
జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ ఆశయం అధికార పార్టీ నేతలు, అవినీతి అధికారుల జేబులు నింపుతోంది. జిల్లా వ్యాప్తంగా నిర్దేశించిన మరుగుదొడ్ల నిర్మాణం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. మండల స్థాయిలోని పలువురు అధికారులు లక్షల్లో సొమ్ములు వెనకేసుకుంటున్నారు. గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించకుండానే నిర్మించినట్లు లెక్కలు చూపుతూ బిల్లులు డ్రా చేసుకునే వారు కొందరైతే, ఒకే బ్యాంకు ఖాతాను నలుగురైదుగురు లబ్ధిదారులదిగా చూపి లక్షల్లో మింగేసిన అధికారులూ ఉన్నారు. జరిగిన మోసాలు ఇప్పటికే కొన్ని మండలాల్లో వెలుగులోకి రాగా, మరికొన్ని మండలాల్లో విచారణ జరుగుతోంది.
సాక్షి ప్రతినిధి, తిరుపతి :
వచ్చే ఏడాది మార్చి నాటికి జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న పదేపదే మండల అధికారులకు చెబుతున్నారు. అంతేకాకుండా రోజువారీ లక్ష్యాలను నిర్దేశించి అధికారులను పరుగులు తీయిస్తున్నారు. ప్రతి మండలంలోనూ ఎంపీడీఓ, ఆర్‌డబ్లు్యఎస్ ఏఈ, ఫీల్డ్ అసిస్టెంట్‌లదే ప్రధాన పాత్ర. నిర్మాణ పనులు, నిధుల డ్రా విషయాల్లో వీరే కీలకంగా వ్యవహరించాలి. ఇదే అదునుగా తీసుకున్న కొంతమంది అధికారులు స్థానికంగా ఉండే అధికార పార్టీ నేతలతో కుమ్మక్కై దొంగ లెక్కలు చూపుతున్నారు. ఉదాహరణకు పుంగనూరు నియోజకవర్గం కల్లూరు, చంద్రగిరి నియోజకవర్గ పాకాల మండలాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది.
రూ.5 కోట్లకు పైగా నిధులు జేబుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పంచాయతీ అధికారి ప్రభాకర్ ద్వారా విచారణ చేయించిన కలెక్టర్ ప్రద్యుమ్న ఒకరిద్దరు అధికారులు, ఎంపీడీఓలను సస్పెండ్ చేశారు. ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేలా అధికారులు అవినీతికి పాల్ప డవద్దని చెప్పిన కలెక్టర్ ప్రద్యుమ్న అనుమానమున్న పలు మండలాల్లో జరిగే మరుగుదొడ్ల నిర్మాణ పనులపై ఆరా తీస్తున్నారు. సత్యవేడు, పీలేరు, మదనపల్లి, నగరి, కుప్పం నియోజకవర్గాల్లోనూ కొన్ని మండలాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా సుమారు పాతిక కోట్లకు పైగా నిధులు పక్కదారి పట్టినట్లు సమాచారం. టీడీపీ జిల్లా నాయకులు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి జరిగిన విషయం నిజమేనన్నారు. జిల్లా అధికారులపై ఒత్తిడి తెచ్చి పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని చెప్పారు.
భగ్గుమంటున్న విపక్షాలు..
జిల్లాలో చోటుచేసుకున్న మరుగుదొడ్ల అవినీతిపై విపక్షాలు మండిపడుతున్నాయి. అవినీతికి పాల్పడిన అధికార పార్టీ నేతలు, అధికారులపై చర్యలు తీసుకోవాలని, పక్కదారి పట్టిన నిధులను రికవరీ చేయాలన్న డిమాండుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం చిత్తూరు కలెక్టరేట్ ఎదుట మహా ధర్నాకు పిలుపునిచ్చింది. చిత్తూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు నేతృత్వంలో ధర్నాకు ఏర్పాట్లు జరిగాయి. జిల్లా పార్టీ ప్రముఖులు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్శదర్శులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, కె. నారాయణస్వామి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆర్‌కే రోజా, దేశాయ్ తిప్పారెడ్డి, సునీల్‌కుమార్, చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జులు పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి, రాకేష్‌రెడ్డి, సీవీ కుమార్, రెడ్డెమ్మ, చంద్రమౌళి, ఆదిమూలం, బియ్యపు మ«ధుసూదన్‌రెడ్డిలతో పాటు పార్టీ అనుబంధ సంఘ నేతలు, మహిళా ప్రతినిధులు హాజరవుతున్నారు. ఉదయం 10 గంటలకు ధర్నా ప్రారంభం కానుంది. మధ్యాహ్నం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించనున్నారు. ఇదిలా ఉండగా ఇదే సమస్యను లేవనెత్తుతూ చిత్తూరు బీజేపీ నేత సీకే బాబు మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.