్టారు. రూ.15వేలు బిల్లు కాజేశారు. దీంతో మేం మరుగుదొడ్డి నిర్మించుకునే వీల్లేకుం డాపోయింది.– శివప్ప, హొళగుంద గ్రామస్తుడు
మా బిల్లు కాజేశారు
మరుగుదొడ్డి నిర్మించుకుంటే బాగుంటుంది అనుకున్నాం. మొదటి మరగుదొడ్డి నిర్మించుకున్న వెంటనే బిల్లులు ఇస్తామన్నారు. అందుకని కొంత వరకు గుంతను తవ్వి రింగులు వేసుకున్నాం. తరువాత బిల్లు ఇవ్వకుండానే డబ్బు మీకుముట్టిందని చెప్పారు. దీంతో దొడ్డి నిర్మించుకోలేకపోయాం. మా డబ్బు తినేస్తారని అనుకోలేదు. బోయ నాగమ్మ, హొళగుంద
Comments
Please login to add a commentAdd a comment