నార్పల, న్యూస్‌లైన్ : కుటుంబ కలహాలతో గొడవ పడి దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, భార్య మృతి చెందింది. క్రిమి సంహారక మందు తాగిన భర్తను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.మండల కేంద్రంలోని శక్తినగర్ కాలనీలో సోమవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు, కాలనీవాసుల చెప్పిన వివరాల మేరకు.. శింగనమల మండలం చిన్నమట్టగొంది గ్రామానికి చెందిన ధనలక్ష్మి(26)కి, పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట గ్రామానికి చెందిన పెద్దన్నతో ఏడేళ్ల క్రితం వివాహమైంది.. పెద్దన్నకు ధనలక్ష్మి స్వయానా అక్క కూతురు. చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులను కోల్పోయింది. కాగా 15 ఏళ్ల క్రితమే పెద్దన్న స్వగ్రామం నుంచి నార్పలకు వలస వచ్చి, ఓ మిఠాయి అంగడిలో పని చేస్తూ జీవిస్తుండేవాడు.
పెళ్లైన తర్వాత పానీపూరీ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కొంత కాలంగా అతను జూదానికి బానిసయ్యాడు. భర్తను ఆ వ్యసనం నుంచి తప్పించాలని భావించిన భార్య అతని చేత అయ్యప్పస్వామి మాలధారణ చేయించింది. అయినా అతను జూదాన్ని మానలేదు. దీంతో తన మాట వినలేదని తీవ్ర మనస్తాపం చెందిన ఆమె భర్త ఇంట్లోలేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుంది. ఇరుపొరుగు ఇళ్ల పిల్లలు గమనించి విషయం చెప్పడంతో స్థానికులు పరుగున ఇంట్లోకి వెళ్లి ఆమె మెడకు బిగుసుకున్న తాడును తెంపారు. కొనఊపిరితో ఉన్న ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మరణించింది. స్థానికుల ద్వారా ఈ సమాచారం తెలియడంతో ఖిన్నుడైన పెద్దన్న క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు వెంటనే అతన్ని 108 అంబులెన్స్‌లో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా ఈ దంపతులకు పిల్లలకు లేరు. ఎస్‌ఐ శేఖర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
దంపతుల ఆత్మహత్యాయత్నం
Published Tue, Dec 17 2013 6:26 AM | Last Updated on Wed, Jul 10 2019 8:00 PM
Advertisement
Advertisement