
నగరానికి చెందిన ఓ నేవల్ అధికారి ఓఎల్‌ఎక్స్ యాప్‌లో ఖరీదైన కారు తక్కువ ధరకే వస్తుందని కొనుగోలుకు సిద్ధపడ్డాడు. అమ్మకందారుతో చాటింగ్‌లో ధర నిర్ణయించుకుని లక్ష రూపాయలు డిపాజిట్ చేశాడు. అంతే అమ్మకందారుడు చాటింగ్ నుంచి పరార్. దీంతో లబోదిబోమంటూ ఆ అధికారి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. ఆన్‌లైన్‌లో అమ్మకందారుడు చూపించిన డిఫెన్స్ ఐడీ కార్డు, ఆధార్ కార్డును పరిశీలిస్తే అవి నకిలీవని తేలింది. దీంతో ఏం చేయాలో పాలపోని పరిస్థితిలో పడిపోయాడు.
ద్వారకానగర్‌కు చెందిన ఓ రైల్వే ఉద్యోగికి సైబర్ నేరగాడు ఫోన్ చేసి తాను రైల్వే, డీఆర్‌ఎం కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నాను, మీ శాలరీ అకౌంట్ అప్‌డేట్ చేయాలి.. అకౌంట్ నంబరు ఇవ్వాలని కోరాడు. లేక పోతే వచ్చేనెల జీతం రాదని చెప్పడంతో అకౌంట్ వివరాలు చెప్పాడు. దీంతో అతని అకౌంట్‌లో డబ్బు విత్‌డ్రా చేసేశాడు. దీంతో బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. ఈ విధంగా నగరంలో ఇద్దరు ఉద్యోగులు మోసపోయారు.
లండన్‌లో వరల్డ్ లాటరీ ఆర్గనైజేషన్ నిర్వహించిన లక్కీడ్రాలో రూ.2,500 కోట్లు గెలుచుకున్నారంటూ విశాఖపట్నంలో ఉండే రిఫైనరీ సంస్థ విశ్రాంత ఉద్యోగికి సైబర్ నేరస్తులు మెయిల్ చేశారు. అది నిజమేనని నమ్మించేందుకు నేరగాళ్లు బాధితుడితో మాట్లాడి లాటరీ సొమ్ము కావాలంటే ముందుగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో అకౌంట్ తెరవాలని సూచించి రూ.3,45,500 అందులో వేయించారు. తరువాత డెబిట్ కార్డు పంపించి రోజుకు రూ.5వేలు డ్రా చేసుకోవచ్చని నమ్మించారు. మొదటి రోజు వెయ్యి రూపాయలు మాత్రమే డ్రా కావడంతో బాధితుడు అదే విషయాన్ని వారికి చెప్పాడు. కస్టమ్స్ సుంకం, అంతర్జాతీయ ద్రవ్యనిధి పన్ను, ఆర్బీఐ పన్ను కట్టాలంటూ చివరకు విడతల వారిగా రూ.70లక్షలు బాధితుడి నుంచి రాబట్టారు. ఆన్‌లైన్ పలు ఖాతాలకు వాటిని బదిలీ చేయించుకుని ఆ మొత్తాన్ని దోచుకున్నారు.
సాక్షి, అల్లిపురం/విశాఖ దక్షిణం: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగం పెరిగింది. ఆన్‌లైన్, ఈజీ మనీ ట్రాన్జక్షన్స్ పెరిగాయి. ఏ ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా సైబర్ నేరగాళ్లు లక్షల్లో కొల్లగొడుతున్నారు. నగరంలో ఇటీవల సైబర్ నేరాలు గణనీయంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ లావాదేవీలు, ఓఎల్‌ఎక్స్, ఫ్లిప్‌కార్టు, అమెజాన్ లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్త వహిస్తే మంచిదని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.
లాటరీ వల..
మనలో ప్రతి ఒక్కరికీ ఇది ఎప్పుడో ఒకప్పుడు అనుభవమే. లాటరీ గెలిచారంటూ సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు వచ్చి పలకరిస్తుంటాయి. కొందరు ఇది ఒక మోసమని గ్రహించి పట్టించుకోకుండా ఉంటారు. మరికొందరు అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల వలలో పడతారు. చేతులారా వారికి డబ్బులు ఆన్‌లైన్‌లో అప్పగిస్తారు. తరువాత లబోదిబోమంటారు. భారీ మొత్తంలో ప్రఖ్యాత కంపెనీల పేరిట మీ సెల్‌ఫోన్ నంబరుకు లాటరీ పలికిందని, అది విదేశీ కరెన్సీ కావడంతో ఆర్‌బీఐకు కొంత మొత్తం పన్నుల రూపంలో చెల్లించాల్సి ఉందని నమ్మబలికి దఫదఫాలుగా సొమ్మును లాక్కుంటారు. అలా కూడగట్టిన డబ్బును నేరగాళ్లు దేశం దాటిస్తారు. అలా దేశం దాటిన డబ్బును తిరిగి వెనక్కు తీసుకురావాలంటే ఇంటర్‌పోల్ సహాయం తీసుకోవాలి. వ్యక్తిగత మోసాలకు ఇంటర్‌పోల్ స్పందించదు. అలా స్పందించాలంటే దేశాన్ని కుదిపేసే పెద్ద ఆర్థిక నేరం జరిగితే తప్ప ఇంటర్‌పోల్ స్పందించదనే విషయాన్ని గుర్తించుకోవాలి.
సామాజిక మాధ్యమాలనూ వదలడం లేదు..
సామాజిక మాధ్యమాలు అయిన ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్, స్నాప్‌చాట్ వంటి సామాజిక మాధ్యమాలను కూడా సైబర్ నేరగాళ్లు వదలడం లేదు. మన పేరుతో నకిలీ సామాజిక మాధ్యమ అకౌంట్లు తెరిచి అసభ్యకర మెసేజ్‌లు ఇతరులకు పంపిస్తుంటారు. ఈ అవకాశాన్ని బాధితులే కల్పిస్తున్నారు. అది ఎలాగంటే అకౌంట్ తెరిచే సమయంలో మెయిల్ ఐడీ, వ్యక్తి ఫొటో, జన్మదిన తేదీలు తదితర వివరాలు నమోదు చేయడం ద్వారా... వాటిని నేరస్తులు హ్యాకింగ్ ద్వారా సంపాదించి నకిలీ అకౌంట్లు సృష్టిస్తుంటారు.
తక్కువ ధరకే బండి కావాలా..
ఈ తరహా నేరాలు ఎక్కువుగా రాజస్థాన్‌లో నేరస్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా పాత వస్తువుల అమ్మకాలు, కొనుగోళ్లకు ఓఎల్‌ఎక్స్ యాప్‌ను ఎక్కువుగా వినియోగిస్తుంటారు. వీటిని సైబర్ నేరస్తులు వినియోగిస్తున్నారు. ఖరీదైన కార్లు, మోటారు సైకిళ్లు అమ్మకానికి పెడుతుంటారు. వాటిని కావాలని కోరితే తాను ఎయిర్‌ఫోర్సులో ఉద్యోగం చేస్తున్నానని, ఎన్‌సీసీ అని, రక్షణరంగంలో ఉద్యోగం చేస్తున్నానని వాహనం రక్షణరంగ వ్యవస్థలో సురక్షితంగా ఉందని, వాహనం చూడాలన్నా అందుకు ముందుగా కొంత సొమ్ము కట్టాలని, పన్నులు కట్టాలని చెప్పి ఔత్సాహికుడైన కొనుగోలుదారుని నుంచి దఫదఫాలుగా డబ్బులు ఆన్‌లైన్‌లో లాగేస్తుంటారు.
ఎంతకీ వాహనం చూపించరు. మన బలహీనతను వారు డబ్బుగా మార్చుకుంటారు. ఇలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. వెబ్‌సైట్లో జరిపే లావాదేవాల క్రమంలో వాహనాన్ని ప్రత్యక్షంగా చూసిన తరువాత మాత్రమే ధర మాట్లాడుకోవాలి. ఆర్టీఏ కార్యాలయంలో సంబంధిత వాహనం రిజిస్ట్రేషన్ వివరాలను సరిచూసుకొన్న తరువాత మాత్రమే కొనుగోలు చేయాలని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు.
బ్యాంకు అకౌంట్లు హ్యాక్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- అకౌంట్ తెరిచేముందు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ విధానాన్ని అవలంభించాలి. దీని వలన పాస్‌వర్డ్‌తో ఖాతా తెరుచుకోకుండా సెల్‌ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేసుకోవాలి.
- పాస్‌వర్డు ఇంగ్లీష్ అక్షరాలు, అంకెలు మిళితమై ఉండాలి. పాస్‌వర్డును తరచూ మారుస్తుండాలి. ఇతరులతో పంచుకోకూడదు.
- అకౌంట్‌లో మీరు పంపించే పోస్టులు సన్నిహితులకు మాత్రమే కనిపించేలా ప్రైవసీ సెట్టింగ్‌లను మార్చుకోవాలి.
- గుర్తుతెలియని వ్యక్తులు పంపించే రిక్వెస్ట్‌లను గుడ్డిగా అనుమతించవద్దు. వారి అకౌంట్‌ను ఎవరు ఫాలో అవుతున్నారో గమనించాలి. వారికి ఫోన్ చేసి అతని గురించి తెలుసుకోవాలి. గుర్తు తెలియని వ్యక్తులు పంపే పోస్టింగులకు స్పందించకపోవడమే మంచిది.
- సైబర్ కేఫ్‌లలో సామాజిక మాధ్యమ ఖాతాలను తెరవాల్సి వస్తే జాగ్రత్తలు అవసరం. కీ మెంబర్ పాస్‌వర్డు పాప్ అప్ లింకును తెరవద్దు.
బ్యాంకు అధికారులమంటూ..
మీ పొదుపు ఖాతావున్న బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని, ఆర్‌బీఐ నుంచి మాట్లాడుతున్నామని, మీరు కట్టిన పన్నులను తిరిగి మీ అకౌంట్‌లో బదిలీ చేస్తున్నామని, మీ డెబిట్ కార్డు గడువు ముగిసిందని, కార్డు రెన్యువల్ చేయాల్సి వుందని చెప్పి డెబిట్ కార్డు నంబరు, సీవీవీ నెంబర్లు, కార్డు వ్యాలిడిటీ తేదీ తెలుసుకుని మీ సెల్ నంబరుకు వచ్చిన ఓటీపీ నంబరును చెప్పమని ఖాతాలోవున్న డబ్బును విత్‌డ్రా చేయడం, ఆన్‌లైన్ షాపింగ్ చేయడం ద్వారా ఖాతా నుంచి సొమ్ము ఖాళీ చేసేస్తారు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులో వాటి గడువుతేదీ, పిన్, సీవీవీ అంకెలే కీలకమైనవి. ఎట్టి పరిస్థితుల్లోను తెలియని వాళ్లకు ఇవ్వవద్దు. అలా ఏ బ్యాంకు అధికారి, ఇతర సంస్థల ప్రతినిధులు నేరుగా వినియోగదారునికి ఫోన్ చేసి కార్డు వివరాలు అడగరని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి.
పెళ్లి చేసుకుంటామని...
సైబర్ నేరస్తులు తమ పేర్లను మ్యాట్రీమోనీ వెబ్‌సైట్లలో వధువు కావాలని, వరుడు కావాలని పేర్లు నమోదు చేసుకుంటున్నారు. ముఖ్యంగా విడాకులు తీసుకుని, రెండోపెళ్లి కోసం ఎదురు చూస్తున్నవారిని, ఆలస్యంగా వివాహం చేసుకుంటున్న మహిళలను గుర్తించి, మ్యాట్రిమోనీ సంస్థల నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు. వాట్సప్‌లో వారితో చాటింగ్‌లు చేస్తూ, వారికి నమ్మకం కలిగిస్తారు. విదేశాల్లో ఉన్నామని, మీకు బహుమతి పంపిస్తున్నామని, బహుమతి తీసుకువస్తున్న వ్యక్తి ఎయిర్‌పోర్టులో చిక్కుకున్నాడని, కస్టమ్స్ అధికారులు అడ్డగించారని ఖరీదైన బహుమతి కావడంతో కొంత సొమ్ము కట్టాల్సి వచ్చిందని, ఆ డబ్బును తాము సూచించిన అకౌంట్‌కు ఆన్‌లైన్‌లో బదిలీ చేయాలని కొంత, ఆర్‌బీఐ క్లియరెన్స్, పన్నుల పేరిట కొంత డబ్బు వసూలు చేసి ఫోన్ స్విచ్‌ఆప్ చేసేస్తారు. –విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకుంటే పన్ను కట్టాలని ఫోన్ చేయరు. వ్యక్తిగత ఖాతాలో డబ్బులు కట్టాలని సూచించరు. ఒక వేళ అలా సూచించారంటే అది కచ్చితంగా సైబర్ నేరస్తుల పనే అని గమనించాలి.
కార్డు మీ దగ్గర..డబ్బులు నేరగాళ్ల దగ్గర..
మీరు మీకార్డు ఎక్కడో స్వైప్ చేస్తారు..షాపింగ్ ముగించుకుని వెళ్లిపోతారు. ఆ తరువాత సైబర్ నేరగాళ్లు మీ డేటాను క్లోన్ చేసి మరో కార్డు తయారు చేస్తారు. మీరు మీ క్రైడిట్ లేదా డెబిట్ కార్డు స్వైప్ చేసినపుడు అక్కడ అంతకుముందే ఏర్పాటు చేసిన స్కిమ్మర్‌లోకి మీ డేటా వెళ్తుంది. కార్డు మోస్తారు ఖాతాదారులకు మాత్రమే కాదు..బ్యాంకులకూ పెద్ద తలనొప్పిగా మారాయి. క్షణాల్లో ఖాతాదారులు వేలాది రూపాయలు నష్టపోతుంటే ఆ ఫిర్యాదులను పరిష్కరించలేక బ్యాంకులు ముప్పుతిప్పలు పడుతున్నాయి. అయితే అప్రమత్తంగా ఉంటే ఇలాంటి మోసాలను అరికట్టవచ్చు. అందుకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారును అప్రమత్తం చేస్తోంది. మోసపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో క్రెడిట్, డెబిట్ కార్డుదారులకు కొన్ని సూచనలు చేసింది. ఎక్కువుగా జరిగే స్కిమ్మింగ్ మోసాల నుంచి ఎలా తప్పించుకోవాలో వివరిస్తూ ఈమెయిల్స్ పంపింది.
కస్టమర్లకు ఎస్‌బీఐ జాగ్రత్తలు..
- క్రెడిట్, డెబిట్ కార్డు స్కిమ్మింగ్ మోసాలు ఎక్కువుగా ఏటీఎంలు, హోటళ్లు, రెస్టారెంట్లు, పెట్రోలు బంక్‌లు, మెడికల్ షాపులు, షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లలో జరుగుతాయి.
- ఎక్కడైనా మీరు కార్డుతో షాపింగ్ చేసేటప్పుడు మీరు మాత్రమే కార్డును స్వైప్ చేయాలి. కంపెనీ ప్రతినిధులకు ఇవ్వొద్దు. మీ పిన్ చెప్పకూడదు.
- మీరు పిన్ ఎంటర్ చేసేప్పుడు ఎవరికీ కనిపించకుండా చేతిని అడ్డంగా పెట్టుకోవాలి.
- లావాదేవీ పూర్తయిన తరువాత కార్డు తీసుకోవడం మరిచిపోకూడదు. మీ పిన్ ఎవరికీ చెప్పకూడదు.
- ఇప్పుడు అందరి దగ్గర చిప్ కార్డులు ఉన్నాయి కాబట్టి..ఇక స్వైప్ చేయాల్సిన అవసరం ఉండదు. కార్డును పీఓఎస్ మెసీన్‌లో ఇన్సర్ట్ చేస్తే చాలు.
- ఏటీఎంలో డబ్బులు డ్రా చేసే ముందు స్కిమ్మర్ డివైజ్ ఉంచారేమో ఒకసారి పరిశీలించండి.
- ఏటీఎం పిన్ ఎంటర్ చేసే కీ ప్యాడ్‌ను పరిశీలించాలి. అక్కడ మీ పిన్ తెలుసుకునేందుకు డూప్లికేట్ కీ ప్యాడ్ ఏర్పాటు చేస్తారు. నేరగాళ్లు ఎవరైనా బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని పిన్ అడిగితే నమ్మకూడదు.
- మీ కార్డు నంబరు, పిన్, సీవీవీ, యూజర్ ఐడీ, పాస్‌వర్డు ఎవరికీ చెప్పవద్దు.
అత్యాశకు పోవద్దు
సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. లాటరీ గెలిచారని, వాహనాలు తక్కువకు విక్రయిస్తామని, బహుమతులు పంపిస్తామని ఫోన్ చేసి ఆశ పెట్టేవారిపట్ల అప్రమత్తంగా ఉండండి. అత్యాశకు పోతే మొదటికే మోసం జరిగే ప్రమాదం ఉంది. బ్యాంకు ప్రతినిధులు ఎవ్వరు కూడా ఖాతాదారులకు నేరుగా ఫోన్ చేయరు. ఎవరైనా ఫోన్ చేసి మీ అకౌంట్ వివరాలు, కార్డు వివరాలు అడిగితే అది మోసగాళ్ల పనేఅని గుర్తించండి. సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలను ఉంచవద్దు. అవి దుర్వినియోగం అయ్యే ప్రమాదముంది.
–డి.సూర్య శ్రావణకుమార్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, సీసీఎస్, సైబర్ క్రైం, విశాఖపట్నం.
తొందరపడి కొనుగోలు చేయవద్దు
ఆన్‌లైన్‌లో పెట్టే వస్తువులను చూసి కొనవద్దు. వాటిని తాకి కొనుగోలు చేయండి. ఆన్‌లైన్‌లో అమ్మకందారు పెట్టే ధ్రువపత్రాలను సరిపోల్చుకోండి. రిమోట్ ఏరియాల నుంచి వచ్చే యాడ్స్‌ను నమ్మవద్దు. సమీపంలో గల అడ్రస్సులు గుర్తించి, వస్తువులను కొనుగోలు చేస్తే మంచిది. తొందరపడి డబ్బులు డిపాజిట్ చేయకండి.
–వి.గోపినాథ్, సైబర్ క్రైం సీఐ