
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా: దగ్గుబాటి
తాను క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు పెద్ద అల్లుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వేంకటేశ్వరరావు ప్రకటించారు. శుక్రవారం ప్రకాశం జిల్లా కారంచేడులో ఆయన స్వగృహంలో మాట్లాడుతూ... రాష్ట్ర విభజనతో తాను తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెప్పారు. అందువల్లే క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి దగ్గుబాటి వేంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు. అయితే ఆయన భార్య కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురందేశ్వరీ నేడు భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరిపై నిరసనగా ఆ పార్టీకి, కేంద్ర మంత్రి పదవికి పురందేశ్వరీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.