నెల్లూరు (అర్బన్) : అమెరికాలోని కాలిఫోర్నియాలో మృతి చెందిన నెల్లూరుకు చెందిన సాయిసింధు (25) భౌతికకాయం ఆదివారం నగరానికి చేరుకుంది. సింధుని ఆమె భర్తే కడతేర్చాడని ఈ నెల 11వ తేదీన ఆమె తల్లిదండ్రులు కిన్నెర కృష్ణయ్య, ఉమామహేశ్వరి ఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇండియన్ ఎంబసీ అధికారులు, స్థానిక తెలుగు అసోసియేషన్ సహకారంతో సింధు భౌతికకాయం నెల్లూరుకు తెప్పించారు. అమెరికా నుంచి కార్గో విమానంలో శనివారం సింధు భౌతికకాయం హైదరాబాద్‌కు చేరుకుంది.
అక్కడ నుంచి తల్లిదండ్రులు, బంధువులు అంబులెన్స్‌లో ఆది వారం ఉదయం 8.30 గంటలకు నగరంలోని సవరాల వీధిలో ఉన్న ఆమె ఇంటికి తీసుకువచ్చారు. సింధు భౌతికకాయం రావడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధుమిత్రులు వచ్చి సింధు మృతదేహాన్ని చూసి విలపించారు. తల్లిదండ్రులు తమ కుమార్తె మృతదేహం రావడంతో చూసి గుండెలవిసేలా రోదించారు.
పోలీసులకు ఫిర్యాదు :
ఇది వరకే ఎస్పీకి ఫిర్యాదు చేసిన సాయి సింధు తల్లిదండ్రులు ఆదివారం తమ కుమార్తె మృతి పై అనుమానాలు ఉన్నాయని, మరోసారి మూ డో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రీ పోస్టుమార్టం నిర్వహించి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సీఐ బాజీజాన్ సైదా, ఎస్‌ఐ నాగేశ్వరరావు కేసు నమోదు చేశారు. నెల్లూరు తహశీల్దార్ జనార్దన్‌రావు సమక్షంలో శవ పంచనామా నిర్వహించారు.డీఎస్‌ఆర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సింధు భౌతికకాయానికి రీ పోస్టుమార్టం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సింధు ఇక లేదని...
పిల్లా పాపలతో సంతోషంగా ఉండాల్సిన తమ కుమార్తె సాయి సింధు పెళ్లయిన మూడున్నర సంవత్సరాలకే చనిపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. వీరిని చూసి చుట్టుపక్కల వాళ్లు చలించిపోయారు. గతేడాది ఆగస్టులో సింధు నెల్లూరులోని తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. భర్త ఉదయ్‌కుమార్ వేధిస్తున్నాడని వారి దృష్టికి తీసుకు వచ్చింది.
వాళ్లు తమకు ఉండేది ఇద్దరు కుమార్తెలని, ఆస్తి వారికే ఇస్తామని చెప్పి ఒక ఎకరా పొలం రాసిస్తామన్నారు. భర్త సరేనని ఒప్పుకోవడం సింధు అమెరికాకు వెళ్లింది. అంతా సజావుగా ఉందనుకున్న సమయంలో ఈ నెల 6వ తేదీన సింధు ఆత్మహత్యాయత్నం చేసిందని, 9వ తేదీన చనిపోయిందని ఉదయ్‌కుమార్ సింధు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో వాళ్లు అప్పటి నుంచి సింధు భౌతికకాయాన్ని నెల్లూరుకు తెప్పించేందుకు ప్రయత్నాలు చేశారు.
నెల్లూరుకు సింధు భౌతిక కాయం
Published Mon, Feb 16 2015 2:32 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement