అనంతపురం స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : ‘అనంత’ క్రికెట్ చరిత్రలో డీబీ ప్రశాంత్‌కుమార్ సరికొత్త అధ్యాయానికి తెరతీశాడు. చిన్న వయసు(21)లోనే ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్సీ దక్కించుకుని..సంచలనం సృష్టించాడు. షాబుద్దీన్, ప్రసాద్‌రెడ్డి, ఫయాజ్ అహ్మద్, నూర్ మహ్మద్ ఖాన్, కృష్ణమోహన్, సురేష్ వంటి వారు ఆంధ్ర రంజీ జట్టుకు ఆడినా...వీరెవరికీ సాధ్యంకాని రీతిలో ప్రశాంత్ కేవలం 15 మ్యాచ్‌ల అనుభవంతోనే ‘నాయకుడి’గా ఎదిగాడు. అసమాన ప్రతిభా పాటవాలతోనే ఈ ఘనత సాధించగలిగాడు.
ప్రశాంత్ కెప్టెన్ కావడం జిల్లాకే గర్వకారణంగా చెప్పుకోవచ్చు. గతంలో షాబుద్దీన్ కూడా ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, అతనికి చాలా మ్యాచ్‌ల తర్వాత అవకాశం వచ్చింది. ఇటీవల జట్టు కెప్టెన్ కమ్ మెంటర్ బాధ్యతల నుంచి అమోల్ మజుందార్ తప్పుకోవడంతో ప్రశాంత్‌కు కెప్టెన్సీ అప్పగిస్తూ ఆంధ్ర క్రికెట్ సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలలో విశాఖపట్నంలో హిమాచల్‌ప్రదేశ్‌తో జరగనున్న మ్యాచ్ నుంచి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ప్రశాంత్ 2010లో తొలిసారి రంజీ జట్టుకు ఎంపికయ్యాడు. తొలి మ్యాచ్ త్రిపురతో ఆడాడు. రెండో మ్యాచ్‌లోనే విదర్భపై సెంచరీ చేశాడు.
ఇప్పటివరకు 15 రంజీ మ్యాచ్‌లాడి... మొత్తం 730 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలున్నాయి. ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లలో 282 పరుగులు చేశాడు. అండర్ -19, 25 రాష్ట్ర స్థాయి మ్యాచ్‌లలోనూ సెంచరీల మోత మోగించాడు. ఇతని స్వస్థలం అనంతపురం. నగరంలోని విన్సెంట్ ఫై కాలనీలో నివాసముంటున్నారు. తండ్రి డి.రాజన్న రేడియోస్టేషన్ రిటైర్డ్ ఇంజనీర్. ప్రశాంత్‌కు నలుగురు సోదరులు, సోదరి ఉన్నారు. వీరందరూ క్రికెటర్లే. సోదరి అనిత జాతీయ స్థాయిలో రాణించి, రైల్వేలో టీటీఈగా ఉద్యోగం సంపాదించారు. సోదరులు వినోద్, డేవిడ్ రాష్ట్ర స్థాయిలోను, అనిల్‌కుమార్, రాజ్‌కుమార్ జోనల్ స్థాయిలోనూ క్రికెట్ ఆడారు. వీరిని ఆదర్శంగా తీసుకున్న ప్రశాంత్ నాన్న ప్రోత్సాహంతో బ్యాట్ పట్టుకున్నాడు. 2000 సంవత్సరంలో జిల్లా క్రికెట్ సంఘం ప్రస్తుత ఉపాధ్యక్షుడు టీవీ చంద్రమోహన్‌రెడ్డి వద్ద ఓనమాలు నేర్చుకున్నాడు. అండర్-13 క్రికెట్ మొదలుపెట్టినప్పుడు కాస్త తడబడినా ... ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. అండర్ -14, 16, 19 విభాగాల్లో చెలరేగిపోయాడు. అండర్ -19లో రెండు, అండర్ -22లో మూడు సెంచరీలు సాధించి రంజీ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. 2011-12 సీజన్‌లో రంజీ అవకాశం దక్కింది. రెండో మ్యాచ్‌లోనే సెంచరీ చేసి సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టాడు. 2012లో అండర్ -25 విభాగంలో చత్తీస్‌ఘడ్‌పైనా సెంచరీ (105)చేశాడు. ఈ ఏడాది సౌత్‌జోన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. సెంట్రల్‌జోన్‌పై 298 పరుగులు చేసి..సత్తా చాటాడు. ప్రశాంత్ ఎదుగుదలలో ఆర్డీటీ సహకారం కూడా ఉంది.
అనంత ఆణిముత్యం
Published Wed, Dec 4 2013 3:21 AM | Last Updated on Sat, Aug 18 2018 4:18 PM
Advertisement