దొంగ నోట్ల ముఠా సభ్యులను మీడియాకు చూపుతున్న వన్‌టౌన్ పోలీసులు (స్వాధీనం చేసుకున్న నోట్లు)
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: నకిలీ నోట్లు చలామణి చేసేందుకు యత్నిస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని వారినుంచి రూ.10 లక్షలకు పైగా నకిలీ నోట్లు, వాటి తయారీకి వినియోగించిన యంత్రాన్ని స్వాధీ నం చేసుకున్నట్లు డీఎస్పీ నాగరాజ తెలి పారు. సోమవారం స్థానిక వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. రాయదుర్గం పట్టణానికి చెందిన వీరయ్య అక్షయ గోల్డ్ ఏజెంట్‌గా పలువురితో ఆ సంస్థలో డిపాజిట్లు చేయించాడు.
ఆ సంస్థ బోర్డు తిప్పేయడంతో డిపాజిట్‌దారులు డబ్బు చెల్లించాలంటూ ఒత్తిడి తేవడంతో తనను సమ స్య నుంచి గట్టెక్కించే మార్గం చూపాలం టూ అతను హిందూపురానికి చెందిన తాహిద్‌ను కోరాడు. ఇదే అదనుగా భావించిన అతను అనంతపురంలోని రాణీ నగర్‌కు చెందిన తన మిత్రుడు మగ్బూల్ అనే వ్యక్తి నకిలీ నోట్లు తయా రు చేస్తాడని, అతనిని కలిస్తే సమస్య పరిష్కారమవుతుందని సూచించాడు.
దీంతో ఇద్దరూ కలసి మగ్బూల్‌ను కలువగా రూ.లక్ష నగదు ఇస్తే రూ.30 లక్షల విలువైన నకిలీ నోట్లు ఇస్తానని చెప్పాడు. అతను సూచించిన మొత్తాన్ని వీరయ్య చెల్లించడంతో, ఆ డబ్బుతో కలర్ జెరాక్స్ మెషీన్, ప్రింటర్ తదితర పరికరాలు కొనుగోలు చేశాడు. నగరంలోని వేణుగోపాల్ నగర్‌లోని ఓ ఇంట్లో భార్య ముం తాజ్ సాయంతో నోట్ల తయారీ ప్రారంభించాడు. రూ.3 లక్షల విలువైన నకిలీ నోట్లను వీరయ్యకు అందజేశాడు. తానూ కొన్ని నోట్లను చలామణి చేసేందుకు సోమవారం సాయంత్రం తాడిపత్రి బస్టాండు సమీపంలో తాహీద్‌తో కలసి ప్రయత్నిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.
నకిలీ కరెన్సీ తయారీలో శిక్షణ పొందిన మగ్బూల్
గుత్తికి చెందిన మస్తాన్ కూతురు ముంతాజ్‌ను మగ్బూల్ వివాహం చేసుకున్నాడు. మస్తాన్ నకిలీ కరెన్సీ తయారీలో సిద్ధహస్తుడు. అతని వద్దే మగ్బూల్ శిక్షణ పొందాడు. అలా నేర్చుకున్న విద్యతో గతంలోనకిలీ కరెన్సీ తయారు చేసి చలామణి చేస్తూ ధర్మవరం, హిందూపురం పోలీసులకు పట్టుబడ్డాడు. కాగా, ప్రస్తుతం మగ్బూల్, తాహిద్‌లు పోలీసులకు పట్టుబడగా, వీరయ్య, మగ్బూల్ భార్య ముంతాజ్‌లుపరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బంది రమేష్, నాగరాజ తదితరులను అభినందించారు.