గొంతు కోసుకున్న డీఈడీ విద్యార్థి
క్షతగాత్రునిది కృష్ణా జిల్లా నందిగామ
బేస్తవారిపేట : స్థానిక గురుస్వామి డీఈడీ కళాశాలకు చెందిన విద్యార్థి గొంతు కోసుకుని సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కృష్ణా జిల్లా నందిగామకు చెందిన షేక్ గౌస్ మోహిద్దీన్ డీఈడీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. స్థానిక స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా సమీపంలో ముగ్గురు స్నేహితులతో కలిసి గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. కాలేజీలో నాలుగు రోజుల నుంచి పరీక్షలు జరుగుతున్నా వాటికి హాజరుకాకుండా ఒంటరిగా గదిలోనే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో కూరగాయలు కోసుకునే కత్తితో గొంతు, చేతి మణికట్టు వద్ద కోసుకున్నాడు. అనంతరం కళాశాల అధ్యాపకుడు రమేష్‌కు ఫోన్ చేసి సెల్ క్లాస్‌లోకి తీసుకెళ్లి లౌడ్ స్పీకర్ ఆన్ చేయాలని కోరాడు.
సదరు అధ్యాపకుడు ఎందుకని ప్రశ్నించిగా గౌస్ మోహిద్దీన్ సమాధానం చెప్పలేదు. తిరిగి అడగడంతో కత్తితో గొంతు కోసుకున్నానని చెప్పాడు. ఆయన కొందరు విద్యార్థులను గదికి పంపాడు. గౌస్ మోహిద్దీన్ గొంతు కోసుకున్నట్లు గుర్తించి.. అధ్యాపకులకు సమాచారం అందించడంతో వారు కూడా సంఘటన స్థలానికి చేరుకుని పట్టణంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గౌస్ మోహిద్దీన్‌ను ఒంగోలు తరలించారు. ఆత్మహత్యాయత్నానికి ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. అతడు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదని, ఎప్పుడూ ముభావంగా ఒంటరిగా ఉండేవాడని సహచర విద్యార్థులు తెలిపారు.