సాక్షి, గుంటూరు: వెంటిలేటర్‌పై ఉన్న పసికందును ఎలుకలు పీక్కుతిన్నాయి.. బతికున్న పసికందు చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారిస్తే స్మశానం వద్ద కదిలాడాడని కుటుంబ సభ్యులు వెనక్కు తెచ్చారు.. డబ్బు కోసం బిడ్డల్ని మార్చారంటూ ఆరోపణలు.. బాలింత చనిపోతే పది గంటల వరకూ చూడనేలేదు.. స్కానింగ్ కోసం వెళ్లిన గర్భిణిని పట్టించుకోకపోవడంతో గంటల కొద్దీ నిరీక్షించి స్కానింగ్ కేంద్రం వద్దే కిందపడిపోయి అక్కడే ప్రసవించింది. ఆ నెత్తుటి మరకలను గర్భిణి తల్లితోనే తుడిపించారు.
బతికుండగానే స్ట్రెచర్‌తో సహా ఓ వృద్ధుడ్ని బయటకు గెంటేశారు. సూదిమందు డ్యూటీ తమది కాదంటే తమది కాదంటూ వైద్యులు, స్టాఫ్ నర్సులు ఓ రోజంతా వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య సోదరికే సూది మందు ఇవ్వకుండా ఉంచిన విచిత్ర ఘటన.. మానవత్వానికే మచ్చ తెచ్చేలా ఉన్న ఇవన్నీ మారుమూల పీహెచ్‌సీలో కాదు.. నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరంగా ఉన్న గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జీజీహెచ్)లో జరుగుతున్న వరుస దారుణాలు.. ఇక్కడ నిత్యం 20 మందికిపైగా మృత్యువాత పడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రైవేటు క్లినిక్‌లకే అధిక సమయం
అధికారికంగా 1177 పడకలు, అనధికారికంగా 1700కుపైగా పడకలతో అతి పెద్దదిగా పేరొందిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి పరిస్థితి ఊరుగొప్ప.. పేరుదిబ్బలా తయారైంది. అత్యవసర వైద్యసేవలు పొందాలంటే రోగులకు కష్టంగా మారింది. ఫలితంగా ఈ ఆసుపత్రిలో మరణాల రేటు రోజురోజుకూ పెరుగుతోంది. వైద్య ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆస్పత్రిలో అందుబాటులో ఉండటం లేదు. ప్రైవేటు క్లినిక్‌లకే వారు అధిక సమయం కేటాయిస్తున్నారు. క్యాజువాల్టీ, ట్రామాకేర్, ఐసీయూ, ఇతర ఎమర్జెన్సీ, గైనిక్ వార్డుల్లో రోగులకు సకాలంలో వైద్యసేవలందక మరణాలు పెరుగుతున్నాయి. కొందరు వైద్యాధికారుల తప్పిదాల కారణంగా ఆస్పత్రి మొత్తానికే చెడ్డ పేరు వస్తోంది.
నాలుగు వేలకుపైగా అవుట్ పేషెంట్లు
గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి గుంటూరుతోపాటు చుట్టుపక్కల ఆరు జిల్లాల ప్రజలు వస్తారు. రోజుకు దాదాపు 3, 500 నుంచి 4,000 వరకు అవుట్ పేషెంట్‌లు ఉంటారు. ఆస్పత్రిలోని వివిధ వార్డుల్లోకి రోగులు, వారి వెంట సహాయకులు కలిపి మొత్తం రోజుకు 10 వేల మంది వస్తుంటారు. ఇటీవల ఆస్పత్రి వైద్యుల సేవల తీరుపై భారీగా ఫిర్యాదులందుతున్నాయి. ఏ వార్డులోనూ సంబంధిత వైద్యాధికారులు అందుబాటులో ఉండటం లేదు. ఉన్నతాధికారులు తనిఖీల పేరుతో వార్డులు తిరుగుతున్నా వైద్య సిబ్బంది వ్యవహారశైలిని మాత్రం గాడిలో పెట్టలేకపోతున్నారు. జీజీహెచ్‌లోని పలు వార్డుల్లో గుండెల్ని పిండేసే ఘటనలు రోజుకొకటి కనిపిస్తున్నాయి.
పెరుగుతున్న మరణాల సంఖ్య
జీజీహెచ్‌లో 2017 జనవరి నుంచి సెప్టెంబర్ వరకూ తొమ్మిది నెలల్లో 5, 321 మంది మృతి చెందినట్లు అధికారిక లెక్క చెబుతున్నాయి. ఇంకా ఇక్కడ సరైన వైద్యం అందక వేరే ఆసుపత్రులకు తరలిస్తున్న సమయంలో జరిగిన మరణాలు చాలానే ఉన్నాయి. అత్యవసర వార్డుల్లో చేరిన రోగులే సకాలంలో వైద్యసేవలు అందక ప్రాణాలొదులుతున్నట్లు తెలుస్తోంది. క్యాజువాల్టీ , ట్రామాకేర్, ఎక్యుట్‌మెడికల్ కేర్ యూనిట్ (ఏఎంసీ), ఇంటెన్సివ్ మెడికల్ కేర్ యూనిట్ (ఐసీయూ)ల మరణాల రేటు ఎక్కువగా నమోదవుతోంది.
తీరుమార్చుకోని జీజీహెచ్ అధికారులు
ఆస్పత్రిలో అత్యవసర వైద్య చికిత్సల తీరును నిత్యం పర్యవేక్షించాల్సిన రెసిడెంట్ మెడికల్ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేసే వైద్యులు ఎంత మంది ప్రైవేట్ ప్రాక్టీసులు చేస్తున్నారు, వారు ఆసుపత్రిలో ఉంటున్నారా.. మధ్యలోనే వెళ్తున్నారా అనే విషయాలపై ఇంటిలిజెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం, ప్రభుత్వం కొందరిపైనే చర్యలు తీసుకోవడం తెలిసిందే. ఒక్కోమారు రాత్రిళ్లు కనీసం ఇంజెక్షన్‌లు చేయడానికి కూడా సిబ్బంది అందుబాటులో ఉండడం లేదు.
దీంతో అత్యవసర వార్డుల్లో మరణాల సంఖ్య అధికంగా నమోదవుతోంది గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ పోస్టులు అనేక ఏళ్లుగా సీనియర్లను కాదని రాజకీయ ఒత్తిళ్లతో తమకు ఇష్టమొచ్చిన వారిని కూర్చోబెడుతున్నారు. దీంతో సీనియర్ వైద్యులెవరూ వీరి మాటలు లెక్క చేయడం లేదు. ఇన్‌ఛార్జిలు కావడంతో వీరు సైతం వైద్యులు, సిబ్బందిపై సీరియస్‌గా దృష్టి సారించలేకపోతున్నారు. దీంతో జీజీహెచ్‌లో మరణాల సంఖ్య తగ్గడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment