ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్: ప్రొద్దుటూరు పట్టణంలో క్రికెట్‌బుకీలు రెచ్చిపోతున్నారు. ఆడిందే ఆట(క్రికెట్) గా..పాడిందే పాట(పందెం)గా చెలరేగుతున్నారు. ఇంతకముందు క్రికెట్ మ్యాచ్ ప్రారంభం అయ్యిందంటే చాలు ప్రధాన బుకీలు రెండు మూడు రోజులు ముందే హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు లాంటి ప్రాంతాలకు తరలి వెళ్లేవారు. అక్కడ బెట్టింగ్ నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకునేవారు.
స్థానికంగా వారి అనుయాయులు, సబ్‌బుకీలు, కొరియర్ బాయ్‌లు బెట్టింగ్ డబ్బు సమకూర్చి పంపిస్తుంటారు. ఇదీ నిన్న మొన్నటి వరకు జరిగే తంతు. కానీ ఇటీవల ప్రొద్దుటూరు బుకీలు స్టైల్ మార్చారు. బుకీలు స్థానికంగానే లక్షల్లో బెట్టింగ్ నిర్వహిస్తూ రెచ్చిపోతున్నారు. ఇక్కడే ఉంటూ ప్రధాన బుకీలందరూ తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.
బుకీలను పోలీసులు గాలికి వదిలేశారా.. రెండు మూడు నెలల నుంచి ఎన్నికల విధుల్లో మునిగి ఉన్న పోలీసులు ఇతర వ్యవహారాలైపై దృష్టి పెట్టడం లేదు. ఏప్రిల్ నెల నుంచి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఎన్నికల విధుల్లో నుంచి బయట పడిన పోలీసులు క్రికెట్ బెట్టింగ్‌నూ పూర్తిగా విస్మరించారు. గతంలో అయితే క్రికెట్ మ్యాచ్‌లు జరిగేటప్పుడు ప్రత్యేకంగా దాడులు నిర్వహించేవారు. ప్రస్తుతం పోలీసులు పట్టించుకోక పోవడంతో ప్రధాన బుకీలందరూ పట్టణంలోనే ఉంటూ స్వేచ్ఛగా క్రికెట్ పందేలు కాస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లు సందర్భంగా ప్రతి రోజూ ఒక్క ప్రొద్దుటూరులోనే రూ.80 లక్షల నుంచి రూ.కోటి దాకా బెట్టింగ్ జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. పట్టణంలోని వైఎంఆర్ కాలనీ, జిన్నారోడ్డు, మెయిన్‌బజార్, గాంధీరోడ్డు, మోడంపల్లి తదితర ప్రాంతాలలో పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుతున్నట్లు తెలుస్తోంది.
ఎస్పీ ఆదేశాలు హుళుక్కేనా.. ఎస్పీ అశోక్‌కుమార్ మొదటిసారిగా ప్రొద్దుటూరుకు వచ్చినప్పుడు బెట్టింగ్ నిర్మూలనకు గట్టి చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసు అధికారులకు సూచించారు. మ్యాచ్‌లు జరిగే సమయాల్లో బుకీలందరినీ ఆయా పోలీస్టేషన్‌లలో హాజరయ్యేలా చూడాలన్నారు. ఇటీవల ఎస్‌కేవీ ఫంక్షన్ హాల్‌లో జరిగిన పోలీసు గెట్ టు గెదర్ కార్యక్రమానికి వచ్చినప్పుడు కూడా ఎస్పీ దీన్ని కచ్చితంగా పాటిస్తే కొంత ఫలితం ఉంటుందని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రారంభంలో మాత్రం రెండు మూడు మ్యాచ్‌లకు బుకీలను స్టేషన్‌లకు పిలిపించారు. పట్టణంలో వందల సంఖ్యలో బుకీలు ఉండగా 10-15 మందిని మాత్రమే బుకీలను స్టేషన్‌లకు పిలిపించారు. తర్వాత వారిని గాలికి వదిలేశారు. దీంతో బుకీలు దర్జాగా బెట్టింగ్ కార్యకలాపాలకు పా ల్పడుతున్నారు. ఆదివారం నాడు పంజాబ్, కలకత్తా టీంల మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుండటంతో బుకీలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రధాన బుకీల ఇళ్లల్లోనే బెట్టింగ్ నిర్వహణ జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆదివారం నాడు ప్రొద్దుటూరులోనే రూ.2 కోట్లకు పైగా బెట్టింగ్ జరుగవచ్చని బుకీలు అంచనా వేస్తున్నారు.
ఆడిందే ఆట.. పాడిందే పందెం
Published Sun, Jun 1 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 8:08 AM
Advertisement