
బీజేపీలోకి దగ్గుబాటి దంపతులు!
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయలేమని
దిగ్విజయ్‌కు కేంద్ర మంత్రి పురందేశ్వరి లేఖ
విభజనపై తమ వాదనలను పట్టించుకోలేదంటూ విమర్శ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి పురందేశ్వరి దంపతులు కాంగ్రెస్‌ను వీడనున్నారా? బీజేపీలో చేరి వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారా? తాజా పరిణామాలు ఇదే విషయూన్ని స్పష్టం చేస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రాష్ట్ర విభజన విషయంలో తమ వాదనలను కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదంటూ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవ హారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు శనివారం లేఖ రాసినట్లు ప్రచారం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రకు అన్యాయం చేస్తున్నందున, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయబోమని ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో పురందేశ్వరి భర్త, ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ నిర్దేశించిన అభ్యర్థి కేవీపీ రామచంద్రరావుకు ఓటు వేయలేదు. ఇది జరిగిన మరునాడే దిగ్విజయ్‌కు పురందేశ్వరి లేఖ రాసినట్లు వార్తలొచ్చారుు. రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారిందని, అందువల్ల పార్టీ మారాలన్న అభిప్రాయంతో దగ్గుబాటి దంపతులు ఉన్నట్లు వారి సన్నిహితవర్గాలు తెలిపారుు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కడం కష్టమేనన్న అభిప్రాయంతో వారు రాష్ట్రానికి చెందిన బీజేపీ జాతీయ స్థాయి నేతతో సంప్రదింపులు జరిపి ఆ పార్టీలో చేరేందుకు రంగాన్ని సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.