సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని 13 జిల్లాల ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ,సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సీఎస్ ఈ సందర్భంగా మే 23న జరిగే కౌంటింగ్ ఏర్పాట్లుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి తగినంత శిక్షణ లేకపోవడం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లతో సరిపుచ్చడంతో పోలింగ్ సందర్భంగా గందరగోళ పరిస్థితులు తలెత్తాయని, కౌంటింగ్ సమయంలో అవి పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం... జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
ఓట్ల లెక్కింపుకు నెల రోజులు సమయం ఉందని కౌంటింగ్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్లు స్వయంగా పరిశీలించి అవపసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేయాల్సిన టేబుల్స్, సీటింగ్ వంటివి సక్రమంగా ఉండేలా చూడాలని చెప్పారు. కౌంటింగ్ సిబ్బందికి పూర్తిస్థాయిలో మెరుగైన శిక్షణ ఇవ్వాలని ఈ విషయంలో ఏమాత్రం రాజీపడవద్దని సీఎస్ స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే రహదారులపై ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, కౌంటింగ్ రోజున లేదా కౌంటింగ్ అనంతరం అల్లర్లు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీలకు సీఎస్ ఆదేశాలు ఇచ్చారు.
పోలింగ్ నిర్వహణకు అవసరమైన బలగాలు..
ఈ సమావేశంలో పాల్గొన్న డీజీపీ ఆర్పీ ఠాకూర్ మాట్లాడుతూ... 2014తో పోలిస్తే తక్కువగా పోలీస్ ఫోర్సు ఉన్నా కలెక్టర్లు,ఎస్పీలు టీం వర్క్‌తో చిన్నపాటి సంఘటనలు మినహా ఎన్నికలను సజావుగా నిర్వహించారని వివరించారు. పోలింగ్ అనంతరం జరిగిన సంఘటనలపై వాటికి బాధ్యులైన వారిని చాలా వరకూ అరెస్టు చేశామన్నారు. కౌంటింగ్ తర్వాత కూడా హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పీలను ఆదేశించారు. రీపోలింగ్ జరగనున్న పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహణకు అవసరమైన పోలీస్ బలగాలను తరలిస్తామన్నారు. స్ట్రాంగ్ రూముల వద్ద మూడు అంచెల భద్రతా ఏర్పాట్లుతో నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోందని వివరించారు.
కలెక్టర్లు, ఎస్పీల పర్యవేక్షణలో సీసీ టీవీలతో నిఘా
సార్వత్రిక ఎన్నికల్లో 65శాతం పైగా దివ్యాంగులు ఓటు హక్కును వినియోగించుకోవడం, మారుమూల గిరిజన ప్రాంతాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సైతం పోలింగ్ శాతం పెరగడం సిబ్బంది కృషికి నిదర్శనమని సీఈఓ ద్వివేది అన్నారు. రాష్ట్రంలో స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడు అంచెల పటిష్టమైన బందోబస్తు ఉందని, సీసీ టీవీల నిఘాతో కలెక్టర్లు, ఎస్పీల పర్యవేక్షణలో నిరంతరం కొనసాగుతోందని, స్ట్రాంగ్ రూమ్ భద్రతపై ఆర్వోలు రోజూ తనిఖీ చేసి నివేదికలు సమర్పిస్తున్నారని చెప్పారు. స్ట్రాంగ్ రూముల భద్రతపై ఎవరికి అనుమానాలు అవసరం లేదని, ఎవరెవరు సందర్శిస్తున్నారనేది రికార్డ్ చేస్తున్నట్లు చెప్పారు. కౌంటింగ్ నిర్వహణకు సంబంధించిన సిబ్బందికి మూడు దశల శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం పరిధిలో మీడియా కేంద్రం ఉండేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాలల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతి లేనందున వాటిని తీసుకుని భద్రపర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment