సాక్షి, అమరావతి బ్యూరో/అమరావతి : సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్ హత్య కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. అతడిని శిఖాచౌదరి ప్రియుడే చంపాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న శిఖాచౌదరి ప్రియుడు రాకేష్‌రెడ్డి నేరచరిత్రపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇతడిపై కూకట్‌పల్లి, మాదాపూర్, జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా హత్యకు గురయిన జయరామ్ భార్య పద్మశ్రీ.. మేనకోడలు శిఖాచౌదరిపై సంచలన ఆరోపణలు చేశారు. శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్ అంటూ దుయ్యబట్టారు. తన అక్క నుంచే ప్రాణహాని ఉందని గతంలో తనకు జయరాం చెప్పారన్నారు. ఆయన భారత్‌కు వచ్చాక ఇంత ఘోరం జరుగుతుందని అనుకోలేదని ఆమె వాపోయారు. వ్యాపార లావాదేవీల సమావేశం నిమిత్తమే అమెరికా నుంచి భారత్‌కు వచ్చారని పద్మశ్రీ తెలిపారు.
రెండేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్నాడు
ఎన్నారై జయరామ్‌ను శిఖాచౌదరి ప్రియుడే హత్య చేశాడని నిర్ధారణకు వచ్చిన కృష్ణాజిల్లా పోలీసులు.. అసలు హత్యకు దారితీసిన కారణాలేంటి? ఎలా చేశాడు? ఎవరు సహకరించారు? అనే విషయాలు అతడి నుంచి రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు. విచారణలో పోలీసులకు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. ‘జయరామ్‌కు మెదక్‌లో టెక్ట్రాన్ పాలీలెన్స్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఉద్యోగులు జీతం అందక గొడవ చేస్తున్న సమయంలో రెండేళ్ల కిందట నా వద్ద రూ. 4.50 కోట్ల అప్పు తీసుకున్నాడు. ఆ సమయంలోనే జయరామ్ మేనకోడలు శిఖాచౌదరి పరిచయం అయింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ బంధం బలపడడంతో ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఆమె కోసం నేను చాలా డబ్బు ఖర్చు పెట్టా. శిఖా చౌదరిని వదిలేయాలని జయరామ్ నన్ను కోరాడు. నాకు ఇవ్వాల్సిన 4.50 కోట్లతో పాటు శిఖాకి ఖర్చు పెట్టిన కోటి రూపాయలు ఇస్తే వదిలేస్తానని చెప్పాను. అందుకు సరే అన్న జయరామ్ ఇప్పటి వరకూ పైసా ఇవ్వలేదు. జనవరి 29న జయరామ్ అమెరికా నుంచి వచ్చినట్లు తెలిసి డబ్బులు అడగడానికి వెళ్లా. నాపైనా ఒత్తిడి ఉంది. ఎంత అడిగినా జయరామ్ డబ్బులు ఇవ్వకపోయే సరికి తీవ్రస్థాయిలో బెదిరించాను. దీంతో 31వ తేదీన ఉదయం అతడు ఒంటరిగా మా ఇంటికి వచ్చాడు. నా ఇంట్లో నుంచే పలువురికి జయరాం ఫోన్ చేసి డబ్బు సర్దుబాటు చేయమని కోరాడు. చివరకు కోస్టల్ బ్యాంక్‌లో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి ద్వారా రూ. 6 లక్షలు నా స్నేహితులకు అందజేశాడు. రూ.5.5 కోట్లకు గానూ కేవలం 6 లక్షలు ఇవ్వడమేంటని జయరామ్‌తో వాదనకు దిగాను. అది తీవ్రస్థాయికి చేరింది. దాంతో జయరాంపై పిడిగుద్దులు గుద్దాను. జయరామ్ హార్ట్ పేషెంట్ కావడంతో ఆ దెబ్బలకే చనిపోయాడు. అప్పుడు ఏంచేయాలో తెలియక మృతదేహాన్ని సాయంత్రం వరకు ఇంట్లో ఉంచుకుని అనంతరం కారులో తీసుకెళ్లి నందిగామ సమీపంలోని ఐతవరం వద్ద కారు వెనుక సీటులో ఉన్న అతడిని బయటకు తీసి స్టీరింగ్ సీటులో కూర్చోపెట్టే ప్రయత్నం చేశా. అది కుదరకపోవడంతో అతడి చేతిలో బీరు సీసా ఉంచి.. మరో బీర్‌ను రోడ్డుపై పడేశా.. అక్కడి నుంచి నేను బస్సు ఎక్కి హైదరాబాద్ వచ్చేశా.’అని పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది.
నిందితుడు రాకేశ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(ఫైల్)
శిఖాచౌదరి ప్రియుడి నేర చరిత్రపై ఆరా..
చిగురుపాటి జయరామ్ హత్యకేసులో నిందితుడు శిఖాచౌదరి ప్రియుడి నేరచరిత్రపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ కేసును విచారిస్తున్న పోలీసులకు నమ్మలేని నిజాలు వెల్లడవుతున్నాయి. గతంలో ఓ హీరోయిన్ వ్యభిచారం కేసులో అతడు పట్టుబడినట్లు గుర్తించారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే పేరు చెప్పి రూ.80 లక్షలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కూకట్‌పల్లి పోలీసుస్టేషన్‌లో అతడిపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లో అనేక మోసాలు, దందాల్లో అతడి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తెలంగాణ టీడీపీ నేతలతోనూ సత్సంబంధాలున్నాయని తెలుస్తోంది. గత ఎన్నికల్లో టికెట్లు ఇప్పించే విషయంలోనూ భారీ లాబీయింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కుమారుడినంటూ సినిమా ఆరిస్టులతో పరిచయాలు.. హీరోయిన్లతో పార్టీలు పెట్టి పనులు చక్కదిద్దడంలో అతడు దిట్టని తెలుస్తోంది. ఇదిలా ఉండగా..శిఖాచౌదరి స్నేహంతో తమ కుమారుడు ఇంటికి రావడమే మానేశాడని, ఆమె పరిచయంతోనే అతడిలో మార్పు వచ్చిందని రాకేష్‌రెడ్డి తండ్రి చెబుతున్నారు. గతంలో అతడికి ఎలాంటి చెడు అలవాట్లు లేవని, జయరాం కేసులో తన కుమారుడిని అనవసరంగా ఇరికిస్తున్నారని ఆయన మీడియా వద్ద వాపోయారు.
ఇంత దూరం ఎందుకురావాల్సి వచ్చింది?
కోపంతో జయరామ్‌ను చంపేసిన చాలా గంటలపాటు మృతదేహాన్ని తన ఇంట్లోనే ఉంచుకున్నానని, ఆ తర్వాత మృతదేహాన్ని నందిగామ తీసుకొచ్చి.. ప్రమాదంగా చిత్రికరించి బస్ ఎక్కి వెళ్లిపోయానని శిఖాచౌదరి ప్రియుడు విచారణలో పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అప్పటికే నేరాలు చేయడంలో ఆరితేరిన అతడు ఇంతదూరం ప్రయాణించి సీసీ టీవీ నిఘా ఉండే టోల్‌గేట్లు దాటుకుంటూ నందిగామ సమీపంలోని ఐతవరం వరకు ఎందుకు రావాల్సి వచ్చిందన్నదే ఇప్పుడు మిస్టరీగా మారింది. ఒకవేళ జయరామ్ మృతి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించదలచుకుంటే హైదరాబాద్ శివారు దాటగానే ఆ పనిచేసి ఉండవచ్చు. కానీ నింపాదిగా కారులో ప్రయాణం చేసి నందిగామ వచ్చాక రాత్రి 10.20–10.41 నిమిషాల మధ్య పాతబస్టాండు సమీపంలోని విజయా బార్‌లో రెండు బీర్లు కొనుగోలు చేసినట్లు సీసీ టీవీ ఫుటేజీల్లో రికార్డు అయ్యింది.
ఇంత ఘోరంగా చంపుతారనుకోలేదు: పద్మశ్రీ
తన భర్త హత్య కేసులో అతని తరఫు బంధువులపైనే అనుమానాలున్నాయని జయరామ్ భార్య పద్మశ్రీ ఆరోపించారు. కేసు విచారణలో భాగంగా ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసినట్లు సమాచారం. 2016 నుంచి ప్రాణాపాయం ఉందని జయరామ్ తనతో చెప్పేవారని తెలిపారు. సొంత అక్కతోనే ప్రాణహాని ఉందని జయరామ్ చెప్పేవారని పద్మశ్రీ వెల్లడించారు. మేనకోడలు శిఖా చౌదరి ప్రమే యం ఎక్కువ అవ్వడంతో ఆమెను చానల్ బాధ్యతల నుంచి తప్పించినట్లు పోలీసులకు చెప్పారు. అమెరికా నుంచి భారత్‌కు వచ్చాక ఇంత ఘోరంగా చంపుతారని ఊహించలేదని పద్మశ్రీ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.
జయరామ్ హత్య కేసులో ఎవర్ని తప్పించేది లేదు: డీజీపీ
కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరామ్ హత్య కేసులో ఎవరిని తప్పించే అవకాశంలేదని డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు. జయరామ్ హత్య కేసులో కీలక వ్యక్తులను కృష్ణా జిల్లా పోలీసులు తప్పిస్తున్నారనే ఆరోపణలను పలువురు మీడియా ప్రతినిధులు సోమవారం డీజీపీ దృష్టికి తెచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఈ కేసులో నిందితులు అందర్నీ కచ్చితంగా అరెస్టు చేస్తామని వెల్లడించారు. జయరామ్ హత్య కేసులో విచారణ దాదాపు పూర్తి అయ్యిందని అన్నారు. కేసు విచారణకు ఆరు బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టినట్టు చెప్పారు. జయరాంను హైదరాబాద్ లో హత్య చేసి కృష్ణా జిల్లాకు తీసుకొచ్చినట్టు తేలిందన్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కృష్ణా జిల్లా పోలీసులు త్వరలోనే మీడియాకు వెల్లడిస్తారని డీజీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment