చిన్నమ్మకు ఆ గౌరవం దక్కుతుందా?
దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటసార్వభౌమ ఎన్టీఆర్ కుమార్తెగా రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేసిన ఆయన కుమార్తె పురందేశ్వరి హస్తాన్ని వీడి కమలాన్ని అందుకోనున్నారు. సన్నిహితులు, నియోజకవర్గ ప్రజలు చిన్నమ్మ అని పిలుపించుకునే ఆమె ఈ విషయాన్ని సూత్రప్రాయంగా అంగీకరించారు. దగ్గుబాటి దంపతులు రేపో, మాపో బీజేపీ అగ్రనేతలను కలిసి కమల తీర్థం పుచ్చుకోనున్నారు.
రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటే డిపాజిట్ కూడా దక్కదనే భయమో... లేక దేశవ్యాప్తంగా కనిపిస్తున్న నరేంద్ర మోడీ హవానో... మొత్తానికి హస్తం నుంచి కమలం వైపు జంప్ కావాలని దగ్గుబాటి పురందేశ్వరీ నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో తమ మాట చెల్లుబాటు కాలేదని కొన్నాళ్లు పురందేశ్వరి కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. విభజన బిల్లు పాస్ కాగానే ఆమె తన మంత్రి పదవిని వదులుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో చెప్పాలని తన నియోజకవర్గం విశాఖలో కార్యకర్తల అభిప్రాయం కోరారు. అందరూ తనను కాంగ్రెస్‌ను విడిచి పెట్టాలని సూచించారని ఆమె చెప్పుకొచ్చారు.
రాష్ట్ర విభజన విషయంలో అధిష్ఠానం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని తనను మానసికంగా హింసించిందని చిన్నమ్మ గతంలో ఆవేదన వ్యక్తం చేశారు. 'నేను ఒక ఆడదాన్ని.. మౌనంగా అంతా భరించాను. అయినా సహనంతో ఉన్నాను. నన్ను నమ్ముకున్న క్యాడర్, నా మనుషుల ఏమైపోయినా ఫరవాలేదా? ఇంత జరుగుతున్నా ఎప్పుడూ ఎవ్వరినీ విమర్శించలేదు. ప్రశ్నించలేదు. ఇదే స్థానంలో మరో ఎంపి ఉంటే, పార్టీ ఇలాగే వ్యవహరించేదా? ఇలా జరిగితే ఆ ఎంపి ఊరుకుంటారా? అని' ఆమె ఇటీవలే అధిష్ఠానం తనను పూచిక పుల్లలా ఎలా తీసి పారేసిందో కార్యకర్తలకు వివరించారు. ఈ సందర్భంగా పార్టీ మారినా, మీ వెంటే ఉంటామని చాలామంది చిన్నమ్మకు భరోసా ఇచ్చినట్లు సమాచారం.
మరి కాంగ్రెస్‌లో దక్కని గౌరవం దగ్గుబాటి దంపతులకు కమలంలో దక్కుతుందా? పురందేశ్వరి, వెంకటేశ్వరరావుకు కమలతీర్థం అచ్చొస్తుందా అనేది భవిష్యత్లో తేలనుంది. వాస్తవానికి రాజకీయాల నుంచే తప్పుకోవాలని పురందేశ్వరీ భావించారట. అయితే కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఒప్పుకోలేదట. కుటుంబంగా భావించే విశాఖ కార్యకర్తల అభీష్ఠం మేరకే రాజకీయాల్లో కొనసాగాలని పురందేశ్వరీ నిర్ణయించుకున్నారట. ఒకసారి అలవాటు అయ్యాక 'ఎంతటి వారైనా..పదవికి దాసులే’ అనడానికి తాజా రాజకీయ పరిణామాలే ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు.