
పంట బీమా.. దక్కని ధీమా
పంట బీమా చెల్లింపు గడువు దగ్గర పడుతోంది. బ్యాంకర్ల నుంచి పంట రుణాలు ఇంకా మంజూరు కాలేదు.
పంట రుణాల లక్ష్యం నెరవేరేనా?
రెన్యువల్ చేస్తేనే మళ్లీ అప్పు
రైతులపై రుణమాఫీ ప్రభావం
ఈ నెల 30తో ముగియనున్న ప్రీమియం గడువు
పంట బీమా చెల్లింపు గడువు దగ్గర పడుతోంది. బ్యాంకర్ల నుంచి పంట రుణాలు ఇంకా మంజూరు కాలేదు. రుణాల కోసం వెళ్లిన అన్నదాతలను రెన్యువల్ చేయించుకోవాలని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. రెన్యువల్ చేస్తున్నవారికి కొత్త రుణాలు మంజూరు చేసినట్లు నమోదు చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ రుణ లక్ష్యంలో సగం కూడా పూర్తికాలేదు. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ ఏడాది బీమా ధీమా దక్కదని ఆందోళన చెందుతున్నారు.
మచిలీపట్నం : ప్రభుత్వ సాచివేత ధోరణి రైతుల పాలిట శాపంగా మారింది. సకాలంలో పంట రుణాలు అందక అన్నదాతలు సతమతమవుతున్నారు. ఒకటి, రెండు రోజులుగా వాతావరణం అనుకూలించటంతో వ్యవసాయ పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. అయితే పంట రుణాలు సకాలంలో అందకపోవటంతో రైతులు వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రూ.2,396 కోట్లను పంట రుణాలుగా అందజేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటివరకు రూ.1,260 కోట్లు మాత్రమే అందజేసినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో నాలుగు లక్షల మంది రైతులు ఉండగా 1.78 లక్షల మందికి వీటిని అందజేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ నెల 30 నాటికి పంట బీమా ప్రీమియం చెల్లించేందుకు తుది గడువుగా ఉంది. పూర్తిస్థాయిలో రుణాలు అందకపోవటంతో రైతులు పంట బీమా ప్రీమియం చెల్లించలేని పరిస్థితి నెలకొంది.
మాఫీ మాయ.. అప్పుల్లో అన్నదాత
టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత జిల్లాలో 7.03 లక్షల మంది రైతులు రూ.9,137 కోట్ల పంట రుణాలు తీసుకున్నారని గుర్తించారు. వీటన్నింటినీ రుణమాఫీ కింద రద్దు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అనంతరం వివిధ కారణాలు చూపి రుణాలు రద్దు చేయకుండా నిలిపివేశారు. ప్రభుత్వం ప్రకటించిన మొదటి విడత రుణమాఫీ జాబితాలో 2 లక్షల 84 వేల మంది రైతులకు రూ.997 కోట్లు మాఫీ జరిగినట్లు చూపారు. అందులోనూ రూ.326 కోట్లు విడుదల చేశారు. రెండో విడత జాబితాలో లక్షా 40 వేల మంది రైతులకు రూ.440 కోట్లు రుణమాఫీ జరిగినట్లు చూపారు. అందులో రూ.188 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ఒకటి, రెండు జాబితాల్లో రుణమాఫీ జరగని రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించగా 70 వేలకు పైగా వచ్చాయి. ఈ నెలాఖరు నాటికి మూడో విడత రుణమాఫీ జాబితాను ప్రకటిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తొలుత రుణాలు మొత్తం మాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఆ తర్వాత రూ.50 వేల లోపు ఉన్న రుణాలే పూర్తిగా మాఫీ చేస్తామని పేర్కొంది. ఆచరణలో అనేకమంది రైతులకు అదీ అమలు కాలేదు. రూ.50 వేల కన్నా పైబడి రుణం ఉంటే మొదటి విడతగా 20 శాతం రైతు ఖాతాలో జమ చేసి మిగిలిన బకాయిని రానున్న నాలుగు సంవత్సరాల్లో మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రక్రియ వలన రైతులకు ఒనగూరే ప్రయోజనం లేకపోగా వడ్డీ రూపంలో అదనపు భారం పడుతోంది.
కాగితాల పైనే రెన్యువల్
టీడీపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని నమ్మి రుణాలు సకాలంలో చెల్లించని రైతులంతా ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. బ్యాంకుల వద్దకు పంట రుణం కోసం వెళితే పాత బకాయి చెల్లిస్తే.. వెంటనే రుణం మంజూరు చేస్తామని బ్యాంకు అధికారులు ఖరాకండీగా చెబుతున్నారు. రుణం చెల్లించకున్నా రెన్యువల్ చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు. రెన్యువల్ చేయించాలంటే 10-1 అడంగల్ కాపీ, శిస్తు రసీదు కావాలని కోరుతున్నారు. రైతు తాను తీసుకున్న రుణం చెల్లించకపోవటంతో రెన్యువల్ చేసినట్లు చూపి ఈ ఏడాది కొత్తగా రుణం ఇచ్చినట్లు కాగితాలపై రాస్తున్నారు. అంతే తప్ప రైతులకు ఒక్క రూపాయి నగదు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. అధికారులు అందజేసినట్లు చెబుతున్న రూ.1,260 కోట్ల రుణాల్లో 90 శాతం ఈ తరహావేనని రైతులు అంటున్నారు. ఉదాహరణకు చిన్నాపురం కేడీసీసీ బ్యాంకు పరిధిలో ఐదు పీఏసీఎస్‌లు ఉన్నాయి. ఈ సంఘాల్లో పంట రుణాల కింద రూ.11 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. గురువారం ఈ బ్రాంచిని సందర్శించిన ఓ ఉన్నతాధికారి ఈ రూ.11 కోట్లలో రూ.10 కోట్లను రెన్యువల్ చేసి రైతులకు పంట రుణాలు ఇచ్చినట్లుగా చూపాలని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. పీఏసీఎస్‌లతో పాటు వాణిజ్య బ్యాంకుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని రైతులు అంటున్నారు. పంట రుణాల మంజూరులో జాప్యం జరిగితే ఈ ఏడాది చాలా మంది రైతులు పంట బీమా ప్రీమియం చెల్లించే అవకాశాన్ని కోల్పోతారని, ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని పంట బీమా ప్రీమియం చెల్లింపు గడువును పెంచాలని రైతులు కోరుతున్నారు.