చిన్నతిరుమలేశుని సాక్షిగా..స్వాహా! | Corruption Using God | Sakshi
Sakshi News home page

చిన్నతిరుమలేశుని సాక్షిగా..స్వాహా!

Published Mon, Dec 3 2018 3:17 PM | Last Updated on Mon, Dec 3 2018 3:17 PM

Corruption Using God - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు: అందినకాడికి దండుకోవడం.. అది బట్టబయలైతే సరిచేసుకోవడం. ఇదీ చినవెంకన్న సాక్షిగా ద్వారకాతిరుమల ఆలయంలో సాగిపోతున్న వ్యవహారం. ‘పెద్దల’ అండదండలు, అధికారుల ఆశీస్సులు ఉన్న కొందరు సిబ్బంది, వారు చేసిన తప్పులను మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. వెంకన్న సొమ్ములు దిగమింగి ఏళ్లతరబడి దర్జాగా తిరుగుతున్నవారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మిన్నకుంటున్నారు. దీంతో ఇక్కడ అక్రమార్కులు ఆడింది ఆట.. పాడింది పాటగా సాగుతోంది. ఎలాగో క్రిమినల్‌ చర్యలుండవు.. మహా అయితే సస్పెండ్‌ చేస్తారు. ఎలాగోలా నెల తిరక్కుండా మళ్లీ ఉద్యోగంలో చేరిపోవచ్చు. ఇది దేవస్థానంలోని కొందరు ఉద్యోగుల ధీమా.!  రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఒకటైన ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం దినదినాభివృద్ది చెందుతోంది. భక్తుల రాకకు అనుగుణంగా స్వామి ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. అయితే ఈ దేవస్థానంలో కొందరు సిబ్బంది రూ.లక్షల్లో సొమ్ములు స్వాహా చేసి ఏళ్లు గడుస్తున్నా, వారిపై అధికారులు ఏవిధమైన చర్యలు తీసుకోక పోవడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఈఎండీలు, నేతిడబ్బాలు, కవర్ల స్కామ్‌లు దర్పణంగా నిలుస్తున్నాయి.
 
పక్కదారిపట్టిన ఈఎండీలపై చర్యలేవీ.. 
శ్రీవారి దేవస్థానంలో పలు అభివృద్ధి పనులకు గాను కాంట్రాక్టర్లు చెల్లించిన ఈఎండీ (ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌) సొమ్ము దేవస్థానానికి పూర్తిస్థాయిలో జమకావడం లేదని గతేడాది అక్టోబర్‌లో అప్పటి ఈవో వేండ్ర త్రినాథరావు గుర్తించారు. 2013 నుంచి 2016 మధ్య కాలంలో సుమారు 200 డీడీలకు సంబంధించి రూ. 10 లక్షలకు పైగా సొమ్ము పక్కదారి పట్టినట్లు తెలుసుకుని, దానిపై సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగం అధికారులకు ఆయన నోటీసులిచ్చారు. దీనిపై అప్పట్లో సాక్షి దినపత్రికలో ‘గోవిందా.. గోవింద’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఇదిలా ఉంటే ఇంజినీరింగ్‌ విభాగ పీఎస్‌ చార్జెస్‌ ఉద్యోగి ఎల్‌టీ.కుమార్‌ విధుల పట్ల నిర్లక్ష్యం వహించి కొన్ని డీడీలు అకౌంట్‌ సెక్షన్‌కు పంపకుండా పక్కన పడేసినట్లు అధికారులు గుర్తించారు. అలాగే మరికొన్ని డీడీలు పనులు పూర్తి కాకుండానే సంబంధిత కాంట్రాక్టర్లకు వెనక్కి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే విషయం తెలుసుకున్న అధికారులు పక్కనపడేసిన డీడీలను అకౌంట్‌లో వేయించి, ఆడిట్‌లు చేయించారే గానీ ఇందుకు బాధ్యులైన ఉద్యోగులపై చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
వెంకన్నా... కవర్ల స్కామ్‌ ఏమైందయ్యా?
శ్రీవారి ఆలయంలో ప్రసాదాల కవర్ల కొనుగోలులో సైతం కొందరు సిబ్బంది తమ చేతి వాటాన్ని ప్రదర్శించారు. 2013లో దాదాపు రూ.15 లక్షల వరకు కవర్ల స్కామ్‌ జరిగినట్లు బట్టబయలైంది. దీనిపై అప్పట్లో సాక్షి దినపత్రికలో ‘ప్రసాదాల కవర్ల కొనుగోలులో కుంభకోణం’ శీర్షికన 2013 అక్టోబర్‌ 29 నుంచి వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. వీటిపై అప్పటి ఈవో వేండ్ర త్రినాథరావు విచారణ నిర్వహించి, కవర్ల కొనుగోలులో భారీ స్కామ్‌ జరిగినట్లు నిర్ధారించారు. దీనిపై ముగ్గురు ఉద్యోగులకు మెమోలు కూడా జారీ చేశారు. అలాగే కవర్లు తక్కువగా సరఫరా చేసి, ఎక్కువ బిల్లులు వసూలు చేయడంపై సంబంధిత కాంట్రాక్టర్‌కూ అధికారులు నోటీసులిచ్చారు. అధికారుల చర్యలను నిలుపుదల చేసేందుకు కొందరు ఉద్యోగులు అప్పట్లో జోరుగా పైరవీలు సాగించారు. ఇవి ఫలించడంతో అక్రమార్కులు ఈ స్కామ్‌ నుంచి బయటపడ్డారు. ఇదిలా ఉంటే కవర్లు సరఫరా చేసిన కాంట్రాక్టరు సెక్యూరిటీ నిమిత్తం దేవస్థానం వద్ద ఉంచిన సుమారు రూ. 15 లక్షలను అధికారులు రికవరీ చేసి, చేతులు దులుపుకున్నారు. సొమ్ము రికవరీ జరిగిందంటే.. ఇక్కడ తప్పు జరిగినట్టు స్పష్టంగా తెలుస్తోంది. అటువంటప్పుడు ఈ అవకతవకలు జరగడానికి కారకులైన ఉద్యోగులపై ఇప్పటి వరకు క్రిమినల్‌ చర్యలుగానీ, శాఖాపరమైన చర్యలుగానీ ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

నేతి డబ్బాల వ్యవహారంలో..
ఆలయంలో ఇటీవల కొందరు వంట స్వాములు మూడు నేతిడబ్బాలను పక్కదోవ పట్టించారు. విషయం తెలుసుకున్న అధికారులు వాటిని దాచిపెట్టిన ఇంటికెళ్లి మరీ స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఇంటి యజమాని ఫలానా ఉద్యోగులు తమ వద్ద నేతిడబ్బాలను ఉంచినట్లు చెప్పారు. అయితే ఆ ఉద్యోగులు తమకు సంబంధం లేదని, ఆ ఇంటి యజమానికి, తమకు పడకపోవడం వల్లే అలా చెబుతున్నారని అన్నారు. దీనిపై విచారణ నిర్వహించిన అధికారులు క్రిమినల్‌ చర్యలు తీసుకోకపోయినప్పటికీ కనీసం శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఇందుకు బాధ్యులుగా భావించి, ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్‌ చేశారు. అయితే చిన్నచిన్న తప్పులు చేసే ఉద్యోగులపై క్రిమినల్, శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్న అధికారులు దేవుడి సొమ్మును రూ.లక్షల్లో స్వాహా చేస్తున్న ఉద్యోగులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పెద్దల అండదండలున్న ఉద్యోగులకు అధికారులు సైతం కొమ్ము కాస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. ఇప్పటికైనా అధికారులు గోల్‌మాల్‌ అయిన సొమ్మును రికవరీ చేయడమే కాకుండా, అందుకు బాద్యులైన ఉద్యోగులపై చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కావు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement