కేజీ బేసిన్‌లో అడుగంటిన క్రూడాయిల్‌ | Crude oil in the KG Basin was Reduced | Sakshi
Sakshi News home page

కేజీ బేసిన్‌లో అడుగంటిన క్రూడాయిల్‌

Published Mon, Feb 24 2020 4:00 AM | Last Updated on Mon, Feb 24 2020 4:00 AM

Crude oil in the KG Basin was Reduced - Sakshi

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: కృష్ణా గోదావరి(కేజీ) బేసిన్‌లో గత మూడేళ్లుగా ముడిచమురు(క్రూడాయిల్‌) నిల్వలు పడిపోతుండడంతో ఓఎన్జీసీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. క్రూడాయిల్‌ నిల్వల తగ్గుదలతో ఈ బేసిన్‌లో ఓఎన్జీసీ సగటున రోజుకు రూ.కోటి వరకూ ఆదాయం కోల్పోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇంతవరకూ కేజీ బేసిన్‌లో సుమారు 500 బావుల్ని గుర్తించగా.. కేవలం 112 బావుల్లో మాత్రమే ఉత్పత్తి కొనసాగుతోంది. వాటిలో అధికశాతం సహజ వాయువు ఉత్పత్తి చేస్తుండగా.. ఉన్న కొద్దిపాటి బావుల్లో చమురు ఉత్పత్తి మందగించింది. ఈ పరిస్థితుల్లో మరింత లోతుకు బావులు తవ్వాలని ఓఎన్జీసీ యోచిస్తున్నా.. ఖర్చు నాలుగు రెట్లకు పైగా అవుతుందనే అంచనాలతో వెనుకడుగు వేస్తోంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పతనమవడంతో.. అంత ఖర్చుచేయడం గిట్టుబాటవుతుందా? అన్న ఆలోచనలోనూ ఉంది. 

ఒకప్పుడు రికార్డు స్థాయిలో ఉత్పత్తి
రాష్ట్రంలోని ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల వరకూ విస్తరించిన కేజీ బేసిన్‌.. ముంబై హై తర్వాత ఓఎన్జీసీకి తలమానికంగా నిలిచింది. దీని పరిధి సుమారు 50 వేల చదరపు కిలోమీటర్లు విస్తరించింది. ఈ ప్రాంతంలో నాలుగు దశాబ్దాలుగా ఓఎన్జీసీ చమురు, సహజవాయువును వెలికితీస్తోంది. కేజీ బేసిన్‌లో కోనసీమలోనే చమురు బావులు ఎక్కువగా ఉన్నాయి. గత ఐదేళ్లుగా సాగిస్తున్న అన్వేషణలో భాగంగా కృష్ణా జిల్లా నాగాయలంక, బంటుమిల్లి, మల్లేశ్వరం తదితర ప్రాంతాలలో ఓఎన్జీసీ చమురు నిల్వల్ని కనుగొంది. దీంతో కొత్త ఆశలు చిగురించాయి. అయితే కోనసీమ స్థాయిలో అక్కడ చమురు ఉత్పత్తి లేకపోవడంతో డీలాపడింది. 

కొన్నేళ్ల క్రితం వరకూ కేజీ బేసిన్‌లో క్రూడాయిల్‌ ఉత్పత్తి రికార్డు స్థాయిలో జరిగేది. ఆ సంస్థ మొత్తం ఉత్పత్తిలో ఈ బేసిన్‌ వాటా 15 శాతంగా ండేది. అయితే 2017 నుంచి 50 శాతం మేర క్రూడాయిల్‌ ఉత్పత్తి పడిపోయింది. ఈ లెక్కన ఓఎన్జీసీ కొన్నాళ్లుగా సుమారు రూ.1080 కోట్ల వరకూ ఆదాయాన్ని కోల్పోయిందని ప్రాథమిక అంచనా. 

4 వేల మీటర్ల దిగువకు డ్రిల్లింగ్‌ చేస్తేనే..
కేజీ బేసిన్‌లో ప్రస్తుతం భూ ఉపరితలం నుంచి 3000 మీటర్ల లోతున మాత్రమే ఓఎన్జీసీ చమురు అన్వేషణ, ఉత్పత్తి సాగిస్తోంది. ఆ ప్రాంతంలో 2000 పీఎస్‌ఐ(పౌండ్‌ పర్‌ స్క్వేర్‌ ఇంచ్‌)ఒత్తిడి, 80 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని ఓఎన్జీసీ  సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఈ బావుల ద్వారా సముద్రంలో 4000 మీటర్ల దిగువన డ్రిల్లింగ్‌ నిర్వహించి చమురు అన్వేషణ, ఉత్పత్తికి ఓఎన్జీసీ తటపటాయిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అంతలోతుకు వెళ్తేగానీ కొత్త చమురు నిల్వలు కనుగొనలేని పరిస్థితి. 4000 నుంచి 4200 మీటర్ల లోతున డ్రిల్లింగ్‌ చేయాలంటే అక్కడ భూమి పొరల్లో 5 వేల పీఎఫ్‌ఐ(పౌండ్‌ పర్‌ స్క్వేర్‌ ఇంచ్‌)ఒత్తిడి, 200 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చాలా ఖరీదుతో కూడుకున్నది. ఒక్కో బావిలో ప్రస్తుతం జరుగుతున్న డ్రిల్లింగ్‌కు రూ.కోటి నుంచి రూ.1.20 కోట్లు ఖర్చవుతుందని అంచనా. మరింత లోతుకు వెళ్లి డ్రిల్లింగ్‌ చేయాలంటే ఒక్కో బావికి సుమారు రూ.5 కోట్ల నుంచి 5.50 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని ఓఎన్జీసీ అంచనా వేస్తోంది. 

ఎక్కువ శాతం బావుల్లో సహజవాయువు ఉత్పత్తే..
తాటిపాక జీజీఎస్‌(గ్రూప్‌ గేదరింగ్‌ స్టేషన్‌) బావుల్లో క్రూడ్‌ ఉత్పత్తి తగ్గిపోయింది. ఒక్క కేశనపల్లిలో మాత్రమే కొంత ఆశావహ పరిస్థితి ఉంది. మోరి జీజీఎస్‌లో 58 బావులుంటే 40 బావుల్లో ఎక్కువ శాతం సహజవాయువు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. అడవిపాలెంలోను దాదాపు ఇదే పరిస్థితి. దీంతో కోనసీమ ప్రాంతంలో క్రూడ్‌ ఉత్పత్తి దాదాపు పడిపోయిందని చెబుతున్నారు. పొన్నమండ, మండపేట, నర్సాపురం జీజీఎస్‌లో కూడా క్రూడ్‌ ఉత్పత్తి పడిపోయింది. ఈ పరిస్థితుల్లో విదేశీ చమురు అన్వేషణ సంస్థల సాయం తీసుకునే యోచనలో ఓఎన్జీసీ ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement