ఏపీలో చీప్ లిక్కర్ కొరత
నాటుసారా, కల్తీ మద్యం, లూజు విక్రయాలను నియంత్రించేందుకు చవక ధరలకు (చీప్ లిక్కర్) మద్యాన్ని టెట్రా ప్యాక్‌ల్లో అందిస్తామని ప్రభుత్వం చేసిన విధాన ప్రకటన అమలుకు నోచుకోవడం లేదు. అల్పాదాయ వర్గాలు ఎక్కువగా తాగే చీప్ లిక్కర్‌ను అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వం అది చేయకపోవడంతో నాటుసారా, కల్తీ కల్లు, గుడుంబా లాంటివి తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
కల్తీ మద్యం సేవించి కృష్ణా జిల్లాలో సోమవారం ఏడుగుగురు మృతి చెందగా, మరో 35 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకం జరిగినా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించడం లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో చీప్ లిక్కర్‌కు గేట్లు బార్లా తెరిచినా డిస్టిలరీలు మాత్రం ఉత్పత్తికి ముందుకు రాలేదు. చౌక మద్యంపై ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ తగ్గించినా తయారీకి ఉత్పత్తి కంపెనీలు ససేమిరా అంటున్నాయి. దీంతో రాష్ట్రంలో చీప్ లిక్కర్ కొరత ఏర్పడింది. మార్కెట్లో చౌకమద్యం దొరక్క నాటుసారా, కల్తీ కల్లు విక్రయాలు బాగా పెరిగాయి. గతంలో అన్ని జిల్లాల్లో కలుపుకొని రోజుకు 30 వేల లీటర్ల నాటుసారా అమ్ముడయ్యేది. ఇప్పుడు ఏపీలో సారా విక్రయాలు రోజుకు 50 వేల లీటర్ల వరకు జరుగుతున్నట్లు అంచనా.
20 శాతం చీప్ లిక్కర్ తయారు చేయాల్సిందే..
ఏపీలో మొత్తం 14 లైసెన్స్‌డ్ డిస్టిలరీలున్నాయి. వీటి ఉత్పాదక సామర్ధ్యం 1,221.58 లక్షల ప్రూఫ్ లీటర్లు. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు తమ డిస్టిలరీల్లో 20 శాతం చీప్ లిక్కర్ బ్రాండ్లను ఉత్పత్తి చేస్తామని కంపెనీల నిర్వాహకులు అంగీకార పత్రం ఇస్తారు. అయితే డిస్టిలరీలు కేవలం ప్రముఖ బ్రాండ్లను తయారు చేస్తూ చౌక మద్యాన్ని తయారు చేయకపోవడం వల్ల కొరత ఏర్పడింది.
హాలోగ్రామ్ అసలు సమస్యా...
లూజు విక్రయాలను నిరోధించేందుకు 60 మిల్లీ లీటర్ల చీప్ లిక్కర్ బాటిల్స్ అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావించింది. 60 మిల్లీ లీటర్ల బాటిల్ రూ.20కే అందించాలని నిర్ణయించింది. అయితే నిబ్ బాటిళ్ల తయారీకి హాలోగ్రామ్‌తో కూడిన లేబుల్ వేసేందుకు అదనంగా ఖర్చు కావడంతో వీటిని తయారు చేయలేమని, లీటరు బాటిల్ తయారు చేస్తామని తెగేసి చెబుతున్నాయి. డిస్టిలరీ కంపెనీలపై ఒత్తిడి తీసుకువచ్చి చీప్ లిక్కర్‌ను ఉత్పత్తి చేయించడంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. టెట్రా ప్యాక్‌లో చీప్ లిక్కర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించినా టెట్రా ప్యాక్ తయారీకి చైనా నుంచి మిషన్లు కొనుగోలు చేయాల్సి ఉన్నందున ఉత్పత్తి కంపెనీలు వాటి జోలికెళ్లడం లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం రెండు డిస్టిలరీ కంపెనీలు మాత్రమే చౌకమద్యం ఉత్పత్తి చేయడం గమనార్హం.