
సీపీ బదిలీ?
విజయవాడ నగర పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
కోడ్ అమలులో ఉన్నా ప్రత్యేక అనుమతితో..
రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం
కొత్తగా కమిషనర్‌గా ఆర్‌పీ ఠాకూర్?
విజయవాడ బ్యూరో : విజయవాడ నగర పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ స్థానంలో హైదరాబాద్‌లో శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా పనిచేస్తున్న ఆర్‌పీ ఠాకూర్‌ను నియమించవచ్చనే ప్రచారం జరుగుతోంది. రాజధాని నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్ పోస్టును డీఐజీ స్థాయి నుంచి అదనపు డీజీపీ స్థాయికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాదులో ఎస్‌పీఎఫ్ అదనపు డీజీపీగా పనిచేస్తున్న ఏబీ వెంకటేశ్వరరావును గత ఏడాది అక్టోబరు ఆరో తేదీన విజయవాడ కమిషనర్‌గా బదిలీ చేసింది. ఆ నెల 12న ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న కమిషనర్ అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధుల ఆగ్రహం కూడా చవిచూడాల్సి వచ్చింది. నగరానికి తానే రాజుననే విధంగా కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారనీ, ప్రజాప్రతినిధులకు ఏమాత్రం సమాచారం ఇవ్వడం లేదని ఎంపీ కేశినేని నాని బహిరంగంగానే విమర్శలు చేశారు. కమిషనర్ ప్రారంభించిన నైట్ డామినేషన్, ఫుడ్ కోర్టు కార్యక్రమాలు అనేక వివాదాలకు బీజం వేశాయి. ఇదే సమయంలో కమిషనర్ తన సొంత పలుకుబడి పెంచుకోవడానికి ఇంటి వద్దకే ఎఫ్‌ఐఆర్, ఎస్‌ఎంఎస్‌తో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం లాంటి కార్యక్రమాలు ప్రారంభించారనే విమర్శలు ఎదుర్కొన్నారు.
భారీ బదిలీల్లో భాగంగానే...
రేవంత్‌రెడ్డి వ్యవహారంలో జరిగిన స్టింగ్ ఆపరేషన్ సమాచారం ఇంటెలిజెన్స్, పోలీసు శాఖల వైఫల్యం వల్లే తమకు ముందుగా తెలియకుండాపోయిందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే పోలీసు శాఖలో భారీగా బదిలీలు చేయాలని ఆయన నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే సీపీ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్ విభాగానికి బదిలీ చేయాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. ఈ నిర్ణయం వల్ల విజయవాడలో పార్టీ ప్రజాప్రతినిధులకు, పోలీసు శాఖకు ఉన్న గొడవలు సమసిపోవడంతో పాటు, తనకు అనుకూలమైన వ్యక్తిని కీలక స్థానంలో నియమించుకున్నట్లు అవుతుందని సీఎం పోలీసు ఉన్నతాధికారుల వద్ద చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. బదిలీ విషయం గురించి ప్రభుత్వ పెద్దలు సీపీతో చర్చించారని, ఇంటెలిజెన్స్ విభాగానికి వెళ్లడానికి ఆయన కూడా సానుకూలత వ్యక్తం చేశారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని ఈ బదిలీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. రెండు, మూడు రోజుల్లో సీపీ బదిలీ జరిగే అవకాశముందని పోలీసు వర్గాల్లో వినిపిస్తోంది.