ద్వారకాతిరుమల న్యూస్‌లైన్ :
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విడుదల చేయాలని కోరుతూ పాలకొల్లు నుంచి ద్వారకాతిరుమల శ్రీవారి దర్శనానిక సైకిల్ యాత్ర చేశారు ఆయన అభిమానులు. పాలకొల్లు మండల సర్పంచ్‌ల చాంబర్ మాజీ అధ్యక్షుడు కైలా నరసింహరావు, రుద్రరాజు శ్రీనివాసరాజు, ఉత్తుల శ్రీనివాస్, మామిడిశెట్టి దుర్గారావు, ఉత్తుల శ్రీను తదితరులు పాలకొల్లులో శుక్రవారం ఉదయం సైకిళ్లపై యాత్రగా బయల్దేరి సాయంత్రానికి ద్వారకాతిరుమల క్షేత్రానికి చేరుకున్నారు. శ్రీవారిని, అమ్మవార్లను దర్శిం చుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ జగనన్నను నిర్బంధించి ఏడాది పూర్తయినా కేంద్రం ఆయనపై కక్షసాధింపు చర్యలను మాత్రం మానలేదని పేర్కొన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి విడుదలవ్వాలని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేలా చేయి స్వామీ అంటూ చినవెంకన్నను వేడుకున్నట్లు వారు తెలిపారు.
వైఎస్.రాజశేఖరరెడ్డి మరణం తరువాత రాష్ట్రం చిన్నాభిన్నమయిందన్నారు. వైఎస్ పాలన మళ్లీ అందించగలిగే సమర్థుడు జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే అని పేర్కొన్నారు. ఆయన బయటకు వచ్చిన రోజున ప్రతిపక్షాల్లో నాయకులనేవారు ఉండరని, ఒక్క జగన్ పార్టీయే మిగులుతుందన్నారు. అందుకే కాంగ్రెస్ పాలకులు భయపడి ఆయనను లోపలే ఉంచేందుకు పన్నాగాలు పన్నుతున్నారని పేర్కొన్నారు. వీరికి పార్టీ మండల కన్వీనర్ బుసనబోయిన సత్యనారాయణ, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పోలిన నారాయణరావు, మానుకొండ సుబ్బారావు, మిడతా రాధాకృష్ణ, లక్కాబత్తుల సిద్ధిరాజు, ఇమ్మానియేలు తదితరులు స్వాగతం పలికారు.
వైఎస్ జగన్ విడుదల కోరుతూ సైకిల్ యాత్ర
Published Sat, Sep 7 2013 12:51 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement