ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల అధికారి లేఖ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలోని ఖాళీ స్థానాల అంశం రాష్ట్ర ఎన్నికల సంఘానికి, మండలికి మధ్య వివాదంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో చూపిన మేరకు 50 స్థానాలకు మించకుండా.. ప్రస్తుతమున్న సభ్యుల సంఖ్యకు అనుగుణంగా ఖాళీ స్థానాలను సర్దుబాటు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయ వర్గాలు స్పష్టం చేస్తుండగా శాసనమండలి మాత్రం అందుకు ససేమిరా అంటోంది. దీనిపై ఎన్నికల సంఘానికి శాసనమండలి ప్రత్యేక లేఖ పం పింది. ఏపీ పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ మండలికి కేటాయించిన స్థానాలు 50. మండలి వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం 40 మం ది సభ్యులుండగా 13 ఖాళీ స్థానాలున్నాయి. ఈ రెండూ కలిపితే 53 అవుతాయి. చట్టంలో పేర్కొన్నదానికి భిన్నంగా మూడు స్థానాలు అదనంగా ఉన్నట్టు అవుతోంది. స్థానాలను తగ్గించాలంటే వాటి పూర్తి పదవీకాలం ముగిశాకే సాధ్యమవుతుందని మండలి వర్గాలు వివరిస్తున్నాయి.
శాసనమండలిలో ఖాళీగా ఉన్న 13 స్థానాల్లో 11 స్థానిక సంస్థల కోటా, ఎమ్మెల్యే కోటా ఒకటి, మరొకటి గవర్నర్ నామినేటెడ్ కోటాగా ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. స్థానిక సంస్థల కోటా స్థానాల్లో తొమ్మిది స్థానాలు గతంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలు ఆలస్యం అవ్వడం వల్ల భర్తీకాకుండా ఖాళీగా ఉన్నాయి. పోతుల రామారావు, తిప్పారెడ్డి, షేక్ హుస్సేన్‌లు మధ్యలో రాజీనామాలు చేసినందున, ఆ స్థానాల పదవీకాలం ఇంకా ఉన్నందున.. అప్పటివరకు అవి ఏపీ మండలి కోటాగానే ఉంటాయని, అందువల్ల వాటిని ఖాళీస్థానాలుగానే పరిగణిస్తాం తప్ప తగ్గినట్లుగా చూపలేమని మండలి వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే కోటాలో 17 స్థానాలకుగాను విభజన చట్టంలో 16 పేర్లను ఇదివరకు సూచించారు. అందులో కోలగట్ల వీరభద్రస్వామి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఈనెల 24న ఎన్నిక నిర్వహించనున్నారు. దీంతో మరో స్థానాన్ని అక్కడ భర్తీచేయాల్సి ఉంది. గవర్నర్ నామినేటెడ్ కోటాలోని షేక్ హుస్సేన్ రాజీనామా చేసినందున అది పూర్తిగా రద్దయినట్లుగా భావించి ఎమ్మెల్యే కోటాలో భర్తీచేయాల్సిన 17వ స్థానాన్ని నోటిఫై చేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
మండలి ఖాళీ స్థానాలపై వివాదం
Published Thu, Aug 7 2014 3:39 AM | Last Updated on Sat, Jun 2 2018 3:39 PM