డామిట్.. కథ అడ్డం తిరిగింది!
విమానాశ్రయ భూసమీకరణపై రైతుల వ్యతిరేకత
మొదటి విడతకూ అంగీకరించబోమని వెల్లడి
రాజధాని ప్రాంతంలో కేటాయింపుపై అనుమానాలు
విజయవాడ : గన్నవరం విమానాశ్రయం విస్తరణకు అవసరమైన భూములు సమీకరించేందుకు ప్రభుత్వం చేస్తున్న యత్నాలను రైతులు తిప్పికొట్టారు. ఎట్టి పరిస్థితిలోను తమ భూములు ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వబోమని అధికారులకు తెగేసి చెప్పారు. విమానాశ్రయం విస్తరణలో భాగంగా రెవెన్యూ అధికారులు ఆదివారం అవగాహన సదస్సుల పేరిట గన్నవరం మండలంలో బుద్ధవరం, అజ్జంపూడి, చిన అవుటపల్లి గ్రామాల్లో పర్యటించారు. భూ సమీకరణకు అంగీకరించిన వారినుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు పథకం రచించారు. ల్యాండ్ పూలింగ్‌కు సహకరించి ఫారం-3 ఇస్తే రాజధాని ప్రాంతం ప్యాకేజీ ఇస్తామని ప్రభుత్వం తరఫున అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో గ్రామాల్లో భూములు కోల్పోతున్న రైతాంగం మొదటి విడత 750 ఎకరాల భూసమీకరణకు కూడా సహకరించేది లేదని స్పష్టం చేశారు. తమ భూములు ఇవ్వబోమంటూ ఫారం-2 దరఖాస్తులను అధికారులకు అందించారు. మొదటి విడత భూసమీకరణకు ఆరు మాసాల క్రితం కలెక్టర్‌తో జరిపిన చర్చల్లో సగం మంది రైతులు అంగీకరించారు.
ఫారం-2 ఇచ్చేందుకు సిద్ధం
తాజాగా ఏలూరు కాల్వ మళ్లింపునకు మరో 450 ఎకరాలు జక్కులనెక్కలం, సావరగూడెం, కేసరపల్లి, గన్నవరం, మర్లపాలెం, చిన అవుటపల్లి, పెద అవుటపల్లి గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆయా గ్రామాల్లో సోమవారం అధికారులు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ల్యాండ్‌పూలింగ్‌కు భూములు ఇచ్చే వారి నుంచి ఫారం-3 దరఖాస్తులు స్వీకరించేందుకు కార్యక్రమాన్ని రూపొందించారు. దీంతో ఏలూరు కాల్వ మళ్లింపునకు కూడా భూములు ఇచ్చేది లేదని రైతులు అధికారులకు లిఖిత పూర్వకంగా ఫారం-2ను ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. భూములు తీసుకున్నాక రాజధాని ప్రాంతంలో స్థలం కేటాయించటంలో ఆలస్యం అయితే తమ గతేంటని ఆదివారం నాటి సదస్సుల్లో అధికారులను ప్రశ్నించారు. నూజివీడు సబ్-కలెక్టర్, గన్నవరం తహశీల్దార్, ఇతర అధికారులు రైతుల నుంచి వచ్చిన వ్యతిరేకతను సర్దుబాటు చేసి ల్యాండ్ పూలింగ్‌కు ఒప్పించేందుకు విఫలయత్నాలు చేశారు.