యాదవుల సమస్యలు పరిష్కరిస్తా
తిరుపతి కల్చరల్: తెలుగుదేశం పార్టీ గెలుపులో భాగస్వాములైన యాదవుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. యాదవ ప్రముఖుడి విగ్రహాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయిస్తానన్నారు. అలాగే యాదవుల భవన నిర్మాణానికి ఎకరా భూమిని ఇచ్చేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతిలోని ఇందిరామైదానంలో యాదవ ప్రజాప్రతినిధుల సన్మాన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ బీసీల ఓట్లతోనే రాష్ట్రంలో చంద్రబాబు సహా అందరూ గెలిచారన్నారు. బీసీలంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీ అని నిరూపించారని తెలిపారు. అనంతరం సన్మాన గ్రహీత తంబళ్లపల్లె ఎమ్మెల్యే శంకర్ యాదవ్ మాట్లాడుతూ యాదవుడైన తనకు చంద్రబాబు సీటు కల్పించడంతో బీసీల అండతో విజేతగా నేడు వేదికపై నిలబడ్డానన్నారు.
గతంలో తనకు వైఎస్‌ఆర్ రాజకీయ అవకాశం కల్పించినా కొందరి కుట్ర కారణంగా స్వల్ప తేడాతో ఓటమి చవి చూడాల్సి వచ్చిందన్నారు. చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను జీవితంలో ఎదగాలనే లక్ష్యంతో సేవా ట్రస్ట్ ఏర్పాటు చేసి నిరుపేదలందరికీ సేవలు అందిస్తున్నానన్నారు. తన గెలుపునకు కృషి చేసిన బీసీలందరికీ అండగా ఉండి ఆదుకుంటానని భరోసా ఇచ్చారు.
అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు అన్నారామచంద్రయ్య మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేగా యాదవుల నుంచి శంకర్ గెలుపొందడం గర్వకారణమన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ యాదవుల సంక్షేమాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. టీటీడీ బోర్డులో శాశ్వత సభ్యుడుగా యాదవుల్లో ఒకరికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు తిరుపతి మున్సిపాలిటీ కార్పొరేషన్ మేయర్ పదవి యాదవులకు కేటాయించాలని డిమాండ్ చేశారు.
అనంతరం తంబళ్లపల్లె ఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌ను అతిథులతో పాటు యాదవ సంఘ నాయకులు పూలమాల లు, శాలువలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. జిల్లా వ్యాప్తంగా గెలుపొందిన జెడ్‌పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులను ఘనంగా సత్కరించారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిత్య, తిరుపతి ఎ మ్మెల్యే వెంకటరమణతో పాటు బీసీ, యాదవ నాయకులు నరసింహయాదవ్, అశోక్‌సామ్రాట్ యాదవ్, కృష్ణయ్య యాదవ్, పుష్పావతి, ఆనంద్ యాదవ్, అక్కినపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.