సీతారామస్వామికి పూజలు చేస్తున్న చొక్కా శ్రీనివాసులు,ఈదూరు రాజమ్మ కాలనీలో నిర్మించిన సీతారామస్వామి ఆలయం
దళితుల ఆలయ ప్రవేశానికి గతంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో అవగాహన కల్పించాల్సిన పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దళితులనే ఆలయాలకు అర్చకులుగా నియమిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసే నిధులతో దేవాదాయ ధర్మాదాయ శాఖ, సమరసత సేవా ఫౌండేషన్ పర్యవేక్షణలో జిల్లాలోని దళితవాడల్లో ఆలయాలు నిర్మిస్తున్నారు. వీటికి స్థానిక దళితులను అర్చకులుగా నియమించి, సరికొత్త అధ్యాయానాకి శ్రీకారం చుట్టారు.
ముత్తుకూరు: జిల్లాలో 2017–18 సంవత్సరంలో టీటీడీ 64 ఆలయాలు నిర్మించింది. ముత్తుకూరు మండలంలోనే నాలుగు ఆలయాలు నిర్మించారు. కృష్ణపట్నం పంచాయతీలోని కావలిదళితవాడలో నిర్మించిన చెన్నకేశవస్వామి ఆలయంలో కావలి మస్తానయ్య అనే ఎస్సీని అర్చకుడిగా నియమించారు. ముత్తుకూరులోని ఈదూరు రాజమ్మ కాలనీ నిర్మించిన సీతారామస్వామి ఆలయంలో చొక్కా శ్రీనివాసులు అనే ఎస్టీని పూజారిగా నియమించారు. గోపాలపురంలో నిర్మించిన పాండురంగస్వామి ఆలయంలో ఎస్సీని, అచ్చన్నతోపులో నిర్మించిన సీతలాంబ–పోతురాజు ఆలయంలో ఎస్టీని పూజారులుగా నియమించారు. ఒక్కొక్క ఆలయ నిర్మాణానికి టీటీడీ రూ.5 లక్షలు విడుదల చేస్తోంది. నిధులు చాలని పక్షంలో స్థానిక దాతల సహకారంతో నిర్మాణాలు పూర్తి చేసి, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
హిందూ ధర్మ ప్రచారం కోసం..
దళితవాడల్లో మత మార్పిడులను అరికట్టి హిందూ ధర్మ ప్రచారం కోసం టీటీడీ చేపట్టిన ఈ బృహత్ కార్యానికి సమరసత సేవా ఫౌండేషన్ వెన్నుదన్నుగా నిలిచింది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆలయాల నిర్మాణ బాధ్యతలు స్వీకరించింది.
15 రోజుల పాటు శిక్షణ
ఆలయాల అర్చకులుగా ఎంపిక చేసే దళితులకు టీటీడీకి చెందిన శ్వేత భవనంలో 15 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. భక్తులను ఎలా ఆకర్షించాలి, వారితో ఎలా సంభాషించాలి, ఉపచారాలు, దేవతార్చన ఎలా చేయాలి అనే అంశాలపై శిక్షణ ఇస్తారు. ఆలయాల బాధ్యత స్వీకరించిన తర్వాత స్వయంకృషితో మంత్రాలు, స్తోత్రాలు, అర్చనలు నేర్చుకోవాలి.
వచ్చే ఏడు బీసీ కాలనీల్లో ఆలయాలు
వచ్చే సంవత్సరం నుంచి బీసీ కాలనీల్లో కూడా ఆలయాలు నిర్మించాలని సంకల్పించాం. బీసీలనే అర్చకులుగా నియమిస్తారు. టీటీడీ సహకారంతో స్థానిక దాతల సాయంతో ఈ దైవ కార్యం నిర్వర్తిస్తున్నాం. దళితుల్లో దేవాలయాల పట్ల నమ్మకం, విశ్వాసం కలిగించాలన్నదే మా ధ్యేయం. మన రాష్ట్రంలో 500 ఆలయాలు నిర్మాణంలో ఉన్నాయి. దళితులు అర్చకులుగా ఉన్న ఆలయాలకు భక్తులు విశేషంగా రావడమే దీనికి తార్కాణం.–టీవీ కృష్ణకుమార్, సభ్యుడు, సమరసత సేవా ఫౌండేషన్
అర్చకుడు కావడం నా అదృష్టం
నేను ఎస్టీని. బీకాం పూర్తి చేశాను. ఆలయానికి అర్చకుడు కావడం ఊహించని అదృష్ణం. ఉద్యోగాన్వేషణలో ఉండగా ఈ అవకాశం దక్కింది. టీటీడీలో 15 రోజులు శిక్షణ ఇచ్చారు. ముత్తుకూరు శివాలయంలో మరో 30 రోజులు గురువుల వద్ద శిక్షణ తీసుకున్నా. మంచి విషయాలు నేర్చుకున్నా. ఖాళీగా ఉన్నపుడు ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతున్నా. శివాలయానికి భక్తులు బాగానే వస్తున్నారు.
–చొక్కా శ్రీనివాసులు, అర్చకుడు, సీతారామస్వామి ఆలయం
Comments
Please login to add a commentAdd a comment