17 గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ తీర్మానం
కలెక్టర్ నివేదించనున్న మున్సిపల్ పాలకవర్గం
విజయనగరం మున్సిపాలిటీ: సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ అయిన విజయనగ రానికి కార్పొరేషన్‌గా స్థాయి పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మున్సిపల్ కౌన్సిల్ అంగీకారం తెలుపుతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్ని జిల్లా కేంద్రాలను కార్పొరేషన్‌లుగా అప్‌గ్రేడ్ చేయనుండడంతో ఈ మేరకు పాలకవర్గం తరఫున ప్రభుత్వానికి పంపించాల్సిన ప్రతిపాదను సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. కార్పొరేషన్ హోదాకు అవసరమయ్యే 3 లక్షల జనాభా కోసం 21 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయాలని కౌన్సిల్ అజెండాలో ప్రతిపాదించగా.. 17 గ్రామ పంచాయతీల విలీనానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
విలీన పంచాయతీల్లో నారాయణపురం, కొండకరకాం, ద్వారపూడి, దుప్పాడ, సారిక, గొల్లలపేట, జగన్నాథపురం, సిరియాలపేట, హజీసాహెబ్‌పేట, మలిచర్ల, బియ్యాలపేట, చెల్లూరు, నెల్లిమర్ల, జరజాపుపేట, చింతవలస, రఘుమండ, పెదతాడివాడ ప్రాంతాలున్నాయి. అజెండాలో పొందిపరిచి, తొలగించిన వాటిలో రామవరం, కరకవలస, జియ్యన్నవలస, గొట్లాం గ్రామాలున్నట్లు మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ తెలిపారు. విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారం 2లక్షల 44వేల 598 జనాభా ఉండగా.. 17 గ్రామ పంచాయతీలను విలీనం చేయడం ద్వారా ఆ సంఖ్య 3 లక్షల 7వేల 942కు పెరగనుంది. ప్రస్తుతమున్న 52.46 చదరపుకిలోమీటర్ల విస్తీర్ణం, సుమారు 145 చదరపు కిలోమీటర్లకు విస్తరించనుంది.
వాస్తవానికి 21 గ్రామ పంచాయతీల విలీనంపై ముందునుంచి కౌన్సిల్ సభ్యులు అంతగా ఆసక్తిగా లేరనే చెప్పాలి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న ప్రాంతాలను విలీనం చేయాలని భావించారు. ఈనేపధ్యంలో అధికారులు తయారు చేసిన నివేదికలో ఐదు పంచాయతీలను తొలగిస్తారన్న వాదనలు వ్యక్తం కాగా.. నాలుగు పంచాయతీలతో సరిపెట్టారు. 1888 సంవత్సరంలో మున్సిపాలిటీగా ఏర్పడిన విజయనగరం పట్టణం, 1998 నాటికి సెలక్షన్ గ్రేడ్‌మున్సిపాలిటీ హోదా దక్కించుకుంది.
కార్పొరేషన్ హోదాతో అభివృద్ధికి అవకాశం : మున్సిపల్ చైర్మన్
విజయనగరానికి కార్పొరేషన్ హోదా కల్పించడం వల్ల అభివృద్ధికి అవకాశం ఉంటుందని మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ అన్నారు. కార్పొరేషన్‌గా స్థాయి పెంపు తన హయాంలో చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. కార్పొరేషన్‌లకు కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తుందని, అలా కేటాయించిన నిధులతో అన్ని రంగాల్లో పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవచ్చన్నారు.
స్వాగతిస్తున్నాం : ప్రతిపక్ష కౌన్సిలర్ రాజేష్
విజయనగరం మున్సిపాలిటికి కార్పొరేషన్ హోదా కల్పించడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు ప్రతిపక్ష కౌన్సిలర్ ఎస్‌వివి రాజేష్ తెలిపారు. అయితే నిబంధనలకు అనుగుణంగా ప్రతిపానదలు జరగలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలను విలీనం చేసే ప్రక్రియలో అక్కడి ఆర్థిక పరిస్థితులను, అవసరాలను బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా ప్రణాళిక బద్ధంగా చర్చ జరిపితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కార్పొరేషన్‌కు... కౌన్సిల్ అంగీకారం
Published Sat, Aug 1 2015 2:52 AM | Last Updated on Tue, Oct 16 2018 6:15 PM
Advertisement