జై తెలంగాణ అంటూ టీఆర్‌ఎస్ నేతలకంటే గట్టిగా డప్పుకొట్టి నినదించిన సీపీఐ నారాయణ సొంత జిల్లాకు దూరమైపోయారు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: జై తెలంగాణ అంటూ టీఆర్‌ఎస్ నేతలకంటే గట్టిగా డప్పుకొట్టి నినదించిన సీపీఐ నారాయణ సొంత జిల్లాకు దూరమైపోయారు. రాష్ట్ర విభజనపై వ్యతిరేకత ప్రారంభమైనప్పటి నుంచి ఆయన సొంత జిల్లా చిత్తూరుకు రావడమే మానేశారు. అంతకుముందు వారానికి రెండు సార్లు జిల్లాలో వాలిపోయే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తన దుందుడుకు ప్రకటనలతో తిరుపతికి వచ్చే సాహసమే చేయడం లేదు.
చిత్తూరు జిల్లా నగరి మండలం అయినంబాకం గ్రామానికి చెందిన నారాయణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత పలు సంచలనాలకు కేంద్రబిందువయ్యారు. అయితే, నారాయణ నేతృత్వంలోని సీపీఐ ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొన్న తరువాత ఆ పార్టీ సీమాంధ్రలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. చిత్తూరులో నారాయణతోపాటే ఆ పార్టీ నేతలు రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి లేదు. మరో పక్క రాష్ట్రంలో ప్ర స్తుత పరిస్థితులపై సీపీఎం సమీక్ష పేరిట సీమాంధ్ర జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని గట్టిగా ప్రకటిస్తుండడంతో ఇప్పుడు సీపీఐ క్యాడర్‌పై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో, గతంలో తమ పార్టీ కూడా సమైక్యాంధ్రకు అనుకూలంగా ఉద్యమాలు చేసిందని, ఈ సారి మాత్రమే తెలంగాణకు మద్దతిచ్చామని నారాయణ వివరణ ఇచ్చుకొంటున్నారు.
వీటి సంగతెలా ఉన్నా తరచూ తిరుపతికి వచ్చి హల్‌చల్ చేసే నారాయణ ఇప్పుడు కనిపించడం లేదు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నారాయణ సొంత గ్రామంలో ఆ పార్టీ ఏమాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది. ఇప్పుడు జిల్లాలో సీపీఐ పరిస్థితి దయనీయంగా మారింది. ఏదో సాకుతో రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు చేద్దామంటే సమైక్యవాదుల నుంచి ప్రతిఘటన ఎదురవుతుందని ఆ పార్టీ నేతలు భయపడుతున్నారు. ప్రత్యేక తెలంగాణకు మద్దతిస్తున్న బీజేపీ నేతల కంటే ఇబ్బందికరమైన పరిస్థితులను సీపీఐ నేతలు జిల్లాలో ఎదుర్కొంటున్నారు. అందుకు కారణం నారాయణ వివాదస్పద వ్యాఖ్యలు, ైవె ఖరే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమం చిత్తూరు జిల్లాలో ఉవ్వెత్తున సాగినంతకాలం సీపీఐకి ఇక్కడ పనిలేనట్లే.